దేశంలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. తాజాగా ఈ కేసుల సంఖ్య మూడున్నర లక్షలకు చేరువైంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,49,691 కేసులు నమోదు కాగా.. మరో 2767 మంది మృత్యువాత పడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 2,17,113 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,69,60,172కు చేరింది. కోలుకున్న వారు 1,40,85,110 మంది కాగా.. 1,92,311 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 26,82,751గా ఉంది. ఇక ఇప్పటి వరకూ మొత్తం 14,09,16,417 వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కూడా కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
మరోవైపు కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. అది ఇప్పుడు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తోంది. వెంటనే మెరుగైన హెల్త్‌కేర్ వసతులు కల్పించండి. లేదంటే కరోనా కేసులను తగ్గించండి. రోజూ ఇన్ని కేసులను భరించడం సాధ్యం కాదు అని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) చీఫ్ రణ్‌దీప్ గులేరియా స్పష్టం చేశారు.
అత్యవసరంగా కరోనా చెయిన్‌ను బ్రేక్ చేయాల్సిన అవసరం ఉన్నదని ఆయన తేల్చి చెప్పారు. దీనికోసం కనీసం పది శాతం పాజిటివిటీ రేటు ఉన్న ప్రాంతాల్లో లాక్డౌన్ విధించాల్సిందేనని కూడా ఆయన చెప్పారు. ప్రాణాలు కాపాడటం అనేది ముఖ్యం. కేసులు పెరిగిపోతుండటం వల్ల ఆరోగ్య వ్యవస్థ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ముందు కేసుల సంఖ్యను తగ్గించడంపై దృష్టి సారించాలి అని గులేరియా అన్నారు.
ప్రస్తుతం ఇండియాలో రోజువారీ కేసుల సంఖ్య మూడున్నర లక్షలకు చేరింది. నెల రోజుల కిందట ఈ కేసుల సగటు కేవలం 25 వేలు మాత్రమే. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్యే 25 లక్షలకుపైన ఉండటంతో హాస్పిటల్స్‌పై ఒత్తిడి తీవ్రంగా పెరిగింది. ఆక్సిజన్ కొరతతో ఎంతో మంది ప్రాణాలు వదులుతున్నారు.
దేశ రాజధానిలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉన్నదని, కొన్ని ప్రాంతాల్లో అధికంగా ఉన్న ఆక్సిజన్ సరఫరాను అన్ని ప్రాంతాలకు చేరవేసే ప్రయత్నం చేయాలని గులేరియా సూచించారు. కరోనా మొదటి వేవ్ చాలా నెమ్మదిగా సాగడంతో మౌలిక వసతులను మెరుగు పరచుకోవడానికి సమయం దక్కిందని, ఈసారి కేసులు ఈ స్థాయిలో పెరుగుతాయని ఊహించలేకపోవడం వల్లే ఈ పరిస్థి తలెత్తిందని ఆయన అభిప్రాయపడ్డారు.