Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గోదావరి: 12 రోజులుగా వరద ముంపులో ‘రామ్ చరణ్ రంగస్థలం’ గ్రామం..

గోదావరి: 12 రోజులుగా వరద ముంపులో ‘రామ్ చరణ్ రంగస్థలం’ గ్రామం..
, ఆదివారం, 11 ఆగస్టు 2019 (11:53 IST)
"గతంలో చాలా వరదలు చూశాము.. 1986 వరదలు మా జీవితాలను అతలాకుతలం చేశాయి. మళ్లీ 2006లో వచ్చిన వరదలు విలయం సృష్టించాయి. అయినా అప్పట్లో కూడా ఇంత నష్టం చూడలేదు. వరదలు వస్తే మూడు, నాలుగు రోజుల్లో పోయేవి. కానీ ఈసారి 12 రోజులుగా నీటిలో నానిపోతున్నాం. పశువులు, సామాన్లు వదిలి వెళ్లలేక వరద నీటిలోనే ఉంటున్నాం" అంటూ వాపోయారు తూర్పు గోదావరి జిల్లా పూడిపల్లి వాసి రత్నాజీ.

 
"వర్షాభావం వల్ల పంటలు లేవు. మాకు పనులు దొరకడం లేదు. ఇప్పుడు వరదలు వచ్చాయి. ఎటూ పోలేని పరిస్థితి. ఇక ఈసారి పంటలు వేయలేరు కాబట్టి మేము వలసలు పోవాల్సిందే" అంటున్నారు దేవిపట్నం వాసి వెంకటలక్ష్మి

 
"మా బడిలోకి నీరు రావడంతో మూతేశారు. పుస్తకాలు కూడా ఇంట్లో వదిలి పునరావాస కేంద్రానికి వచ్చేసాం.. తడిచాయో.. ఉన్నాయో కూడా తెలియదు. బడి తెరిచి 13 రోజులయ్యింది. ఈసారి ఆగస్టు15 కూడా కష్టమే" అంటుంది విద్యార్థిని మానస. దాదాపు పక్షం రోజులుగా వరద బాధితులుగా ఉన్న గోదారి తీరంలోని కొందరి అభిప్రాయాలు ఇవి.

 
దేవిపట్నం మండలంలో ఉన్న పూడిపల్లి సినిమా షూటింగులకు ప్రసిద్ధి. చిరంజీవి హీరోగా నటించిన ఆపద్బాంధవుడు, బాలకృష్ణ హీరోగా నటించిన బంగారు బుల్లోడు, అల్లరి నరేష్ హీరోగా నటించిన ప్రాణం వంటి చాలా సినిమాలు ఈ గ్రామంలో షూటింగ్ జరుపుకున్నాయి.
webdunia
రంగస్థలం షూటింగ్ జరిగినప్పుడు...

 
తాజాగా రామ్‌చరణ్ హీరోగా నటించిన రంగస్థలం చిత్రాన్ని కూడా ఈ గ్రామంలో చిత్రీకరించారు. కేవలం ఒకటి, రెండు రోజులు కాకుండా కొన్ని వారాల పాటు ఈ సినిమా షూటింగ్ ఇక్కడ జరపడం విశేషం. అలాగే హీరో రామ్ చరణ్‌తో పాటు సినిమాలో నటించిన చాలామంది నటులు షూటింగ్ కోసం ఈ గ్రామానికి వచ్చారు. కానీ, ఇప్పుడా గ్రామం అనూహ్యంగా పోటెత్తిన వరదనీటిలో విలవిల్లాడుతోంది. మునుపెన్నడూ చూడని వరదలివి అంటూ స్థానికులు చెబుతున్నారు.

 
ప్రభుత్వం అందించే ఆహారమే ఆధారం..
ఇళ్ళన్నీ నీటి పాలయ్యాయి. ఒక్క పూడిపల్లిలోనే 85 కుటుంబాల ప్రజలు నిరాశ్రయులయ్యారు. సామాన్లు స్థానికంగా ఉన్న ఇళ్ల డాబాల మీద కొందరు, ఎత్తులో ఉన్న ఇళ్లలో మరికొందరు భద్రపరిచారు. వృద్ధులు, చిన్న పిల్లలు కూడా వరదల్లో చిక్కుకున్నారు. వారికి ప్రభుత్వం సహాయ చర్యలు అందిస్తోంది. అందులో భాగంగా నిత్యం ఆహార సరఫరా జరుగుతోంది. ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఆహారం నాసిరకంగా ఉండడంతో అర్థాకలితోనే జీవనం చేస్తున్నామని దేవిపట్నం గ్రామ వాసి గేదెల శ్రీనివాసరావు తెలిపారు.
webdunia

 
‘అధికారులు పెద్దగా స్పందించడం లేదు’
వరదల సమయంలో ప్రభుత్వ అధికారుల స్పందన సరిగా లేదని శ్రీనివాసరావు ఆరోపించారు. ‘‘గతంలో వరదలు వచ్చినప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండేవారు. ఈసారి అలా జరగలేదు. ఇంతకు ముందుతో పోలిస్తే పెద్ద వరద వచ్చింది. కానీ అధికారుల స్పందన అలా లేదు. 12 రోజులుగా దేవిపట్నంలో కరెంట్ లేదు. కానీ సోలార్ లైట్లు కొందరికే ఇచ్చారు. కిరోసిన్ కూడా ఇవ్వలేదు. టార్పాలిన్ కూడా అటు పశ్చిమగోదావరిలో ఇచ్చారుగానీ మాకు ఇవ్వలేదు. భోజనం కూడా బాగోవడం లేదు. ఉడికీ, ఉడకని అన్నం, నీళ్ల చారు చాలామంది తినలేకపోతున్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు’’ అని చెప్పుకొచ్చారు.

 
గోదావరికి అటూ ఇటూ అంతే..
గోదావరి వరదల కారణంగా పూడిపల్లితో పాటు మండల కేంద్రం దేవిపట్నానికి కూడా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. తూర్పుగోదావరి జిల్లాలోని 26 గ్రామాలకు రాకపోకల కోసం పడవలు మినహా మరోదారి లేకుండా పోయింది. ప్రమాదమే అయినా సుడులు తిరుగుతున్న గోదావరిలో ఇంజిన్ బోటులపై ప్రయాణాలు చేస్తున్నారు.

 
పశ్చిమగోదావరి జిల్లాలో కూడా అదే పరిస్థితి. కొత్తూరు కాజ్ వే పై నీరు చేరిన తర్వాత ఏటా 16 గ్రామాలు జలదిగ్బంధనంలో ఇరుక్కుంటాయి. ఈసారి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా నెక్లెస్ బండ్ ఏర్పాటుతో పోలవరం మండల కేంద్రం బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వచ్చింది. కోతకు గురయిన నెక్లెస్ బండ్ ఎక్కడ ముంచుతుందోననే భయం వెంటాడుతోందంటూ పోలవరంవాసి మల్లిఖార్జున రావు చెప్పారు.

 
కాఫర్ డ్యాం కారణంగానే..
గతంలో ఎన్నడూ ఈ స్థాయి వరదలకు ఇంత నష్టం జరగలేదని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. దేవిపట్నం తహసీల్దార్ అలీ బీబీసీతో మాట్లాడుతూ ఈ విషయం అంగీకరించారు. గతంలో భద్రాచలం వద్ద 44 అడుగుల నీటిమట్టం నమోదయితే కొన్ని గ్రామాల్లో వరద నీరు చేరేది. కానీ ఈసారి 48 అడుగుల నీటి మట్టం నమోదైంది. ఊహించని రీతిలో నష్టం జరిగింది అంటూ చెప్పుకొచ్చారు.

 
ఈసారి వరదల్లో ఇంత నష్టానికి కారణం కాఫర్ డ్యాం నిర్మాణమేనని పూడిపల్లివాసి రామకృష్ణ తెలిపారు. ‘‘చాలా వరదలు చూశాం. కానీ దీని వల్ల నీరు దిగువకు వెళ్లకపోవడంతో బ్యాక్ వాటర్ మా ఊళ్లను ముంచేసింది. చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. లంకల్లో పశువులు కూడా పస్తులున్నాయి‘‘ అని చెప్పారు.
webdunia

 
మారుమూల గ్రామాల్లో దయనీయం..
తూర్పుగోదావరి జిల్లా లోని దేవిపట్నం మండల కేంద్రానికి ఎగువన ఉన్న గ్రామాల్లోనూ, పశ్చిమగోదావరి జిల్లా కి చెందిన కరుటూరు వంటి గ్రామాల్లో మరింత దయనీయంగా ఉంది. తమకు సహాయం అందడం లేదని కరెంట్, కమ్యూనికేషన్, రవాణా సదుపాయాలు లేని ఈ గ్రామాల్లో గిరిజనులు చెబుతున్నారు.

 
దేవిపట్నం మండలం అగ్రహారంలో బీబీసీ తో నాగరత్నం అనే మహిళ తన గోడు వెళ్లబోసుకుంది. ‘‘వారం రోజులుగా వరదల్లో ఉన్నాం.. ఒక్కసారి ఎస్సై గారు వచ్చి చూశారు. పిల్లలు, వృద్ధులను బోర్నగూడెం తీసుకెళ్లారు. ఇళ్ళు, సామాన్లు కోసం మేముండిపోయాం. మాకు ఒక నావ గానీ, బోటు గానీ ఏర్పాటు చేయాలని కోరాం. కానీ ఎవరూ పట్టించుకోలేదు. గోదావరి పెరుగుతున్నప్పుడు చీకటిలోనే వర్షం లో తడుస్తూ గట్టులెక్కి తలదాచుకున్నాం’’ అని చెప్పారు.

 
పునరావాసం లేదు.. ఉపాధి డబ్బులు రాలేదు
ప్రస్తుతం వరదల్లో చిక్కుకున్న గ్రామలన్నీ పోలవరం ముంపు ప్రాంతంలో ఉన్నాయి. ప్రాజెక్ట్ నిర్మాణానికి ముందే వారికి పరిహారం చెల్లించాల్సి ఉంది. కానీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అమలు చేయకపోవడంతో నిర్వాసితులు ఇంకా ఊళ్లలోనే ఉంటున్నారు. ఇప్పుడు కాఫర్ డ్యాం కారణంగా నష్టపోయామని చెబుతున్నారు. చివరకు చేసిన పనులకు కూడా ఉపాధి కూలీ చెల్లించలేదని వీరవరం పునరావాస కాలనీ లో ఉన్న వెంకట లక్ష్మీ అనే మహిళ తెలిపింది.

 
మే లో ఉపాధి పనులు చేశాం. నాలుగు వారాల డబ్బులు ఇవ్వాలి. వరదల వల్ల పనుల్లేవు. మా కష్టానికి కూలీ ఇస్తే కొంత బాగుండేది. అది కూడా ఇవ్వడం లేదు అంటూ చెప్పుకొచ్చారు.

 
బడులన్నీ నీళ్లలో..
బడి, గుడి తేడా లేకుండా అన్ని చోట్లా వరద నీరు చేరడంతో జులై 30 నుంచి దేవిపట్నం, పోలవరం ప్రాంతాల్లో బడులన్నీ మూతబడ్డాయి. విద్యార్థులంతా చదువులకు దూరమయ్యారు. దేవిపట్నం జూనియర్ కాలేజ్ సహా అనేక చోట్ల వరద నీరు చేరింది. పుస్తకాలు, ఇతర ఫర్నీచర్ నీటిలో నానుతోందని 7వ తరగతి విద్యార్థిని ఒకరు బీబీసీ కి తెలిపారు. వరదలు తగ్గిన తర్వాత కూడా వాటిని శుభ్రం చేసుకోవడం పెద్ద పని అని, ఈసారి ఆగస్టు15 ఎలా జరుపుకోవాలో తెలియడం లేదని ఆ విద్యార్థిని పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పంద్రాగస్టు : భారీ విధ్వంసానికి ఐసిస్ కుట్ర... ఉసిగొల్పుతున్న పాక్