Publish Date: Thu, 04 Feb 2021 (19:35 IST)
Updated Date: Thu, 04 Feb 2021 (19:36 IST)
చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలంలోని సామకోటవారిపల్లి పంచాయతీ టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న కె. ఓబుల్ రెడ్డి గురువారం తెల్లవారుజామున 5 గంటల నుండి కనపడలేదని వారి ఇంటిలోని పనిమనిషి తెలిపారు. టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా పంచాయతీలో గెలుపు రేసులో ఉన్నందున అధికార పార్టీ నాయకులు ఓబుల్ రెడ్డిని కిడ్నాప్ చేసి ఎక్కడో ఉంచినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఓబుల్ రెడ్డికి సంబంధించిన చొక్కా, చెప్పులు, సెల్ ఫోన్ అతని ఇంటిలోనే పడుకున్న మంచం వద్దనే ఉన్నట్లు తెలుస్తున్నది. మదనపల్లి మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఓటమి భయంతో అధికార వైఎస్సార్ పార్టీ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతుందని అన్నారు.
ఎన్నడూ లేనివిధంగా నిమ్మనపల్లి మండలంలో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయంటే వైసిపి నాయకులే కారణం అని తెలిపారు. పోలీసులు వెంటనే కిడ్నాప్ అయిన ఓబుల్ రెడ్డిని గుర్తించి సురక్షితంగా ఇంటికి వచ్చేలా చూడాలన్నారు. ఎస్సై లక్ష్మీనారాయణ సంఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు.