చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ క్లీనప్ పనులు ప్రైవేటీకరణ చేయడంపై తమిళనాడు రాజధాని చెన్నైలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇది పారిశుద్ధ్య కార్మికుల జీవనోపాధిని నాశనం చేసే చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సినీ నటుడు విజయ్ తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే పారిశుద్ధ్య కార్మికులకు మద్దతుగా సినీ ప్రముఖులు పలువురు నిలిచారు. ఇప్పటికే గాయని చిన్మయి పారిశుద్ధ్య కార్మికుల నిరసనకు మద్దతు తెలిపారు. తాజాగా నటుడు విజయ్ పారిశుద్ధ్య కార్మికులకు అండగా నిలుస్తామని ప్రకటించారు.
కరోనా పాండమిక్, తుఫానులు, వర్షాలు, వరదలు వంటి విపత్తుల సమయంలో, ప్రజల సంక్షేమాన్ని ముఖ్యమైనదిగా భావించి, తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల పాత్ర అపారమైనది. ఇంత అంకితభావంతో పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులకు కృతజ్ఞతగా, చెన్నై కార్పొరేషన్‌లో పరిశుభ్రత పనులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి వారి జీవనోపాధిని కోల్పోవడం సరికాదన్నారు.
ఇంకా డీఎంకే ప్రభుత్వంపై విజయ్ ఫైర్ అయ్యారు. పారిశుద్ధ్య కార్మికులు తమ జీవనోపాధిని కాపాడుకోవడానికి పగలు, రాత్రి పోరాడుతున్నారు. తమిళనాడు వెట్రి కళగం వారి నైతిక పోరాటానికి పూర్తిగా మద్దతు ఇస్తుందని విజయ్ ప్రకటించారు. ఇదే తరహాలో సినీ నటి సనమ్ శెట్టి కూడా పారిశుద్ధ్య కార్మికులకు తమ పూర్తి మద్దతు ప్రకటిస్తూ.. వారు నిరసన చేపట్టిన ప్రాంతానికి వెళ్లారు. అక్కడ వారితో నిరసనలో కూర్చున్నారు. వారికి మద్దతిస్తామని ప్రకటించారు. ఎన్నికలకు ముందు డీఎంకే ఇచ్చిన వాగ్ధానాన్ని విస్మరించిందని ఫైర్ అయ్యారు. అలాగే పారిశుద్ధ్య కార్మికుల కాంట్రాక్టుల నుంచి పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చి.. ప్రస్తుతం చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ క్లీనప్ పనులు ప్రైవేటీకరణ చేయడం సరికాదన్నారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయడంతో పాటు అదే జీతాన్ని తగ్గకుండా వారికి అందించాలనే డిమాండ్‌లను నెరవేర్చాలని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చి.. పారిశుద్ధ్య కార్మికులకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు. ఐదేళ్ల పాలన ముగియనున్న నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా ఎన్నికల ప్రచారాలకు వెళ్లకుండా.. పారిశుద్ధ్య కార్మికుల నిరసనను పట్టించుకోవాలని.. వారి జీవనోపాధికి సరైన సాయం అందించాలని డిమాండ్ చేశారు.