దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన మదనపల్లె జంట హత్యల కేసు నిందితులను డెల్యూషన్ వ్యాధి నుంచి బయటకు తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు వైద్యులు. 14 రోజుల రిమాండ్ తరువాత సబ్ జైలుకు నిందితులు పురుషోత్తం నాయుడు, పద్మజలను తరలించారు.
అయితే రిమాండ్‌లో ఉన్న సమయంలో మదనపల్లె సబ్ జైలులో గట్టిగా అరుస్తూ శివా..శివా అంటూ వింత శబ్ధాలతో పద్మజ నిద్ర పోకుండా రాత్రింబవళ్ళు అరుస్తూనే ఉన్నట్లు సబ్ జైలు సిబ్బంది వైద్యుల దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.
కానీ తిరుపతి రుయా ఆసుపత్రిలో కౌన్సిలింగ్ చేసిన తరువాత వైద్యులు తాము వీరికి వైద్యం చేయలేమని చేతులెత్తేశారు. అంతేకాదు ఆసుపత్రిలో వీరి జబ్బును నయం చేయడానికి కస్టోడియల్ కేర్ అవసరం. అది రుయా ఆసుపత్రిలో అందుబాటులో లేదు. వీరికి జబ్బు నయం కావాలంటే వైజాగ్ లోని మానసిక చికిత్స కేంద్రమే సహకరిస్తుందని వైద్యులు తేల్చి చెప్పారు.
దీంతో నిన్న రాత్రి తిరుపతిలోని రుయాలో ఉన్న ఇద్దరు నిందితులను తిరిగి మదనపల్లెకు తీసుకెళ్ళారు. సబ్ జైలులో రాత్రి ఉంచారు. ఈరోజు మెజిస్ట్రేట్ అనుమతి తీసుకున్న తరువాత వైజాగ్‌కు ఇద్దరు నిందితులను తరలించనున్నారు.