గత కొద్ది నెలలుగా బాలీవుడ్లో కలకలం రేపుతూ వచ్చిన డ్రగ్స్ వివాదం కొందరు సినీ ప్రముఖులను వెలుగులోనికి తెచ్చింది. నేటి యువతరం డ్రగ్స్‌కు అలవాటుపడి తమ జీవితాన్ని కోల్పోతున్నారు. ఎక్కువగా భాగ్యనగరంలో ఈ డ్రగ్స్ దందా కొనసాగడం అందర్ని ఆశ్చర్యంలోకి ముంచెత్తుతున్నది.
ఈ నేపథ్యంలో హైదరాబాదులో భారీగా డ్రగ్స్ బయటపడటం వివాదాస్పదంగా మారింది. హైదరాబాదులో డ్రగ్స్ ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో సల్మాన్, అహ్మద్‌లను తమ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారి నుంచి 200 గ్రాముల మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు.
గోవా నుంచి హైదరాబాదుకు డ్రగ్స్ తీసుకొస్తుండగా పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రముఖ పబ్‌లో మేనేజరుగా పనిచేస్తున్న సల్మాన్, 10 పబ్‌లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. గోవా నుంచి అమ్మాయిలను రప్పించి వారి ద్వారా పబ్‌కు వచ్చే వారికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా అమ్మాయిలతో వ్యభిచారం కూడా నిర్వహిస్తున్నట్లు తేలింది. దీంతో సల్మాన్ డ్రగ్స్ సరఫరా చేస్తున్న 10 పబ్‌ల డేటాను పోలీసులు సేకరిస్తున్నారు.