నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈరోజు మధ్యాహ్నం 12.23 గంటలకు జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు.
ఈ నేపథ్యంలో జగన్ ప్రమాణస్వీకారం చేసే సమయంలో ఆకాశం నుంచి పూలవర్షం కురిపించాలని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ నిర్ణయించారు. ఇందులో భాగంగా ఓ హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకున్నారు. జగన్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా పూల వర్షం కురిపించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
ఇదిలా ఉంటే..ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత జగన్ కీలకమైన ప్రకటన చేస్తారని సమాచారం. ముఖ్యంగా నెలకు ఒక్క రూపాయి జీతం మాత్రమే తీసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి జీతం నెలకు రూ. 2.5 లక్షలు. ఇతర అలవెన్సులు అన్నీ కలిపితే 4 నుంచి 5 లక్షల వరకు వస్తుంది.
ఈ నేఫథ్యంలో ఎన్టీఆర్ బాటలో జగన్ నడవాలని చూస్తున్నారు. గతంలో దివంగత ఎన్టీఆర్ కూడా ముఖ్యమంత్రిగా నెలకు ఒక్క రూపాయి జీతాన్ని మాత్రమే తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో జగన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు సమాచారం.