Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్ గెలుపుతో మారిన రాజకీయాలు... కేసీఆర్‌లో మార్పు దేనికి సంకేతం?

జగన్ గెలుపుతో మారిన రాజకీయాలు... కేసీఆర్‌లో మార్పు దేనికి సంకేతం?
, సోమవారం, 27 మే 2019 (17:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ సీపీ విజయంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలు నివురు గప్పిన నిప్పులా ఉండేవి. కానీ, ఎన్నికల్లో జగన్ గెలిచారు. ఆ తర్వాత హైదరాబాద్‌ వెళ్లిన జగన్ తొలుత గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో సమావేశమై, అటు పిమ్మట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య అనేక అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా, విభజన అంశాలతో పాటు... ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై చర్చించారు. 
 
అదేసమయంలో తనకు కావాల్సిన ఐపీఎస్ అధికారులను కొంతమందిని జగన్ మోహన్ రెడ్డి ఎంపిక చేశారు. వీరంతా తెలంగాణ కేడర్ కింద తెలంగాణా రాష్ట్రంలో పని చేస్తున్నారు. వీరిని తమకు డిప్యూటేషన్‌పై కేటాయించాల్సిందిగా జగన్ కోరడం జరిగింది. ఇలాంటి అధికారుల్లో స్టీఫెన్ రవీంద్ర, గౌతం సవాంగ్‌లు ఉన్నారు. ఈ ఇద్దరిలో స్టీఫెన్ రవీంద్రను ఇంటెలిజెన్స్ చీఫ్‌గాను, గౌతం సవాంగ్‌ను రాష్ట్ర పోలీస్ డీజీపీగా నియమించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఇద్దరు అధికారులను డిప్యూటేషన్‌పై పంపించేందుకు తెలంగాణ సీఎం సమ్మతించగా, కేంద్ర హోం శాఖ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వినికిడి. 
 
ఇదిలావుంటే, జగన్‌తో సమావేశం తర్వాత కేసీఆర్ తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. ఆదివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న ఆయనకు వైకాపా నేతలు ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత సోమవారం ఉదయం శ్రీవారిని, తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఆ పిమ్మట సీఎం కేసీఆర్ నేరుగా వైకాపా సీనియర్ నేత, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటికెళ్లి ఆతిథ్యాన్ని స్వీకరించారు. రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ ఒక్క రాజకీయ నేత ఇంటికి వెళ్లిన దాఖలాలు లేవు. అలాగే, జగన్ అడిగిన అన్ని అంశాలపై కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.
 
మరోవైపు, ఈ నెల 30వ తేదీన జగన్ మోహన్ రెడ్డి నవ్యాంధ్ర కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం కేసీఆర్ తన కుటుంబ సమేతంగా హాజరుకానున్నారు. ఆ తర్వాత జగన్ ఇంట్లో ఆతిథ్వం స్వీకరించిన తర్వాత జగన్, కేసీఆర్‌లు కలిసి నేరుగా ఢిల్లీకి వెళ్లి, ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ఇలాంటి సుహృద్భావ వాతావరణం గత ఐదేళ్ల కాలంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఎన్నడూ చూసిన దాఖలాలు లేవు. మొత్తంమీద జగన్ ముఖ్యమంత్రి కావడాన్ని నవ్యాంధ్ర ఓటర్లు ఏ విధంగా అయితే స్వాగతిస్తున్నారో.. అలాగే, సీఎం కేసీఆర్ కూడా స్వాగతించడం ఇరు రాష్ట్రాలకు శుభదాయకమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాబోయే ముఖ్య‌మంత్రి శ్రీ జగన్ గారి స‌మీక్ష‌కు సిద్ధం కండి...