రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు ఎంతవరకైనా దిగజారుతాడని నగిరి ఎమ్మెల్యే ఆర్కే. రోజా విమర్శించారు. ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ దగ్గర నుండి ప్రభుత్వం లాక్కుని ఆయనకు మైక్ కూడా ఇవ్వకుండా అసెంబ్లీ నుండి పంపించడం చూసామని, జరగని విషయాన్ని జరిగినట్లుగా ప్రజలందరిని నమ్మించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నారని రోజా అన్నారు.
కుప్పంలో మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిపాలు కావడంతో ప్రజలను డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు కొత్త రాజకీయాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆమె ఆరోపించారు. అసెంబ్లీలో చంద్రబాబునాయుడు చెప్పిన విధంగా ఏమీ జరుగలేదని, కేవలం రాజకీయ లబ్ధి కోసం, సింపతీ కోసం చంద్రబాబు డ్రామా ఆడుతున్నారని అన్నారు.
వైసీపి ఎవరిని అవమానించిన దాఖలాలు లేవని, ఇంకా టిడిపి నాయకులే సీఎంను ఏవిధంగా మాట్లాడారో ప్రజలందరూ చూసారని ఆమె గుర్తు చేశారు. డ్రామాలు వేస్తే ప్రజలు నమ్మే పరిస్ధితిలో లేరు అనే విషయం చంద్రబాబు నాయుడు గ్రహించాలన్నారు. కుటుంబ గౌరవాన్ని కాపాడిన వ్యక్తే.. రాజకీయ లబ్ధి కోసం కుటుంబ గౌరవాన్ని బజారుపాలు చేయడం కరెక్ట్ కాదన్నారు.
టిడిపి నాయకులు వెనుక ఉండి కేసులు వేయించి మూడు రాజధానులకు అడ్డుపడుతున్నారని, సీఎం ప్రజల ప్రయోజనాల కోసం అభివృద్ధిని మూడు ప్రాంతాల్లో చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లో అభివృద్ధి కేంద్రీకరిస్తే రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఏవిధంగా ఆంధ్ర ప్రజలు నష్టపోయారో చూసామని, అందుకే అమరావతిలో అభివృద్ధిని కేంద్రీకరించడం ద్వారా ఇటు ఉత్తరాంధ్ర, అటు రాయలసీమ ప్రజలు నష్టపోతారని తెలియజేశారు.
అన్ని ప్రాంతాల ప్రజల నుండి సమస్యలు తెలుసుకుని, వారి అభిప్రాయాలను స్వీకరించిన తరువాతే సీఎం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని ఆమె తెలిపారు. కోర్టులో బిల్లు వెనక్కి తీసుకున్నారు అనగానే టిడిపి నాయకులు చంకలు గుద్దుకుంటున్నారని, మూడు రాజధానుల విషయంలో ఏపి ప్రభుత్వం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. రాజధానికి, అమరావతి రైతులకు సీఎం వ్యతిరేకం కాదని, అందరితో చర్చించి మంచి నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలియజేశారని రోజా తెలిపారు.