Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లాక్‌డౌన్‌లో కదిలిన తొలి రైలు.. లింగంపల్లి నుంచి హతియాకు బయలుదేరింది..

Advertiesment
లాక్‌డౌన్‌లో కదిలిన తొలి రైలు.. లింగంపల్లి నుంచి హతియాకు బయలుదేరింది..
, శుక్రవారం, 1 మే 2020 (12:38 IST)
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ దెబ్బకు సంపూర్ణ లాక్‌డౌన్ అమల్లోవుంది. ఇది మే 3వ తేదీతో ముగియనుంది. ఈ లాక్‌డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా ప్రజా రవాణా బంద్ అయింది. దీంతో విమాన, రైలు సర్వీసులు కూడా నిలిపివేశారు. 
 
అయితే, ఈ లాక్‌డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారి తొలి రైలు హైదరాబాద్‌లోని లింగంపల్లి నుంచి జార్ఖండ్ రాష్ట్రంలోని హతియాకు బయలుదేరింది. ఇందులో తెలంగాణ రాష్ట్రంలో చిక్కుకుకున్న వివిధ ప్రాంతాలకు చెందిన వలస కూలీలు వెళ్లారు. సుమారుగా 1,200 మంది వలస కార్మికులు, తెలంగాణలో చిక్కుకుపోయిన జార్ఖండ్ కూలీలు ఈ రైలులో వెళ్లారు. 
 
ఈ రైలుకు మొత్తం 24 బోగీలను ఏర్పాటు చేశారు. అయితే, ఒక్కో బోగీలో 72 బెర్తులు ఉన్నప్పటికీ సామాజిక దూరం పాటించేలా కేవలం 54 మందిని మాత్రమే ఒక్కో బోగీలోకి అనుమతించారు. 
 
నిజానికి ఈ వలస కూలీలను రోడ్డు మార్గంలో తరలించేందుకు మాత్రమే కేంద్రం అనుమతి ఇచ్చింది. కానీ, కేంద్ర ప్రతిపాదనను అనేక రాష్ట్రాలు వ్యతిరేకించాయి. రైళ్ల ద్వారా పంపేందుకు సహకరించాలని కేంద్రాన్ని కోరాయి. దీంతో కేంద్రం నిబంధనలను సడలించింది. ఆ వెంటనే దక్షిణ మధ్య రైల్వే ఈ రైలును నడిపేలా చర్యలు తీసుకుంది. 
 
మరోవైపు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ సైతం హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైలు బయలుదేరిందని ట్వీట్ చేశారు. జార్ఖండ్ వచ్చిన వారిని స్వస్థలాలకు తరలిస్తామని, అంతకన్నా ముందే ఆరోగ్య పరీక్షలు జరుపుతామని, పైగా, జార్ఖండ్‌కు వచ్చేవారంతా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు.
 
అలాగే, జార్ఖండ్ కూలీలు దాదాపు 500 మంది హైదరాబాద్ ఐఐటీలో తలదాచుకుని ఉండగా, వారిని 57 బస్సుల్లో శుక్రవారం తెల్లవారుజామున లింగంపల్లి స్టేషన్‌కు అధికారులు తరలించారు. ఆపై వారిని రైలులోకి అనుమతించారు. ఇదిలావుండగా, పంజాబ్, బీహార్, రాజస్థాన్, మహారాష్ట్రలు కూడా తమ రాష్ట్రాలకు చెంది, ఇతర ప్రాంతాల్లో చిక్కుబడిన వారిని రప్పించేందుకు రైళ్లు నడపాలని కోరాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రాలో 'కరోనా' దూకుడు : మరో 60 పాజిటివ్ కేసులు