Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లాక్‌డౌన్‌పై ప్రధాని ఇచ్చిన సంకేతాలేంటి? .. జీవితం ఇంతకుముందులా ఉంటుందా?

Advertiesment
Narendra Modi
, బుధవారం, 8 ఏప్రియల్ 2020 (18:36 IST)
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు సాగుతున్న పోరాటంలో భాగంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. ఇది ఈ నెల 14వ తేదీ ముగియనుంది. కానీ, అనేక రాష్ట్రాల్లో కరోనా వైరస్ చాలా వేగంగా విస్తరిస్తోంది. దీంతో ప్రతి రోజూ పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో ఈ కేసుల సంఖ్య శరవేగంగా పెరిగిపోతోంది. 
 
ఈ పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ను మరికొంతకాలం పొడగించాలని అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షాలు, ఇతర పార్టీల ముఖ్యనేతలతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రధాని మోడీ అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
ఇకపై జీవితం కరోనాకు ముందు, కరోనా తర్వాతలా ఉండే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఇప్పుడున్నట్టుగా ఇకపై జీవితం ఉండబోదని అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్‌ను పొడిగించాలంటూ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరుతున్న నేపథ్యంలో ఈ సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. వ్యక్తిగత ప్రవర్తన, సామాజిక మార్పులు ఎన్నో జరగాల్సి వున్నాయని పేర్కొన్న ప్రధాని.. లాక్‌డౌన్ ఎత్తివేత కుదరకపోవచ్చన్నారు.
 
అదేసమయంలో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టవేసేందుకు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను వచ్చే వారం ఎత్తివేసే అవకాశం లేదని ఆయన చూచాయగా చెప్పారు. లాక్‌డౌన్ కారణంగా వనరులపై తీవ్ర ఒత్తిడి నెలకొన్నప్పటికీ.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఇంకా కంట్రోల్‌లోనే ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటని ఆయన గుర్తుచేశారు.
webdunia
 
'నేను ముఖ్యమంత్రులు, జిల్లాల అధికారులు, నిపుణులతో తరచూ మాట్లాడుతున్నా. లాక్‌డౌన్ ఎత్తివేయాలని నాకు ఎవ్వరూ చెప్పడం లేదు. సామాజిక దూరం పాటించడానికి మనకు కఠిన నిబంధనలు అవసరం. అలాగే, కొన్ని అనూహ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రులతో నేను మరోసారి మాట్లాడుతా. అయితే, ప్రస్తుతానికైతే లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేసే పరిస్థితి కనిపించడం లేదు. మేం జిల్లా స్థాయి అధికారులతో కూడా చర్చిస్తున్నాం. మన దేశం వరకు ప్రజలను కాపాడుకునేందుకు ఉన్న ఏకైక మార్గం లాక్‌డౌన్ మాత్రమే' అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించినట్టు సమాచారం. 
 
మరోవైపు, కరోనా వైరస్ కట్టడికి చేపడుతున్న చర్యల గురించి కేంద్ర వైద్య, హోం, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖల కార్యదర్శులు ఆయా పార్టీల నేతలకు వివరించారు. వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ సామగ్రి (పీపీఈ) కొరతకు సంబంధించిన అంశాన్ని ఈ సమావేశంలో నేతలు ప్రస్తావించారు. 
 
అలాగే, పార్లమెంటు నూతన భవన నిర్మాణాన్ని ఆపివేయాలని మరికొందరు నేతలు కోరినట్టు తెలుస్తోంది. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో టీఆర్ఎస్, వైసీపీ, సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్ పార్టీ, లోక్‌ జన్‌శక్తి పార్టీ, డీఎంకే, శిరోమణి అకాలీదళ్, జనతాదళ్ యునైటెడ్, బిజూ జనతాదళ్, శివసేన నేతలు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇండోనేషియాలో 70 మంది భారతీయులు