Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనావైరస్ - తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్; అలాంటి వారికి కరోనా తగలాలని శపిస్తున్నా

కరోనావైరస్ - తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్; అలాంటి వారికి కరోనా తగలాలని శపిస్తున్నా
, మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (21:02 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడారు. లాక్ డౌన్‌ను శిక్షగా భావించకూడదని, దానివల్లే వైరస్ కంట్రోల్‌లో ఉందని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలు అందుకు సహకరిస్తున్నారని కూడా ఆయన చెప్పారు.

 
ఏప్రిల్ 15 తరువాత కూడా లాక్‌డౌన్ కొనసాగించాలన్నదే తన అభిప్రాయమని చెప్పిన కేసీఆర్, ఆర్థికంగా దెబ్బతింటే కోలుకోవచ్చు, ప్రజలను పోగొట్టుకుంటే తిరిగి తెచ్చుకోలేమని అన్నారు. ఇంకా కేసీఆర్ ఇలా అన్నారు:

 
గాంధీ ఆస్పత్రిలో 308 యాక్టివ్ కేసులకు చికిత్స
తెలంగాణకు విదేశాల నుంచి వచ్చిన 25,937 మందిని మొదటి దశలో క్వారంటీన్‌లో ఉంచాం. వారిలో 50 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ 50 మందిలో విదేశాల నుంచి వచ్చినవారు 30 మంది, మిగతా 20 మంది వారి కుటుంబ సభ్యులు. అందులో ఎవరూ మరణించలేదు. 35 మంది డిశ్చార్జ్ అయ్యారు. మిగతా 15 మంది కూడా రేపు సాయంత్రానికి డిశ్చార్జ్ అవుతారు.

 
ఆ తరువాత నిజాముద్దీన్ ఘటనతో దేశంలోని అన్ని రాష్ట్రాలలాగే మనకూ ఇబ్బంది వచ్చింది. 354 మందికి వైరస్ సోకింది. వారిలో 10 మంది ఇండోనేసియా నుంచి కరీంనగర్ వచ్చినవారు. ఆ పది మంది కూడా వ్యాధి తగ్గి డిశ్చార్జ్ అయ్యారు. 45 మంది డిశ్చార్జ్ అయ్యారు. 11 మంది మరణించారు. ఇప్పుడు 308 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారంతా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

 
నిజాముద్దీన్ నుంచి వచ్చినవారిలో 1089 మందిని గుర్తించాం. 30 నుంచి 35 మంది దిల్లీలోనే ఉన్నట్లు తెలుస్తోంది. వారిని దిల్లీ గవర్నమెంట్ క్వారంటీన్ చేసుంటుంది. 1089లో 172 మందికి వైరస్ సోకింది. వీరిలోనే 11 మంది చనిపోయారు. ఈ 172 మంది వల్ల మరో 93 మందికి సోకింది.

 
దిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ కార్యక్రమానికి వెళ్లొచ్చినవారి కాంటాక్ట్స్ సుమారు 3,015 మందిని గుర్తించాం. వీరిలో కొందరు ఇతర మతస్థులు కూడా ఉన్నారు. రెండు మూడు రోజుల్లో వీరందరికీ సంబంధించిన శాంపిళ్ల టెస్టులు పూర్తవుతాయి. ఇంకా వీరి నుంచి ఇంకెవరికైనా సోకిందా అన్న అనుమానంతో వేట కొనసాగుతోంది. ఈ విషయంలో ఇంటిలిజెన్స్ సిబ్బంది నిద్రాహారాలు మాని పనిచేసి పట్టుకున్నారు. మనకు వచ్చిన లిస్టులో కంటే అదనంగా 100 మందిని గుర్తించారు.

 
ఇప్పటివరకు ఉన్న పరిస్థితి ప్రకారం సంక్రమణ ఆగుతుందని అనుకుంటున్నాను.. కానీ, వీరి నుంచి రెండో అంచెలో మిగతా ఇంకెవరికైనా సోకితే మనమేం చేయలేం.

 
ప్రపంచమంతా లాక్‌డౌన్‌లోనే...
కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఇప్పటికే 22 దేశాలు 100 శాతం లాక్‌డౌన్ చేశాయి. జపాన్, సింగపూర్, న్యూజీలాండ్, స్పెయిన్, జర్మనీ, నెదర్లాండ్స్, నేపాల్, మలేసియా, భారత్ వంటి దేశాలు పూర్తి లాక్‌డౌన్ చేశాయి. ఇంకో 90 దేశాలు పాక్షికంగా లాక్‌డౌన్‌లో ఉన్నాయి.

 
ప్రపంచం ఏ పరిస్థితుల్లో ఉందనడానికి ఇది ఉదాహరణ.. ఇలాంటప్పుడు లాక్‌డౌన్‌ను మనం శిక్షగా భావించరాదు. మనం లాక్‌డౌన్ చేశాం కాబట్టే ఇలా కంట్రో‌ల్‌లో ఉంది. లేదంటే ఇంత పెద్ద దేశంలో పరిస్థితి వేరేలా ఉండేది. ఆర్థిక వ్యవస్థను కావాలంటే మళ్లీ చక్కదిద్దుకోవచ్చు కానీ ప్రాణాలు పోతే తిరిగి తెచ్చుకోలేమని ప్రధానికి చెప్పాను.. లాక్ డౌన్ కొనసాగించాలన్నాను.

 
వేలు, లక్షల మంది చనిపోతే ఎన్ని కుటుంబాలు ఏమైపోతాయో అన్న ఆలోచనే భయం కలిగిస్తోంది.. కాబట్టి ప్రజలు లాక్‌డౌన్ వ్యతిరేక భావనలు పెంచుకోవద్దు. మొదట్లో కంటే ఇప్పుడు ప్రజలు సహకరిస్తున్నారు.

 
యాంటీ సోషల్ మీడియా...
ప్రజలను చైతన్యపరిచే వారు కావాలి. చిల్లర రాజకీయాలు చేసేవారు వద్దు. బాధ్యతగల వ్యక్తులు, పాజిటివ్ వ్యక్తులు సమాజానికి, దేశానికి కావాలిప్పుడు. అందరూ ముందుకొచ్చి సమాజానికి మానసిక స్థైర్యం కల్పించాలి.

 
సోషల్ మీడియా యాంటీ సోషల్‌గా తయారైంది. ప్రధాని దీపాలు వెలిగించమని పిలుపిస్తే దానిని అవహేళన చేస్తారా? అది సంఘీభావ సంకేతం. దాన్ని వెకిలి చేస్తారా?తెలంగాణ ఉద్యమ సమయంలో నేను ఇలాంటి పిలుపునిచ్చాను. తెలంగాణ జేగంటలు కొట్టమన్నాం. అప్పుడూ ఈ గంటలతో తెలంగాణ వస్తుందా అని హేళన చేశారు. మనిషికి మనిషి ధైర్యం చెప్పుకొని సమస్యపై సామూహికంగా యుద్ధం చేయడానికి ఐకమత్యం కోసం ఇచ్చిన పిలుపులవి.

 
వైద్య సిబ్బందికి చేతులెత్తి నమస్కరిస్తున్నా... సఫాయన్నలకు సలాం
ఈ క్లిష్ట సమయంలో తమ ప్రాణాలొడ్డి పనిచేస్తున్న వైద్య సిబ్బందికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. హాస్పిటళ్లలోని స్వీపర్ల నుంచి అత్యున్నత స్థాయిలో ఉన్న వైద్యుల వరకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. 25 వేల మంది వైద్య సిబ్బందితో ఒక లిస్టు తయారుచేసుకున్నాం. పరిస్థితి క్లిష్టంగా మారితే వారంతా రంగంలోకి దిగుతారు. రోగులు పెరిగినా తట్టుకునేలా సుమారు 18 వేల పడకలను సిద్ధం చేశాం.

 
వైద్య శాఖ సిబ్బందికి పూర్తి జీతాలివ్వాలని చెప్పాను. 10 శాతం గ్రాస్ శాలరీ ముఖ్యమంత్రి బహుమతి కింద వారికి అందజేస్తాం. వెంటనే ఆ మొత్తం వారికి శాఖాపరంగా అందుతుంది. పోలీసులు బాగా పనిచేస్తున్నారు. వారికి ధన్యవాదాలు.

 
గ్రామస్థాయి నుంచి హైదరాబాద్ నగరం వరకు పారిశుద్ధ్య కార్మికులు 95,392 మంది ఉన్నారు. వీరిలో మున్సిపల్, జీహెచ్‌ఎంసీలో పనిచేసేవారి వేతనాల్లో 10 శాతం కోత పెట్టారు. అది వెంటనే వెనక్కిచ్చేస్తున్నాం. హైదరాబాద్‌లో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బందికి రూ. 7500 చొప్పున, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లోని పారిశుధ్య కార్మికులకు రూ. 5 వేల చొప్పున సీఎం గిఫ్ట్ అందిస్తున్నాం. సఫాయన్నలకు సలాం. సీఎం గిఫ్ట్ మొత్తాలు ఈ రోజే రిలీజ్ చేస్తాం.

 
పీపీఈ కిట్లు 40 వేలు తెలంగాణ ప్రభుత్వం వద్ద ఉన్నాయి. తప్పుడు వార్తలు రాస్తే కేసులు వేస్తాం. తప్పుడు వార్తలు రాసేవారికి కరోనావైరస్ సోకాలని శాపం పెడుతున్నాను. కుట్ర పూరితంగా, అవగాహన రాహిత్యంతో తప్పుడు వార్తలు రాసేవారికి శిక్షలు తప్పవు.. కేసీఆర్ చెబితే ఖతర్నాక్‌గా ఉంటుంది.
 
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనావైరస్: కోవిడ్-19 రోగి చనిపోతే అంత్యక్రియలు ఎలా చేయాలి?