Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనావైరస్: బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ లాక్‌డౌన్ గురించి ఏం చెప్పింది? - ప్రెస్ రివ్యూ

కరోనావైరస్: బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ లాక్‌డౌన్ గురించి ఏం చెప్పింది? - ప్రెస్ రివ్యూ
, మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (16:37 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పొడిగించాలని ప్రధానిని అభ్యర్థిస్తూ ప్రస్తావించిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌ నివేదికలో ఉన్న విషయాల గురించి ‘సాక్షి’ దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

 
కరోనావైరస్‌ వ్యాప్తి నిరోధానికి సంబంధించి అమెరికాకు చెందిన బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) వేర్వేరు స్థితులను పరిగణనలోకి తీసుకుని ఓ నివేదిక రూపొందించింది.

 
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా నియంత్రణకు లాక్‌డౌన్‌ ఎప్పుడు ప్రకటించారు? ఆయా దేశాల్లో రోజుకు ఎన్ని కొత్త కేసులు నమోదవుతున్నాయి? యాక్టివ్‌ కేసులు ఎన్ని? వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదికను రూపొందించింది. వీటన్నింటి ఆధారంగా ఆయా దేశాల్లో కేసుల సంఖ్య పతాక స్థాయికి ఎప్పుడు చేరుకుంటాయి? లాక్‌డౌన్‌ నిబంధనలు ఏ తేదీ నుంచి ఎత్తేయొచ్చు? అన్న అంశాలపై అంచనాలను సిద్ధం చేసింది.

 
గత నెల 25 వరకు నమోదైన గణాంకాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్లు స్పష్టం చేసింది. కరోనా పరిస్థితులు రోజురోజుకూ మారిపోతున్న నేపథ్యంలో తమ నివేదికను వైద్యం, భద్రతలకు సంబంధించిన సలహా సూచనలుగా పరిగణించరాదని, ప్రత్యామ్నాయాలుగానూ చూడరాదని తెలిపింది.

 
భారత్‌లో కరోనా కేసులు జూన్‌ మూడో వారంలో పతాక స్థాయికి చేరతాయని బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ అంచనా వేసింది. నివేదికలో సూచించిన గ్రాఫ్‌ ప్రకారం జూన్‌ మూడో వారం నాటికి రోజూ 10 వేల కంటే ఎక్కువ కొత్త కేసులు నమోదవుతాయి.

 
చైనాలో మాదిరిగా కరోనా కారణంగా పదో మరణం సంభవించిన రోజున భారత్‌ లాక్‌డౌన్‌ ప్రకటించిందని, చైనాతో పాటు, బెల్జియం, పోలండ్‌ వంటి దేశాలు సైతం దాదాపు ఇదే స్థితిలో లాక్‌డౌన్‌ ప్రకటించాయని తెలిపింది.

 
లాక్‌డౌన్‌ను ఎత్తివేసే సమయం గురించి ప్రస్తావిస్తూ.. ఇందుకోసం తాము చైనాలోని హుబే, వూహాన్‌ ప్రాంతాల్లో ఏ సమయంలో లాక్‌డౌన్‌ ఎత్తి వేశారన్నదానికి ఆయా దేశాల్లోని ఆరోగ్య వ్యవస్థకు, ప్రభుత్వ సామర్థ్యం, నిర్దిష్ట జనాభాకు అందుబాటులో ఉన్న ఆసుపత్రి పడకల సంఖ్య వంటివి పరిగణనలోకి తీసుకున్నామని వివరించింది. దీంతో పాటు వైరస్‌ బారినపడ్డ వారిని సమర్థంగా ఐసోలేషన్‌లో ఉంచగల సామర్థ్యం కూడా ముఖ్యమేనని చెప్పింది.

 
ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే భారత్‌‌లో జూన్‌ ఆఖరు నుంచి సెప్టెంబర్‌ రెండో వారం మధ్యలో లాక్‌డౌన్‌ను ఎత్తేసేందుకు అవకాశముందని అంచనా వేసింది. భారత్‌లో ప్రజారోగ్య వ్యవస్థ సన్నద్ధతను దృష్టిలో ఉంచుకుంటే లాక్‌డౌన్‌ను కొంచెం ఎక్కువ కాలం కొనసాగించాల్సిన అవసరమున్నట్లు బీసీజీ భావించింది.
 
సీఎం కేసీఆర్‌ ఈ నివేదిక ఆధారంగానే విలేకరుల సమావేశంలో లాక్‌డౌన్‌ పొడిగింపునకు తన మద్దతు ప్రకటించారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మద్యం అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు: మంత్రి నారాయణస్వామి సీరియస్‌