Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మద్యం అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు: మంత్రి నారాయణస్వామి సీరియస్‌

మద్యం అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు: మంత్రి నారాయణస్వామి సీరియస్‌
, మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (16:34 IST)
కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించి, మద్యం అమ్మకాలను  నిషేధించింది. దీంతోపాటు అనధికారికంగా మత్తు పదార్ధాల విక్రయాలు జరిపినా, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహకరించినా చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటామని ఎక్సైజ్‌శాఖా మంత్రి నారాయణస్వామి తెలిపారు.

వివిధ జిల్లాల్లో మద్యం అక్రమ అమ్మకాలు జరుగుతున్నట్లు వచ్చిన వార్తలపై ఆయన సీరియస్‌ అయ్యారు. అక్రమ అమ్మకాలకు సహకరిస్తున్న ఎవరినీ కూడా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆ శాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు.

ఇప్పటికే అన్ని బార్లు, మద్యం షాపుల్లో స్టాక్‌ను తనిఖీ చేసి, మళ్ళీ అమ్మకాలు ప్రారంభించిన తర్వాత ఓపెనింగ్‌ స్టాక్‌కు ఇప్పటి క్లోజింగ్‌ స్టాక్‌ సరిగా ఉందో లేదో వెరిఫై చేయాలని ఎక్సైజ్‌ సిబ్బందిని ఆదేశించారు. ఎక్సైజ్ అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని...ఏపీ సరిహద్దు జిల్లాల్లో చెక్‌పోస్ట్‌లలో మరింత కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటుచేయాలన్నారు.
 
ఇప్పటికే సీఎం వైఎస్‌ జగన్‌ మ్యానిఫెస్టోలో చెప్పినట్లు మద్యపాన నిషేదంలో భాగంగా దశలవారీ మద్యపాన నిషేదాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నారన్నారు. గత ఏడాది అక్టోబర్‌ 1 నుంచి ఈ దశలవారీ మద్యపాన నిషేదం రాష్ట్రంలో అమలవుతుందన్న మంత్రి...లాక్‌డౌన్‌ కారణంగా ప్రభుత్వానికి ప్రతీరోజూ కొన్ని కోట్ల రూపాయల నష్టం వస్తున్నా ప్రజారోగ్యం ముఖ్యమనే ఉద్దేశంతో సీఎం  వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలో మద్యం అమ్మకాలను నిషేదించారన్నారు.

దీనికి కూడా తూట్లుపొడుస్తూ కొంతమంది టీడీపీ అనుకూల బార్‌ ఓనర్లు కొన్ని చోట్ల బార్ల నుంచి మద్యాన్ని బయటికి తీసుకొచ్చి విపరీతమైన ధరలకు విక్రయిస్తున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చిందని...దీంతో వెంటనే ఆ బార్ల లైసెన్స్‌ సస్పెండ్‌ చేయాలని ఆదేశించామన్నారు. ఉదాహరణగా చిత్తూరులో టీడీపీకి చెందిన భాస్కర్‌ నాయుడు రెడ్‌హ్యాండెడ్‌గా దొరకడంతో లైసెన్స్‌ సస్పెండ్‌ చేశామన్నారు. ఈ విషయంలో అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని మంత్రి స్పష్టం చేశారు.
 
మద్యం విక్రయిస్తే టోల్‌ఫ్రీ నెంబర్లకు సమాచారమివ్వండి
ఎవరైనా మద్యం విక్రయిస్తే టోల్‌ఫ్రీ నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని మంత్రి  నారాయణస్వామి మరోసారి ప్రజలకు సూచించారు. టోల్‌ ఫ్రీ నెంబర్లు 18004254868, 94910 30853, 0866 2843131. మత్తుకు బానిసలైన కొంతమంది సహనం కోల్పోయి హానికర ద్రవాలు సేవించి ప్రాణాలపైకి తెచ్చుకోవద్దని ఆయన అన్నారు.

వారి విషయంలో కుటుంబసభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. టోల్‌ఫ్రీ నెంబర్లకు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని, ఈ నెంబర్లు 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటాయని ఆయన చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హడలెత్తిస్తున్న ఆ మూడు రాష్ట్రాలు - కొత్త కరోనా కేసుల్లో 45 శాతం అక్కడే..