Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రానున్నరెండు వారాలు అత్యంత కీలకం : మంత్రి గౌతమ్ రెడ్డి

రానున్నరెండు వారాలు అత్యంత కీలకం : మంత్రి గౌతమ్ రెడ్డి
, మంగళవారం, 31 మార్చి 2020 (19:42 IST)
కరోనా వైరస్ నియంత్రణలో వ్యక్తిగత నిబద్ధతే కీలకమని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. కోవిడ్ - 19 వైరస్ వ్యాప్తి చెందకుండా చూడడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని మంత్రి అన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని  జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీలో మంత్రి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో కోవిడ్ - 19 వైరస్ చికిత్సకు అవసరమైన క్వారంటైన్ ఐసోలేషన్ వార్డులను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆదేశించారు.

కరోనా వైరస్ రాకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిత్యం ప్రజలకు చెబుతున్న సూచనలు, మార్గదర్శకాలను ప్రతి పౌరుడు పాటించి సహకరించాలని మంత్రి మేకపాటి కోరారు.

లాక్ డౌన్ కు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా, అసత్యవసర సేవలు అందించే అధికార యంత్రాంగం అలసత్వం వహించినా చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు. గ్రామ వాలంటీర్లు, ఏఎన్ఎం తదితర సిబ్బంది హోం ఐసోలేషన్ లో ఉన్నవారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని మంత్రి మేకపాటి మార్గనిర్దేశం చేశారు.

కరోనా వైరస్ ను అడ్డుకోవడానికి రానున్న రెండు వారాలు చాలా కీలకమని, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. ముఖ్యంగా టాస్క్ ఫోర్స్ కమిటీలో ఉన్న అధికారులు మరింత బాధ్యతగా పని చేయాలన్నారు.

ఏప్రిల్ 14 వరకూ రాష్ట్రంలో లాక్ డౌన్ కచ్చితంగా అమలు కానున్న నేపథ్యంలో నిత్యవసర, అత్యవసరాలకు అంతరాయం కలగకుండా చూడాలని మంత్రి వ్యాఖ్యానించారు. చెక్ పోస్టుల్లో నిశితంగా పరిశీలించాకే అనుమతించాలన్నారు. ఈ విషయంలో అలసత్వం తగదని మంత్రి సూచించారు.

ప్రజలంతా ఎక్కడైనా, ఎక్కడున్నా భౌతిక దూరం పాటించడం తప్పనిసరని గౌతమ్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను రాష్ట్రం, జిల్లాలోని ప్రతి పౌరుడు బాధ్యతగా భావించి, పాటించేలా చేయడానికి చర్యలు తీసుకోవడంలో రాజీపడవద్దని మంత్రి మేకపాటి ఆదేశించారు.

సమావేశం అనంతరం కోవిడ్ -19 బాధితులకు సహాయంగా తన ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగం మండలానికి చెందిన తరుణవాయి గ్రామస్తుడైన తుంగా దయాకర్ రెడ్డి మంత్రికి అందించిన రూ.లక్ష చెక్కును జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్ కు గౌతమ్ రెడ్డి అందజేశారు. కరోనా మహమ్మారి నిర్మూలనకు ఈ మొత్తాన్ని వినియోగించాలని మంత్రి కోరారు.
 
ఈ సమీక్షా సమావేశంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో పాటు, జలవనరుల శాఖ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ , జిల్లా కలెక్టర్ ఎం.వీ శేషగిరి బాబు, ఎస్పీ భాస్కర్ భూషణ్,  జాయింట్ కలెక్టర్ డా.వినోద్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కల్పనా కుమారి, జేసీ-2 కమల, మున్సిపల్ కమిషనర్ పి.వి.వి.ఎస్ మూర్తి , ఇతర టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు,  ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైరస్ వ్యాప్తి అడ్డుకట్టే లక్ష్యంగా లాక్‌డౌన్ మరింత కఠినం?