Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

25 వేల మందికి ఉద్యోగాలు ఇస్తాం... మంత్రి గౌతమ్ రెడ్డితో జియోమీ ప్రతినిధులు

25 వేల మందికి ఉద్యోగాలు ఇస్తాం... మంత్రి గౌతమ్ రెడ్డితో జియోమీ ప్రతినిధులు
, సోమవారం, 22 జులై 2019 (18:58 IST)
పరిశ్రమలు‌, ఐ.టీ, వాణిజ్య, జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిగారిని స్మార్ట్ ఫోన్ మొబైల్ రంగంలో ప్రపంచ దిగ్గజ సంస్థ జియోమీ ప్రతినిధులు సమావేశమయ్యారు. సచివాలయంలోని నాలుగవ బ్లాక్, మొదటి అంతస్థులో ఉన్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కార్యాలయంలో వారు సాయంత్రం భేటీ అయ్యారు. 
 
ఆంధ్రప్రదేశ్ లో యూనిట్ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామని జియోమీ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ మను జైన్ మంత్రికి తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులలో మూడు కొత్త స్మార్ట్ఫోన్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు మంత్రికి వివరించారు. దేశంలోని దిగ్గజ స్మార్ట్ఫోన్ సంస్థల్లో తమ సంస్థ మొదటిదని, కంపెనీ ద్వారా సుమారు 25 వేల మందికి ఉపాధి అందించేందుకు తాము సిద్ధమన్నారు మను జైన్. 
 
మొత్తం ఉద్యోగాలలో 95 శాతం ఉద్యోగాలు మహిళలకే ఇవ్వాలని అనుకుంటున్నట్లు మను జైన్ మంత్రికి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్న జియోమీ సంస్థకు స్వాగతం పలుకుతున్నామని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచన, ఆదేశాల మేరకు ప్రభుత్వం త్వరలోనే ఒక స్పష్టమైన పారిశ్రామిక విధానాన్ని తీసుకువచ్చేందుకు కసరత్తు జరుగుతుందని, ఆ విధానం ప్రకారమే ఏ కంపెనీతోనైనా ఒప్పందాలు చేసుకోవాలనుకుంటున్నామని మంత్రి జియోమీ ప్రతినిధుల బృందానికి స్పష్టం చేశారు. 
 
పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాల ద్వారా కూడా మొత్తంగా రాష్ట్రానికి మేలు జరిగే విధంగా విధానాన్ని తయారు చేసి, అమలు చేయాలనే దిశగా ముందుకు వెళ్తున్నట్లు ప్రతినిధులకు తెలిపారు మంత్రి. ఉపాధి పరంగా 95శాతం మహిళలకే ఉద్యోగాలివ్వాలనుకునే సంస్థ ప్రతిపాదనను మంత్రి అభినందించారు. మహిళల వృద్ధితోనే కుటుంబాల అభివృద్ధి సాధ్యమని అభిప్రాయం వ్యక్తం చేశారు. 
 
ఉపాధి, పెట్టుబడులు, మౌలిక వసతుల వంటి అంశాలలో ఆడంబరాల కన్నా వాస్తవాలకే పెద్ద పీట వేసేలా జియోమీ దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. పారదర్శకతే లక్ష్యంగా ముందుకెళుతున్న తమ ప్రభుత్వం.. స్పష్టమైన విధివిధానాలతో, కచ్చితమైన గణాంకాలతో ముందుకు వచ్చే సంస్థలతోనే రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం అవుతుందని మంత్రి మేకపాటి జియోమీ ప్రతినిధులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో పాటు, సమాచార, సాంకేతిక శాఖ ముఖ్యకార్యదర్శి అనూప్ సింగ్, ఐ.టీ సలహాదారు శ్రీనాథ్ రెడ్డి, జియోమీ సంస్థ వైస్ ప్రెసిడెంట్ మను జైన్, తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ 3: కంటెస్టెంట్ హిమజపై యమ క్రేజ్ గురూ... పట్టేస్తుందా?