Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైద్య సామాగ్రీ తయారీ చేస్తున్న పరిశ్రమలు, ఉద్యోగులకు ఆటంకం రానివ్వం : మంత్రి మేకపాటి

వైద్య సామాగ్రీ తయారీ చేస్తున్న పరిశ్రమలు, ఉద్యోగులకు ఆటంకం రానివ్వం : మంత్రి మేకపాటి
, గురువారం, 2 ఏప్రియల్ 2020 (19:30 IST)
కరోనా పాజిటివ్ కేసులు రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో నియంత్రణపై పరిశ్రమలు, ఐ.టీ, వాణిజ్య, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పరిశ్రమల శాఖతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు.

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ లో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ , పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం సహా, జోనల్ మేనేజర్లు, జనరల్ మేనేజర్లతో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

కోవిడ్ - 19  వైరస్ నివారణకు పరిశ్రమల ద్వారా అందవలసిన అత్యవసర ఉత్పత్తుల తయారీ, ముడి సరకుల రవాణా, వైద్య,ఆహార ఉత్పత్తులు, ఉద్యోగులకు అనుమతుల వంటి అంశాలపై పరిశ్రమల శాఖ అధికారులతో మంత్రి గౌతమ్ రెడ్డి చర్చించారు. ప్రస్తుత ప్రత్యేక పరిస్థితులలో పరిశ్రమల శాఖ చేపట్టవలసిన చర్యలపై మంత్రి మార్గదర్శకాలిచ్చారు. 
 
కరోనాను ఎదుర్కోవడంలో భాగంగా ఇప్పటికే కొన్ని పరిశ్రమలకు నిధులు విడుదల చేశామని మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. కరోనా సోకిన వారికి చికిత్సలో ముఖ్యమైన వెంటిలేటర్ల తయారీ బాధ్యతను మెడ్ టెక్ జోన్ కు అప్పగించినట్లు మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు.

3 వేల వెంటిలేటర్లు, 25,000 కోవిడ్ టెస్టింగ్ కిట్లు మరో 10 రోజుల్లో అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. రాబోయే అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో 6వేల వెంటిలేర్లను ఉత్పత్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. 
 
పరిశ్రమలలో పని చేస్తున్న వారికి ఎలాంటి అంతరాయం రాకూడదని, తదనుగుణంగా ముందస్తు జాగ్రత్తలు, అనుమతులు తీసుకోవాలని  మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆదేశించారు. విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి పాసులు ఇచ్చి ఎవరూ ఆపకుండా చూడాలన్నారు.

కరోనా నుంచి రక్షణకు అవసరమైన మాస్కులు, వ్యక్తిగత రక్షణ కిట్ల వంటి ఉత్పత్తుల తయారీ యూనిట్లకు, అక్కడ పని చేస్తున్న సిబ్బందికి ఆ యూనిట్ కు సమీపంలోని హాస్టల్ వసతి ఉండే కళాశాలల్లో వారికి ఆహారం, వసతి సదుపాయాలు ఏర్పాటు చేసుకునేలా అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఉన్న పరిశ్రమలలో కార్మికులు, ఉద్యోగులకు కలిగే ఇబ్బందులను ఆయా జిల్లాలకు చెందిన కలెక్టర్ల దృష్టికి తీసుకువెళ్లి, సమన్వయం చేసుకుంటూ పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్లు సమస్యలను పరిష్కరించుకోవాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సూచించారు.

జిల్లాలలోని వస్త్రాల తయారీ పరిశ్రమలు అఅవసరమైన సామాగ్రిని రిలయన్స్ పరిశ్రమలతో సమన్వయం చేసుకుని పీపీఈ (పర్సనల్ ప్రొటెక్షన్ కిట్స్) కిట్లు తయారీ చేపట్టాలని మంత్రి మేకపాటి సూచించారు. ముఖ్యంగా, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోని వస్త్ర పరిశ్రమలు అత్యవసరంగా, ఒక్కసారే వినియోగపడే బెడ్ షీట్ల తయారీపై దృష్టి సారించాలన్నారు.
 
పరిశ్రమలు, తయారీ యూనిట్లకు అత్యవసరమైన ముడికి సరకు రవాణా సరఫరాలో ముఖ్య భూమిక పోషించే ట్రక్కు డ్రైవర్లకు పౌష్ఠికాహారం అందించే వీలుగా జాతీయ రహదారులలో ఉన్న దాబాలను వినియోగించుకోవాలని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  రజత్ భార్గవ జిల్లాలోని అధికారులకు స్పష్టం చేశారు.

అందుకు అవసరమైన అనుమతులను రవాణా, రోడ్లు, భవనాల శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. పరిశ్రమల శాఖ, సులభతర వాణిజ్య విభాగం ఆంధ్రప్రదేశ్ లో చైనా నుంచి అత్యధిక పెట్టుబడులను  తీసుకుని వచ్చేలా ప్రణాళికతో సమాయత్తమవుతోంది.

ఇప్పటికే అందుకు అనుగుణంగా, 5 ఫార్మా పార్కుల ఏర్పాటుకు సంబంధించిన  ప్రాజెక్టు నివేదికలను  కేంద్ర పరిశ్రమల శాఖకు పంపామని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  రజత్ భార్గవ ,మంత్రి గౌతమ్ రెడ్డికి తెలిపారు. తదుపరి చేపట్టవలసిన చర్యలను వేగవంతం చేయాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా ఎఫెక్ట్‌ : హ‌రియాణాలో బబుల్‌ గమ్‌లు నిషేధం