ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా, ఈ బిల్లును అస్సాం ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఫలితంగా అస్సాం రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం.
మరోవైపు, ఈ బిల్లును కేవలం ఈశాన్య రాష్ట్రాల ప్రజలు మాత్రమే కాదు... కేరళ, పంజాబ్ వంటి రాష్ట్రాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లును అమలు చేయబోమంటూ ప్రకటించాయి. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, దీన్ని తమ రాష్ట్రంలో అమలు చేయబోవడం లేదని కేరళ స్పష్టం చేసింది.
బిల్లులో ఎన్నో లోపాలు ఉన్నాయని వ్యాఖ్యానించిన రాష్ట్ర సీఎం పినరయి విజయన్, బిల్లును అమలు చేస్తే అశాంతి పెరుగుతుందని అన్నారు. కేరళ దారిలోనే పంజాబ్ కూడా బిల్లును అమలు చేయబోమని తేల్చి చెప్పింది.
పౌరసత్వ బిల్లును ఆది నుంచి వ్యతిరేకిస్తున్న పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, ఇండియాలో దశాబ్దాలుగా ఉన్న లక్షలాది మందికి బిల్లు అనుకూలం కాదని అన్నారు. బిల్లును అమలు చేయబోమని అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేయనున్నట్టు ఆయన తెలిపారు. కాగా, ఇప్పటికే వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ బిల్లుకు వ్యతిరేకంగా గళం వినిపించిన విషయం తెల్సిందే.