Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

CAB పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యాంగ ఉల్లంఘనా? శరణార్థికి, చొరబాటుదారుడికి అమిత్ షా ఇచ్చిన నిర్వచనం సరైనదేనా?

Advertiesment
CAB పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యాంగ ఉల్లంఘనా? శరణార్థికి, చొరబాటుదారుడికి అమిత్ షా ఇచ్చిన నిర్వచనం సరైనదేనా?
, బుధవారం, 11 డిశెంబరు 2019 (15:29 IST)
పౌరసత్వ(సవరణ) బిల్లు, 2019 సోమవారం లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లుపై చర్చించిన సమయంలో 48 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా, వ్యతిరేకంగా మాట్లాడారు. ఆ తర్వాత రాత్రి 10 గంటలకు హోంమంత్రి అమిత్ షా అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ప్రారంభించారు. ఆయన గంటకు పైగా మాట్లాడారు. జీవితం నరకప్రాయం మారిన లక్షల కోట్ల శరణార్థుల బాధలకు ఈరోజు ముగింపు పలికే రోజని అమిత్ షా చెప్పారు.
 
శరణార్థుల గణాంకాలపై ఐక్యరాజ్యసమితి హైకమిషనర్ 2016లో ఇచ్చిన నివేదిక ప్రకారం భారత్‌లో రెండు లక్షల మందికి పైగా శరణార్థులు ఉన్నారు. వీరిలో టిబెట్, శ్రీలంక, అప్గానిస్తాన్, మియన్మార్, పాకిస్తాన్, సోమాలియా నుంచి వచ్చిన శరణార్థులు ఉన్నారు. 2015లో సిరియా నుంచి 39 మంది శరణార్థులు భారత్ వచ్చారు. అయితే, కొత్త పౌరసత్వ బిల్లులో కేవలం పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ మైనారిటీ సమాజాలకు మాత్రమే భారత పౌరసత్వం ఇచ్చే విషయం చెప్పారు. ఈ మైనారిటీల్లో హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, పార్శీ సమాజాల వారు ఉన్నారు.
 
అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ముస్లిం దేశాలా?
హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ రాజ్యాంగంలో జాతీయ మతం ఇస్లాం అని ఉందని చెప్పారు. అందుకే అక్కడ ఉన్న మైనారిటీలకు తమకు న్యాయం లభిస్తుందనే ఆశలు అడుగంటిపోయాయని అన్నారు. 1971లో బంగ్లాదేశ్ రాజ్యాంగంలో లౌకిక దేశంగా భావించారని, కానీ ఆ తర్వాత 1977లో ఆ దేశం తమ మతాన్ని ఇస్లాంగా మార్చిందన్నారు. ఈ మూడింటిని ముస్లిం దేశాలని అనడంలో ఎలాంటి సందేహం లేదని, కానీ బంగ్లాదేశ్ స్వయంగా ముస్లిం దేశం అయినా తమను లౌకికవాద దేశంగా భావిస్తుందని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ దక్షిణాసియా స్టడీస్ ప్రొఫెసర్ సంజయ్ భరద్వాజ్ చెప్పారు.
 
పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో మొత్తం ఎంతమంది మైనారిటీలు ఉన్నారు?
"1950లో దిల్లీలో నెహ్రూ, లియాకత్ ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం భారత్, పాకిస్తాన్ తమ తమ దేశాల్లో ఉన్న మైనారిటీలను క్షేమంగా చూసుకుంటామని భరోసా ఇచ్చాయి. పాకిస్తాన్ తమ దేశంలో ఉన్న హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, క్రైస్తవ, పార్శీలను జాగ్రత్తగా చూసుకుంటామని భారత్‌కు చెప్పింది" అని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. 1947లో పాకిస్తాన్‌లో మైనారిటీల సంఖ్య 23 శాతం ఉంది. 2011లో అది 3.7 శాతానికి తగ్గిపోయిందని, అటు బంగ్లాదేశ్‌లో 1947లో 22 శాతం ఉన్న మైనారిటీల సంఖ్య, 2011లో 7.8 శాతానికి చేరుకుందని అమిత్ షా చెప్పారు.
 
కానీ, హోంమంత్రి అమిత్ షా తొందరపాటులో అలా చెప్పుంటారని, 1947 నుంచి 1971 వరకు తూర్పు పాకిస్తాన్‌లో 15 శాతం మంది మాత్రమే మైనారిటీలు ఉన్నారని సంజయ్ భరద్వాజ్ చెప్పారు. బంగ్లాదేశ్ అయిన తర్వాత అది మరింత తగ్గిందన్నారు. పాకిస్తాన్‌లో మైనారిటీల సంఖ్య తగ్గుతూ తగ్గుతూ ఇప్పుడు అది ఒక శాతం అయ్యిందని ఆయన చెప్పారు.
 
భారత్‌లో 1951లో 84 శాతం హిందువులు ఉండేవారని, 2011లో అది 79 శాతానికి తగ్గిందని అమిత్ షా చెప్పారు. అదే మిగతా దేశాల్లో మెజారిటీ జనాభా సంఖ్య పెరుగుతోందని అన్నారు. ఆయన భారత్‌లో ముస్లింల సంఖ్య కూడా చెప్పారు. 1951లో భారత్‌లో ముస్లింల సంఖ్య 9.8 శాతం ఉండేదన్న అమిత్ షా ప్రస్తుతం వారి సంఖ్య 14.23 శాతానికి చేరిందని చెప్పారు. హోంమంత్రి చెప్పిన ఈ గణాంకాలు 2011 జనాభా లెక్కలతో పోలిస్తే ముమ్మాటికీ నిజం.
 
శరణార్థి ఎవరు, చొరబాటుదారుడు ఎవరు?
హోంమంత్రి అమిత్ షా సభలో చర్చ సమయంలో చాలాసార్లు ఒకే మాటను మళ్లీ మళ్లీ చెప్పారు. "ఎవరైతే స్వదేశంలో వేధింపులకు గురవుతారో, ఎవరైతే తమ మతం, మహిళల గౌవరం కాపాడుకోవడానికి భారత్ వచ్చారో వారు శరణార్థులని, ఎలాంటి అనుమతులూ లేకుండా అక్రమంగా దేశంలోకి చొరబడినవారు చొరబాటుదారులని" ఆయన చెప్పారు.
 
ఈ బిల్లులో ముస్లింలను ఎందుకు చేర్చలేదు అనే ప్రశ్నకు కూడా హోంమంత్రి సమాధానం ఇచ్చారు. "పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ ముస్లింలు ఆయా దేశాల్లో మైనారిటీలు కాదు. అందుకే వారిని ఇందులో చేర్చలేదు. మియన్మార్ రోహింజ్యా ముస్లింలు బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి వస్తున్నారు. మియన్మార్ లౌకిక దేశం. రోహింజ్యా ముస్లింలను ఇక్కడ ఎప్పటికీ అనుమతించడం జరగదు" అన్నారు.
 
మియన్మార్ రోహింజ్యా ముస్లింలు ఆ దేశంలో మైనారిటీలే. వారిపై వేధింపులు జరుగుతున్నాయనే వార్తలు వస్తూనే ఉన్నాయి. సుమారు 40 వేల రోహింజ్యా ముస్లింలు ప్రస్తుతం భారత్‌లో ఉన్నారు. అయితే వారిని చొరబాటుదారులని ఎందుకు అంటున్నారు. రోహింజ్యా ముస్లింలు శరణార్థులే. ఎందుకంటే వారు తమ దేశంలో వేధింపులు ఎదుర్కుంటున్నారు అని భరద్వాజ్ చెప్పారు.
 
ఐక్యరాజ్యసమితి శరణార్థ ఏజెన్సీ ప్రకారం "అణచివేత, యుద్ధం, హింస వల్ల ఎవరికైతే తమ దేశం వదిలి పారిపోవాల్సి వస్తుందో వారిని శరణార్థి అంటారు. జాతి, మతం, రాజకీయ అభిప్రాయాలు, ఏవైనా సామాజిక సమూహాల వల్ల అణచివేతకు గురవుతామని శరణార్థుల్లో ఒక భయం ఉంటుంది".
 
పౌరసత్వం బిల్లు రాజ్యాంగ ఉల్లంఘనా?
చర్చ సమయంలో కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ సహా చాలా మంది ఎంపీలు ఆర్టికల్ 14ను ఉటంకిస్తూ ఈ బిల్లును రాజ్యాంగవిరుద్ధం అన్నారు. దాంతో హోంమంత్రి అమిత్ షా ఇది ఏమాత్రం రాజ్యాంగవిరుద్ధం కాదు. రాజ్యాంగం దృష్టిలో ఇది సరైనదే అన్నారు. నల్సార్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్, న్యాయ నిపుణులు ఫైజాన్ ముస్తఫా "ఈ బిల్లు ఆర్టికల్ 14లోని అన్ని పారామీటర్లను అందుకోలేదు. అమిత్ షా చాలా మతాలను ఇందులో చేర్చినా, ఒక మతాన్ని వదిలేశారు, అది సమానత్వ హక్కుకు వ్యతిరేకం" అన్నారు.
 
"రాజ్యాంగం మతం, కులం, జన్మస్థలం ప్రకారం చట్టం రూపొందించడానికి అనుమతి ఇవ్వదు. కానీ ఈ బిల్లులో మతం ఆధారంగా ఈ నిబంధన రూపొందించారు. ఇది ఆర్టికల్ 14 టెస్ట్‌ను పూర్తి చేయదు. దానితోపాటు ఇందులో అన్ని పొరుగు దేశాలను చేర్చలేదు. అందులో మియన్మార్, చైనా, శ్రీలంకలను చేర్చలేదు. ఈ చట్టంలో చేసిన వర్గీకరణ హేతుబద్ధమైనది కాదు" అన్నారు.
 
హోంమంత్రి అమిత్ షా తన ప్రసంగంలో ఆర్టికల్ 14 ఆధారంగా ఇలాంటి చట్టం చేయడం సాధ్యం కాకపోతే, మైనారిటీల విద్యాసంస్థల కోసం చట్టం ఎలా చేశారని అన్నారు. ఆర్టికల్-14 ప్రకారం మైనారిటీలకు విద్యాసంస్థలు ఏర్పాటు చేశారనేది అపోహ మాత్రమే అని ఫైజాన్ ముస్తఫా చెప్పారు. ఆ సంస్థలను ఆర్టికల్ - 30 ప్రకారం ఏర్పాటు చేశారని చెప్పారు.
 
ఆర్టికల్ 30 ప్రకారం భారత్‌లో ఉండే మైనారిటీలు విద్యాసంస్థలు నిర్మించారు. విదేశీ మైనారిటీలకు ఇలాంటి ఏ హక్కులూ ఇవ్వలేదు. ఉత్తరప్రదేశ్ బ్రాహ్మణులు తమిళనాడులో హిందీ సంస్థను ఏర్పాటు చేయాలని భావిస్తే, అక్కడ మైనారిటీలు అయినా వారు సంస్థను ఏర్పాటు చేయవచ్చు అని ఫైజాన్ ముస్తఫా అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.12 వేలకే అమెజాన్ స్మార్ట్ టీవీలు.. 20 నుంచి బుకింగ్స్