Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాబూ.. రాష్ట్రం పరువు పోగొట్టారుగా: ఎమ్మెల్యే చెవిరెడ్డి

బాబూ.. రాష్ట్రం పరువు పోగొట్టారుగా: ఎమ్మెల్యే చెవిరెడ్డి
, శుక్రవారం, 13 డిశెంబరు 2019 (08:15 IST)
"ఓటుకు కోట్లు కేసులో పట్టుబడిన సందర్భంగా మా వాళ్లు బ్రీఫ్డ్‌మీ అంటూ మాట్లాడిన చంద్రబాబు.. అది తన గొంతు కాదని అంటే, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ ఇంత దరిద్రమైన ఇంగ్లిష్‌ దేశంలో ఎవరైనా మాట్లాడుతారంటే అది ఏపీ సీఎం చంద్రబాబు మాత్రమే అన్నది వాస్తవం కాదా? ముఖ్యమంత్రిగా ఉంటూ సగం తెలుగు, సగం వచ్చీ రాని ఇంగ్లిష్‌ మాట్లాడి ఆంధ్రప్రదేశ్‌ పరువు పోగొట్టిన మాట వాస్తవం కాదా?" వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రశ్నించారు. 
శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. నాడు ఎమ్మెల్యేగా ఉన్న తనను తెలుగుదేశం ప్రభుత్వ హయాం తీవ్రవాదికంటే దారుణంగా కొట్టారంటూ తీవ్ర ఆవేదనను వెలిబుచ్చారు. శాసనసభ్యుడినని కూడా చూడకుండా తన పట్ల నిరంకుశంగా వ్యవహరించారన్నారు. అలాంటి టీడీపీ నేతలు ఇప్పుడు నీతులు చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. ‘‘టీడీపీ హయాంలో ఇదే శాసనసభ బయట బ్యాడ్జి వేసుకుంటే నన్ను అరెస్ట్‌ చేశారు.

తీసుకెళ్లి మంగళగిరి పోలీస్‌స్టేషన్‌లో పెట్టారు. రెండు రోజులు అక్కడే ఉంచారు. నేను లా గ్రాడ్యుయేట్‌ను, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేశా. నన్ను తీవ్రవాది కంటే దారుణంగా కొట్టారు. ఇవాళ సభలో చెప్పుకోవాలంటే అవమానంగా ఉంది. ఐదేళ్లు వాళ్లు(టీడీపీ) కొట్టిన దెబ్బలు ఇంకా గుర్తున్నాయి’’ అంటూ ఆయన ఉద్వేగానికి గురయ్యారు. వివరాలు ఆయన మాటల్లోనే..
 
"వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఇల్లు కూల్చారని ఆర్డీవో ఆఫీసు ముందు నిరసనకు కూర్చుంటే.. సబ్‌ కలెక్టర్‌ దఫేదార్‌ను కులం పేరుతో దూషించానని నాపై సబ్‌కలెక్టర్‌తో కేసు పెట్టించారు. నన్ను కడప సెంట్రల్‌ జైలులో పెట్టారు. మరుసటిరోజు ఉదయం ఆరు గంటలకు నిద్ర లేవగానే బయటకు వచ్చి కూర్చుంటే.. రావడం రావడమే జైలర్‌ ఎగిరి కాలితో తన్నాడు. ఇక్కడెందుకు కూర్చున్నావురా అని దుర్భాషలాడాడు.

ఎందుకు తంతున్నావని అడిగితే కారణం కూడా చెప్పలేదు. ఆ అవమానాన్ని తట్టుకోలేక రెండు రోజులు నీళ్లు కూడా ముట్టకుండా నిరాహారదీక్ష చేశాను. ఎందుకు కొట్టారో సమాధానం చెప్పాలని ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డిలు అడిగారు. అప్పటివరకు నిరాహారదీక్ష చేశాను.
 
ఎన్నికలకు ముందు ట్యాబ్‌లు పెట్టి ఓట్లు తొలగిస్తుంటే అడ్డుకున్నందుకు మా కార్యకర్తలను చిత్తూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి కళ్లకు గంతలు కట్టి కొట్టారు. ఎందుకు కొడుతున్నారని ధర్నా చేస్తే.. నన్ను రాత్రి పది గంటల సమయంలో పోలీసు బస్సులో ఎక్కించి తమిళనాడుకు తీసుకెళ్లారు.

బస్సులో కింద పడుకోబెట్టి తెల్లారేవరకు తిప్పారు. రాత్రంతా తీవ్రమైన మైగ్రేన్‌తో ఇబ్బంది పడ్డాను. ఒక్క టాబ్లెట్‌ ఇప్పించమని ప్రాథేయపడ్డా. అయినా వారు ఇప్పించలేదు. నొప్పి తాళలేక బస్సుకేసి తలను కొట్టుకున్నాను. తర్వాత సత్యవేడు పోలీస్‌స్టేషన్‌లో పెట్టారు. అక్కడ రెండురోజులు నిరాహారదీక్ష చేస్తే మా ఎమ్మెల్యేలంతా వచ్చి సంఘీభావం ప్రకటించారు. ఎలక్షన్ల వరకు బతికుంటే.. ఆ తరువాత బతుకుతావు. అప్పటిదాకా ఎలాగైనా నీవు బతుకు అని మా నాయకుడు రెండు, మూడుసార్లు చెప్పారు.
 
తిరుపతి ఆర్డీవో ఆఫీసు వద్ద నిరసన తెలిపితే కడప సెంట్రల్‌ జైలుకు పంపారు. తమిళనాడుకు తీసుకెళ్లే సమయంలో ఎత్తి బస్సులో పడేశారు. అప్పటినుంచి నాకు ఆరోగ్య సమస్య ఏర్పడింది. నా బాధను ఎవరికీ చెప్పుకోలేదు. ఆ గవర్నమెంటులో నేను చచ్చి బతికాను.

ఎన్ని ఇబ్బందులు పడ్డానో నాకు తెలుసు, వెంకటేశ్వరస్వామికి తెలుసు. నేను శాసనసభ్యుడిని కాదా? చట్టసభలో గెలవలేదా? నారావారిపల్లెకు శాసనసభ్యుడిని అయ్యానని ఆయనకు(చంద్రబాబు) బాధ. చంద్రబాబు పుట్టిన ఊరికి నేను ఎమ్మెల్యే కావడం నా తప్పా? ఇంతగా శిక్షించాలా?
 
నేను ఎంఏ తరువాత పీహెచ్‌డీ చేద్దామని రీసెట్‌ పరీక్ష రాశాను. అందులో క్వాలిఫై అయ్యాను. మూడేళ్లలో పీహెచ్‌డీ పూర్తిచెయ్యాలి. పీహెచ్‌డీకి ఒక సంవత్సరం ముందు ప్రీ పీహెచ్‌డీ పరీక్ష పెడతారు. తెలుగులో రాద్దామని ప్రయత్నించాను. అయితే తెలుగులో పరీక్ష రాస్తే ఇతనికి పీహెచ్‌డీ అవార్డు ఇవ్వొద్దు.. ఇతను ఎలా తెలుగులో పరీక్ష రాస్తాడంటూ తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం వారు ధర్నాలు చేశారు.

దీంతో నా ప్రీ పీహెచ్‌డీ పరీక్షను అంగీకరించలేదు. చివరకు కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. అయినా ఒప్పుకోలేదు. ఆఖరుకు కోచింగ్‌కు వెళ్లాల్సి వచ్చింది. వచ్చీ రాని ఇంగ్లిష్‌లో ఆరోజు ప్రీ పీహెచ్‌డీ ఎగ్జామ్‌ రాసి క్వాలిఫై అయ్యాను. ఇంగ్లిష్‌ మీడియం చిన్నప్పటి నుంచి ఉండుంటే నాకు ఆ కష్టం వచ్చి ఉండేది కాదు. ఆ రోజేమో తెలుగులో రాయడానికి వీల్లేదని గొడవ చేశారు. ఈ రోజేమో ఇలా మాట్లాడుతున్నారు. 
 
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నారాయణకు మంత్రి పదవి ఇచ్చారు. ఆయన వియ్యంకుడికి విద్యాశాఖ ఇచ్చారు. కొన్ని వందల ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లకు పర్మిషన్‌ ఇచ్చారు. ఒక్కటైనా తెలుగు మీడియం స్కూల్‌ ఎందుకు పెట్టలేదని బుచ్చయ్య అడిగారా? ఆరోజు అడగాలి కదా? తెలుగు భాషను పరిరక్షించాలంటే స్కూళ్లు మూత వేయకూడదని ఆ రోజు ఎందుకు చంద్రబాబును అడగలేదు?  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిక్కుల్లో నటి శ్రియ.. లండన్ పోలీసుల విచారణ