Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆత్మ పరిశీలనలో కర్ణాటక కాంగ్రెస్

ఆత్మ పరిశీలనలో కర్ణాటక కాంగ్రెస్
, గురువారం, 12 డిశెంబరు 2019 (20:48 IST)
కర్ణాటక కాంగ్రెస్ పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా పార్టీ అధిష్ఠానం పావులు కదుపుతోంది. రాష్ట్ర పార్టీలో జవసత్వాలు నింపే సమర్థుడైన నేత కోసం అన్వేషిస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రముఖ దళితనేత కేంద్ర మాజీ మంత్రి కె.హెచ్‌.మునియప్ప, లోక్‌సభలో కాంగ్రెస్‌ మాజీ నేత మల్లికార్జున ఖర్గే, మాజీ మంత్రి డి.కె.శివకుమార్‌ల పేర్లు ప్రముఖంగా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఇటీవలి ఉపపోరులో ఘోర పరాజయాలు మూటగట్టుకున్న అనంతరం కేపీసీసీలో ఆత్మ పరిశీలన ప్రారంభమైంది.

సీనియర్‌లు ఈసారి ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉండిపోవడాన్ని గమనించిన అధిష్ఠానం వీరికి తగిన ప్రాధాన్యత కల్పించాలని ఆలోచిస్తోంది. రాష్ట్ర పార్టీ శ్రేణులను ఏకతాటిపై నడిపించడంలో విఫలమైన ఇన్‌చార్జ్‌ కె.సి.వేణుగోపాల్‌ స్థానంలో మరోమారు ప్రముఖ నేత గులాంనబీ ఆజాద్‌ను నియమించాలని ఆలోచిస్తోంది. గులాంనబీ ఆజాద్‌ను ఇన్‌చార్జ్‌గా నియమించి కేపీసీసీ అధ్యక్ష పగ్గాలు మల్లికార్జున ఖర్గేకు అప్పగించాలని పార్టీలో ఒక వర్గం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి సూచించినట్టు సమాచారం.

సీనియర్‌లను విశ్వాసంలోకి తీసుకుంటూనే జూనియర్‌లకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని వీరు కోరుతున్నారు. మరోవైపు కేపీసీసీ అధ్యక్ష పదవికి దినేశ్‌ గుండూరావు, సీఎల్పీ నేత పదవికి మాజీ సీఎం సిద్దరామయ్య చేసిన రాజీనామాలను తక్షణం ఆమోదించాలని కాంగ్రెస్ లో మరోవర్గం డిమాండ్‌ చేస్తోంది.

ఢిల్లీలో తిష్టవేసిన పార్టీ సీనియర్‌ నేతలు బి.కె.హరిప్రసాద్‌, కె.హెచ్‌.మునియప్ప, బి.సి.చంద్రశేఖర్‌, డి.కె.సురేశ్‌లు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీని భేటీ అయ్యారు. రాష్ట్ర పార్టీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాల్సిందేనని వీరు సూచించారు.

అన్ని జిల్లాల్లోనూ పార్టీని బలోపేతం చేసేలా సమర్థులైన నేతలకు అవకాశం ఇవ్వాలని కోరారు. నేతలతో గంటకుపైగా చర్చించిన సోనియాగాంధీ ఎలాంటి హామీ ఇవ్వనప్పటికీ కర్ణాటకలో పార్టీ ప్రక్షాళనకు తరుణం ఆసన్నమైందన్న అంశాన్ని అంగీకరించినట్టు కాంగ్రెస్‌ వర్గాలను ఉటంకిస్తూ తెలిసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిర్మాలా సీతారామన్ తో టి ఆర్ ఎస్ ఎంపీలు భేటి