నిర్భయ కేసులో దోషులను ఉరితీసేందుకు పలువురు పోటీపడుతున్నారు. ఇప్పటికే హర్యానాకు చెందిన ఓ వ్యక్తి ఉరితీసేందుకు ముందుకువచ్చారు. తనను తాత్కాలిక తలారిగా నియమిస్తే తాను నిర్భయ దోషులను ఉరితీస్తానంటూ ప్రటించారు. అలాగే, ఇపుడు మీరట్ జైలుకు చెందిన తలారి పవన్ గుప్తా కూడా స్పందించారు.
ఆ నలుగురికి ఉరి వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ, నిర్భయ అత్యాచార కేసులో నలుగురికి ఉరిశిక్ష ఖరారైంది. ఆ నిందితులకు మరణశిక్షే సరైందని తలారి పవన్ చెప్పాడు.
మరోవైపు, తీహార్ జైలులో నిర్భయ నిందితులను ఉరి తీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయనే ప్రచారం సాగుతోంది. గత ఆర్నెళ్ల నుంచి నిర్భయ నిందితులకు జైలు అధికారులు ఎటువంటి పని అప్పగించలేదు. ఉరి గురించి వార్తలు రావడంతో నిందితులు డిస్టర్బ్ అయినట్లు తెలుస్తోంది. నిందితులను ప్రతిక్షణం సీసీటీవీల ద్వారా మానిటర్ చేస్తున్నారు.
క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు కూడా చేస్తున్నారు. ఉరితాడు కోసం తీహార్ జైలు అధికారులు బీహార్ జైళ్లను సంప్రదించినట్లు తెలుస్తోంది. బక్సర్ జైలు నుంచి 10 కొత్త ఉరితాళ్లను ఆర్డర్ చేశారు. బాక్సర్ జైలులో ఉన్న ఖైదీలే ఉరితాళ్లను తయారు చేస్తారు. కాగా, నిర్భయ కేసులో ఆరుగురికి శిక్ష పడింది. దాంట్లో ఒకరు బాల నేరస్థుడు కాగా, రామ్ సింగ్ అనే మరో నిందితుడు తీహార్ జైలులోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.