Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

Advertiesment
Vijay Deverakonda Kingdom poster

దేవీ

, గురువారం, 31 జులై 2025 (13:00 IST)
Vijay Deverakonda Kingdom poster
విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే నటించిన తాజా చిత్రం కింగ్డమ్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణ సారథ్యంలో శ్రీకర స్టూడియోస్ సమర్పించారు. ఈ చిత్రానికి జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రవిచందర్, జోమోన్ టి జాన్, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్లుగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జూలై 31న నేడే ఈ సినిమా విడుదలైంది. మరి ఎలా వుందో చూద్దాం.
 
కథ:
అది 1920నాటి బ్రిటీష్ పాలనకాలం. సముద్రతీరాన లంకలో వుంటున్న ఓ తెగ. అక్కడ లభించే బంగారు గనుల్ని బ్రిటీష్ వారు దక్కించుకునేందుకు అడ్డుగా వున్న ఆ తెగలవారిని చంపేస్తుంటారు. అందులో పోరాటవీరుడు విజయ్ దేవరకొండ తెగలకు అండగా వుండి చివరికి ప్రాణాలు కోల్పోతాడు. కట్ చేస్తే 1990 కాలంలో ఓ చిన్న ఊరిలో తల్లితోపాటు వుంటూ కానిస్టేబుల్ గా చేస్తుంటాడు సూరి (విజయ్ దేవరకొండ). ముక్కుసూటి, కోపిష్టి తను. చిన్న తనంలో తన అన్న పారిపోవడంతో అతన్ని వెతికే క్రమంలో పోలీస్ స్టేషన్ కు వచ్చిన సూరి, అక్కడ ఎస్.ఐ. ఓ ముసలాయన్ను కొట్టడం చూసి తట్టుకోలేక తిరిగి ఎస్.ఐ.ని కొడతాడు. 
 
విషయం తెలుసుకున్న పై అధికారులు సూరికి పనిష్ మెంట్ రూపంలో శ్రీలంకలో ఓ ఆపరేషన్ నిమిత్తం పంపిస్తాడు. అలా వెళితే పారిపోయిన మీ అన్నయ్యను చూపిస్తానంటాడు అధికారి. అలా మొదటగా జైలులో ఖైదీగా వెళ్ళిన సూరి అక్కడ మరో ఖైదీగా వున్న తన అన్న శివ (సత్యదేవ్) ను కలుస్తాడు. అలా ఇద్దరూ  షిప్ లో శ్రీలంక చేరతాడు. అక్కడ జరిగే మాఫియాను అడ్డుకునేందుకు సూరిని ఏవిధంగా పోలీసు అధికారులు ఉపయోగించుకున్నారు. ఎటువంటి సమస్యల్లో సూరి ఇరుక్కున్నాడు. చివరికి అక్కడ బానిసలుగా వుంటున్న తెగలకు సూరి ఎలా దేవుడు అయ్యాడు. అనేది మిగిలిన సినిమా.
 
సమీక్ష:   
కథపరంగా చూస్తే, కొత్త కథ కాకపోయినా నేపథ్యాలు కొత్తగా వుంటాయి. ప్రభాస్ కు ఛత్రపతి, ఎన్.టి.ఆర్.కు దేవర, రజనీకాంత్ కు పలు సినిమాలు ఇలాంటివే. మాఫియాతో సామాన్యుడి పోరాటమే ఇది. కానిస్టేబుల్ సూరి ఓ తెగకు దేవుడు అవ్వడం ముగింపు. మధ్యలో కథనం పరంగా కొన్ని సన్నివేశాలు కొత్తగా వుంటాయి.
 
సినిమాలో హైలైట్ గా చెప్పాలంటే, విజయ్ దేవరకొండ కేరెక్టరైజేషన్. ఈ కథ విజయ్ భారీ కథగా అనిపిస్తుంది. కథలో చెప్పాల్సిన అంశాలు చాలా టచ్ చేశాడు దర్శకుడు. బంగారాన్ని శ్రీలంక నేవీ అధికారుల నుంచి పోరాడి తీసుకువచ్చి మాఫియా వారికి అప్పగించడం అనే యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్. ఆ తర్వాత ప్రీక్లయిమాక్స్ మరో హైలైట్. ముగింపులో సాగే యాక్షన్ మరో ప్రత్యేకత గా చెప్పవచ్చు.
 
ఈ కథలో అన్నదమ్ముల అనుబంధం టచ్ చేస్తుంది. ఇక పోలీసుల దాష్టీకం సామాన్యులపై ఎలా వుంటుందనేది బాగా చూపించాడు దర్శకుడు. ఇంకోవైపు మాఫియాలో తండ్రీ కొడుకుల సంబంధం ఎంత వంచనతో వుంటుందో చూపించాడు. వెరసి ఈ సినిమాలో హింస చాలా ఎక్కువగా వుంది. మాఫియా పెద్ద చనిపోయాక కొడుకు మురుగన్ బానిసలుగా తమ కింద పనిచేసే తెగకు చెందిన వారిని తండ్రి ఆఖరి చూపుకు రమ్మని అందరినీ రాక్షసంగా చంపేస్తాడు. అలా కాకుండా తినే ఆహారంలో విషం పెడితే సింపుల్ గా  సరిపోయేది. రక్తపాతం అంత ఎక్కువగా వుండేది కాదు.
 
ఇందులో సూరి పాత్రలో విజయ్ దేవరకొండ తెగలకు దేవుడిగా వుంటాడు. ఇలాంటి సీన్స్ చూసినప్పుడు చాలా సినిమాలు ఇలానే వుంటాయనిపిస్తుంది. నేపథ్యాలు వేరయినా బాహుబలిలో ప్రభాస్ ప్రజలకు దేవుడులా కనిపిస్తాడు. అయితే కింగ్ డమ్ సినిమాలో అంతకంటే మించినట్లుగా డిజైన్ చేస్తే బాగుండేది. ఆల్ రెడీ త్రివిక్రమ్ శ్రీనివాస్ మెరుపులు ఇందులో కనిపిస్తాయి. తన భార్య నిర్మాత కాబట్టి ఇప్పటివరకు ఆయన గురించి ఏ సినిమాలోనూ ప్రస్తావన రాలేదు. కానీ ఈ సినిమాలో మొదట ఆయన పేరు, ఫొటో పెట్టి ధన్యవాదాలు తెలిపారు చిత్ర నిర్మాత.
 
విజయ్ దేవరకొండ నటనపరంగా, యాక్షన్ పరంగా చాలా కష్టపడి పనిచేశాడు. ఎక్కడా ఒల్లు దాచుకోకుండా నిజాయితీ చేసిన సినిమా ఇది. అన్నగా సత్యదేవ్ పాత్ర కీలకం. ఇద్దరి సన్నివేశాలు బాగున్నాయి. స్వార్థం కోసం పోలీసు పై అదికారులు కింది వారిని ఎలా ఉపయోగించుకుంటారో ఇందులోనూ చూపించారు. మిగిలిన పాత్రలన్నీ కథప్రకారం సాగేవే. ఎక్కడా వేస్ట్ సీన్ కనిపించదు.
 
అయితే, భాగ్యశ్రీ బోర్సె పాత్ర సాదాసీదాగా వుంటుంది. తనూ పోలీస్ ఇన్ ఫార్మర్ కాబట్టి సూరి అన్నను పట్టించే విషయంలో ఆమె పాత్ర వుంటుంది. అది సూరికి తెలీదు. తెలిస్తే ఏమవుతుందనేది తెలుసుకోవాలంటే దానికి  సీక్వెల్ వుంటే తెలుసుకోవచ్చు. ముగింపులో మాఫియా పెద్ద చనిపోయాక మురుగన్ కాకుండా మరో కొడుకు ఎంట్రీ ఇస్తాడు. అది ఎవరనేది చూపించకుండా దర్శకుడు ఇంట్రెస్ట్ గేమ్ ఆడాడు. అంతకుముందు కార్తీ సినిమాలో సూర్య ట్విస్ట్ ఇచ్చినట్లుగా వుంటుంది. అయితే కింగ్ డమ్ జీవితం సాఫీగా సాగాలంటే మరి కొన్ని అడ్డంకులు ఎదుర్కోవాలంటూ దర్శకుడు ముగింపు ఇచ్చి వదిలేశాడు. 
 
టెక్నికల్ గా చూస్తే, కెమెరా పనితనం అద్బుతం. సంగీతం సన్నివేశపరంగా సరిపోయింది. సీరియస్ కథ కావడంతో ఎక్కడా పాటలకుఛాన్స్ లేదు. తెగలలో సంబరాలు చేసే ఒక్క పాట మినహా ఎక్కడా కనిపించదు. విజువల్ ఎఫెక్ట్స్, బోట్ లతో ఛేజింగ్ వంటి  సన్నివేశాలు బాగున్నాయి. నేపథ్యం సంగీతం ఆకట్టుకుంది. ఒరిజినల్ లొకేషన్లలో చాలామటుకు తీసినట్లు కనిపిస్తుంది. ఏది ఏమైనా కింగ్ డమ్ అనేది విజయ్ దేవరకొండకు మాస్ ఇమేజ్ తెచ్చే విధంగా మలిచారు. అతనికి సరిపడా పాత్ర కనుక ఇప్పటి యూత్ కు నచ్చితే సినిమా మరో లెవల్లో వుంటుంది. సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ కి ఊపిరి ఇచ్చినట్లవుతుంది. చూద్దాం ఏమి జరుగుతుందో.
రేటింగ్ : 3/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు