Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సమాజ మార్పుపై 'మేరా భారత్‌ మహాన్‌' (మూవీ రివ్యూ)

సమాజ మార్పుపై 'మేరా భారత్‌ మహాన్‌' (మూవీ రివ్యూ)
, శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (10:01 IST)
నటీనటులు: అఖిల్‌ కార్తిక్‌, ప్రియాంక శర్మ, నారాయణ రావు, ఎల్‌బి. శ్రీరామ్‌, బాబు మోహన్‌, తణికెళ్ల భరణి, గిరి బాబు, ఆమని, తదితరులు.
 
సాంకేతికత: 
కథ: డా.శ్రీధర్‌ రాజు ఎర్ర, డైలాగ్స్‌: యర్రంశెట్టి సాయి, పాటలు: పెద్దాడమూర్తి, ఎడిటర్‌: మేనగ శ్రీను, ఫైట్స్: విజయ్‌, మేకప్‌: యాదగిరి, సినిమాటోగ్రఫీ: ముజీర్‌ మాలిక్‌, సంగీతం: లలిత్‌ సురేష్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సోమర్తి సాంబేష్‌, ప్రొడ్యూసర్స్‌: డా.శ్రీధర్‌ రాజు ఎర్ర, డా.తాళ్ల రవి, డా. టిపిఆర్‌, స్క్రీన్‌ ప్లే-దర్శకత్వం: భరత్‌.
 
నటుడు, సంగీతదర్శకుడు, రచయిత అయిన భరత్‌ పారేపల్లి పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన కెరీర్‌లో మైలురాయిలా నిలిచిన చిత్రం డా.దాసరి నారాయణ నిర్మాణంలో రూపొందిన 'మైసమ్మ ఐపీఎస్‌'. అనంతరం పలు చిత్రాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన దర్శకత్వంలో ప్రముఖ డాక్టర్లు నిర్మించిన చిత్రం 'మేరా భారత్‌ మహాన్‌'. ('ఎం.బి.ఎం.). శుక్రవారమే విడుదలైన ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం. 
 
కథ:
మహాన్‌ (శ్రీధర్‌రాజు) ఓ ప్రొఫెసర్‌. ఆయన భార్య ఆమని. ఓ కుమార్తె. హాయిగా సాగిపోతున్న వారి జీవితంలో జరిగిన ఓ సంఘటన సమాజంపై తిరుగుబాటు చేసేలా చేస్తుంది. అస్తవ్యస్తంగా ఉన్న పాలకులన్ని ఎండగట్టడంతోపాటు అవసరమైతే శిక్షించడం చేస్తుంటాడు. అతని భావాలకు కొంతమంది యువత ఆకర్షితులవుతారు. ఓ దశలో అఖిల్‌ కార్తిక్‌ అనే యువకుడిపై మహాన్‌ పెద్ద బాధ్యత పెడతాడు. ఆ తర్వాత ఏమయింది? కథ ఎటువైపు తిరిగింది? తనికెళ్ళభరణి, నారాయణ రావు వంటి మిగిలిన పాత్రలు ఏం చేశాయి? అనేది చిత్రంలోని మిగిలిన కథ.
 
విశ్లేషణ: 
సినిమాపరంగా చెప్పాలంటే సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులు తీసిన సినిమా ఇది. వైద్యవృత్తిలో ఉన్న ముగ్గురు మిత్రులు కలిసి సమాజానికి పట్టిన రుగ్మతను తొలగించడానికి ముందుకు వచ్చి నిర్మించడం మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. అలాగే, ఈ చిత్రంలో రైతు సమస్యలు, అధిక వడ్డీపేరుతో మోసాలు, అమ్మాయిల్ని నమ్మించి మోసం చేయడం వంటి ఎన్నో విషయాలను కళ్ళకు కట్టినట్లు దర్శకుడు చూపించాడు. కొన్నిసార్లు ఆలోచింపజేసే విధంగా తెరకెక్కించారు. వికాసంతో పాటు యువతను ఆకట్టుకునే వినోదం కూడా పాటల రూపంలో ఉన్నాయి. 
 
ముఖ్యంగా యువతకు మంచి సందేశం ఇస్తూ.. లవ్‌ స్టోరీని కూడా మిళితం చేశారు. చిన్నతనంలో దూరమైన ఇద్దరు తర్వాత కలవడం వంటివి బాగున్నాయి. ఎర్రంశెట్టి సాయి డైలాగ్స్‌, లలిత్‌ సురేష్‌ మ్యూజిక్‌, పెద్దాడమూర్తి సాహిత్యం బాగుంది. ముఖ్యంగా లలిత్‌ సురేష్‌ సంగీతం వినసొంపుగా వుంది. గ్రామీణప్రాంతాల్లో అధిక వడ్డీకి డబ్బులు తీసుకుని అవి కట్టలేక బాధపడే రైతు సమస్యలు, పిల్లల చదువు కోసం ఇల్లు తాకట్టుపెట్టే సన్నివేశాలు, చదివిన చదువుకు సరైన ఉపాధిలేకపోవడం వంటి ప్రస్తుత బర్నింగ్‌ సమస్యలను ఇందులో టచ్ చేశాడు.
 
ఈ చిత్రంలో సీఎం.గా విజయ్‌చందర్‌, హోంమంత్రిగా గిరిబాబు, పీఏగా బాబూమోహన్‌ నటించారు. కీలకమైన ఈ పాత్రల్ని మరింత జాగ్రత్తతో తీస్తే చిత్రం స్థాయి పెరిగేది. దర్శకుడిగా పలు చిత్రాలు చేసిన అనుభవమున్న భరత్‌ సమాజంపై ఉన్న సామాన్యుడిలా ఆలోచించి తను చెప్పాలనుకున్నది చెప్పాడు. ముగింపు సందేశం ఆకట్టుకునేదిగా వుంది. అయితే ఇలాంటి సందేశాత్మక చిత్రం తీస్తున్నప్పుడు అందరినీ ఆకట్టుకునేలా తీస్తే బాగుండేది. ఎందుకంటే చాలాచోట్ల లింక్‌ తెగినట్లుగా సన్నివేశాలు కనిపిస్తాయి. హోంమంత్రి, పీఏలు ఇద్దరూ గ్రామంలో అనామకులా రావడం వంటి సీన్‌ ఎందుకు పెట్టారనేది క్లారిటీ ఇస్తే బాగుండేది. 
 
ఇక మహాన్‌ దేశం కోసం పడే తపన కన్పించింది. దాన్ని యూత్‌లో ఎవేర్‌నెస్‌ తెచ్చేలా మరింతగా సన్నివేశాలు కూర్చుంటే బాగుంటేంది. తనికెళ్ళభరణి, నారాయణ రావు, ఎల్‌బి. శ్రీరామ్‌లు తమ పాత్రలకు న్యాయం చేశారు. హీరోగా చేసిన కార్తీక్‌ ఓకే. నాయికగా ప్రియాంక సరిగ్గా సరిపోయింది. విలన్‌గా నటించిన బాలాజీ తనలోని నటనను బయటపెట్టాడు. కథ చాలా బాగుంది. దాన్ని మరింత ఆకట్టుకునేలా స్క్రీన్‌ప్లేలో చూపితే గొప్ప చిత్రమయ్యేది. ఏది ఏమైనా ప్రతి వ్యక్తి చూడతగ్గ చిత్రం. ఎటువంటి వల్గారిటీ, మాయలు లేకుండా చెప్పదలచుకున్నది సూటిగా చెప్పే ప్రయత్నం చేసిన చిత్రమిది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అల్లు అర్జున్ - త్రివిక్ర‌మ్ మూవీ ఇంట్ర‌స్టింగ్ అప్‌డేట్