Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దెయ్యానికి కూడా దేవుడు హెల్ప్ కావాల్సిందే.. "కాంచన-3" మూవీ రివ్యూ

webdunia
శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (18:01 IST)
చిత్రం : కాంచన-3
నిర్మాణ సంస్థ‌లు: రాఘ‌వేంద్ర ప్రొడ‌క్ష‌న్స్, లైట్ హౌస్ మూవీ మేక‌ర్స్‌
న‌టీన‌టులు: రాఘవ లారెన్స్‌, వేదిక‌, ఓవియా, నిక్కీ తంబోలి, క‌బీర్ దుహ‌న్ సింగ్‌, శ్రీమాన్ తదితరులు.
సంగీతం : ఎస్ఎస్.థమన్
నిర్మాత : రాఘవ
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : రాఘవ లారెన్స్
 
కొరియోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా మారిన రాఘవ లారెన్స్ పుష్కరకాలం క్రితం తొలిసారి హారర్ (ముని) చిత్రాలకు శ్రీకారం చుట్టారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసులు వర్షం కురిపించడంతో దానికి సీక్వెల్స్‌ని తెరపైకి తీసుకొస్తూ విజయాల్ని సొంతం చేసుకుంటున్నారు. ఈ సినిమా నుంచి కాంచన, కాంచన-2 సిరీస్‌లు వచ్చాయి. ఇవి కూడా తెలుగు, తమిళ భాషల్లో విజయాల్ని సాధించి భారీ వసూళ్లని రాబట్టాయి. 
 
ముని ఫ్రాంచైజీలో భాగంగా దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత రాఘవ లారెన్స్ నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం "కాంచన-3". హారర్‌కు ఎంటర్‌టైన్‌మెంట్‌ను జోడించి లారెన్స్ రూపొందించిన ఈ సిరీస్ చిత్రాలంటే ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అదే అంచనాలు "కాంచన-3" చిత్రానికి ఏర్పడ్డాయి. అయితే ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుందా?. హారర్ ఎంటర్‌టైనర్స్‌ని ఇష్టపడే ప్రేక్షకుల్ని ఆకట్టుకుందా? లారెన్స్ తన మార్కు మాయాజాలంతో మళ్లీ మ్యాజిక్ చేశాడా? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే. 
 
కాళీ(రాఘవ లారెన్స్) తల్లి రాధమ్మ (అనుపమా కుమార్) తన పేరుతో అనాథల్ని చేరదీసి ఓ ఆశ్రమాన్ని నడిపిస్తూ వుంటుంది. తల్లి రాధమ్మ చనిపోవడంతో ఆ ఆశ్రమ బాధ్యతల్ని కాళీ చూసుకుంటుంటాడు. తల్లి తరహాలోనే తన చుట్టూ ఉన్న అనాథలల్ని చేరదీసి వారికి అండగా నిలుస్తుంటాడు. ఇదే ఆశ్రమంలో వుండే రోసీ(అట్మా పాట్రిక్) చిన్నతనం నుంచి కాళీని అభిమానిస్తూ వుంటుంది. 
 
మరోవైపు, సిటీలో రౌడి భ‌వాని (క‌బీర్ దుహ‌న్ సింగ్‌) అత‌ని మనుషులు కొంత మంది పోలీసుల‌ను హ‌త‌మారుస్తారు. ఆ తర్వాత కాళీకి చెందిన ఆశ్రమం ఖాతాలో రూ.100 కోట్లు జమచేసి దాంట్లోంచి రూ.80 కోట్లు తన ఖాతాకు మళ్లించుకోవాలనుకుంటాడు. దీన్ని కాళీ వ్యతిరేకిస్తాడు. ఇందుకోసం భవానీ ఇచ్చిన ఆఫర్‌ని కాళీ తిరస్కరిస్తాడు. ఈ క్రమంలోకాళీ, రోశీలు చనిపోతారు. వీరు ఎందుకు చనిపోతారు? ఆ తర్వాత ఏం జరిగింది? వాళ్ల మధ్యకు కాంచన ఎలా వచ్చింది?. కాళీ, రోసీలకు రాఘవ(రాఘవ లారెన్స్)కున్న సంబంధం ఏమిటి?. వాళ్ల కోసం రాఘవ ఏంచేశాడన్నది తెరమీద చూడాల్సిందే.
 
'కాంచన' సిరీస్‌లో వచ్చిన మూడో చిత్రం ఇది. పైగా, రాఘవ లారెన్స్ తన హవా తగ్గిందనుకున్న సమయంలో 'కాంచన' సిరీస్‌లో ఒక చిత్రాన్ని రిలీజ్ చేస్తూ తాను కూడా ఉన్నట్టు ప్రేక్షకులకు గుర్తు చేస్తుంటాడు. పైగా, హరర్ చిత్ర కథాలను ఎంటర్‌టైన్‌ చేయడంలో రాఘవ లారెన్స్ మంచి సిద్ధహస్తుడు. ఇదే పంథాను ఆపాదించి ముని నుంచి వరుస విజయాల్ని సొంతం చేసుకుంటున్నారు. ఇపుడు దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత రాఘవ లారెన్స్ అదే ఫార్మాట్‌తో అదే పాత్రలతో చేసిన చిత్రం "కాంచన-3". మదర్ సెంటిమెంట్‌ని జోడించి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 
 
దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా తెర వెనుక త్రిపాత్రాభినయం చేసిన లారెన్స్ సినిమాలో రాఘవగా, కాళీగా ద్విపాత్రాభినయం చేసి ఆకట్టుకున్నారు. తన పరిధి మేరకు తన వంతు బాధ్యతల్ని సమర్థవంతంగా పోషించాడు. కథ విషయంలో మరింత శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. సినిమాని రిచ్‌గా తెరకెక్కించిన ఆయన ఆ స్థాయి కథ, కథనాలతో ఆకట్టుకునే ప్రయత్నం పూర్తి స్థాయిలో చేయలేకపోయారని చెప్పొచ్చు. చూస్తున్నది మూడో భాగమైనా స్క్రీన్‌ప్లే, కథ, కథానాలు "కాంచన-2" చూస్తున్న అనుభూతినే కలిగిస్తాయి. ఒక దశలో హీరోయిన్‌లని మినహాయిస్తే అవే పాత్రలు కావడంతో సగటు ప్రేక్షకుడికి 'కాంచన-2' చూస్తున్నట్టే అనిపిస్తుంది. 
 
అదేసమయంలో రాఘవ లారెన్స్ తొలి భాగంలో రాఘవగా, రెండో భాగంలో కాళీగా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. కాళీ పాత్రలో పెప్పర్ అండ్ సాల్ట్ గెటప్‌లో లారెన్స్ తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు. రెండు దెయ్యాలు ఒకేసారి ఆవహించిన సన్నివేశాల్లోనూ, హై హీల్స్ ధరించి లేడీలా క్యాట్ వాక్ చేస్తూ హావభావాలు పలికించిన సన్నివేశంలోనూ లారెన్స్ ఆకట్టుకున్నాడు. పతాక ఘట్టాల్లోనూ తన మార్కును చూపించి భీభత్సం సృష్టించాడు. 
 
ఇందులో లారెన్స్‌కు జోడీగా నటించిన ఓవియా, వేదిక, నిక్కీ లంబోలి తమ పాత్రల పరిధిమేరకు నటించి ఫరావాలేదనిపించారు. తల్లిగా నటించిన కోవై సరళ, అన్నగా నటించిన శ్రీమాన్, వదినగా నటించి దేవదర్శిని సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌ని పండించి తమ పాత్రలకు మరోసారి న్యాయం చేసి సీరియస్‌గా సాగిపోతున్న సినిమాలో ప్రేక్షకులకు రిలీఫ్‌ని కలిగించారు. 
 
విలన్ భవానీగా కబీర్ దుహన్‌సింగ్, అతని అన్న మినిస్టర్ శంకర్‌గా తరుణ్ అరోరా తమ పాత్రల పరిధిమేరకు నటించారు. తమన్ అందించిన నేపథ్య సంగీతం కాంచన సిరీస్‌లో వచ్చిన గత చిత్రాల స్థాయిలో ఆకట్టుకుంది. అయితే పాటల్లో ఒకటి రెండు తప్ప మరేవీ ఆకట్టుకునే విధంగా లేవు. రాఘవ లారెన్స్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించడంతో క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడినట్టు కనిపించదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాలో ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా వుండేలా జాగ్రత్త పడ్డాడు. 
 
కాంచన సిరీస్ నుంచి సినిమా వస్తోందంటే ప్రేక్షకుల్లో వుండే అంచనాలే వేరు. అయితే ఆ అంచనాలను కాంచన-3 అనుకున్న స్థాయిలో అందుకోలేకపోయిందనే చెప్పాలి. కథ, కథనాలు, శరత్‌కుమార్ హిజ్రాగా నటించిన కాంచన, నిత్యామీనన్ దివ్యాంగురాలిగా నటించిన "కాంచన-2" చిత్రాలని గుర్తు చేసేలా వున్నాయి. సినిమా చూస్తున్న సగటు ప్రేక్షకుడికి ఈ రెండు భాగాల్ని ఒకే సినిమాలో చూపించిన ఫీలింగ్ కలుగుతుంది. ఇదే ఈ సినిమాకు ప్రధాన మైనస్‌గా మారింది.  
 
ఓవరాల్‌గా చెప్పాలంటే గత సిరీస్‌ల తరహాలోనే భయపెడుతూ నవ్వించినా ఆ స్థాయిలో మాత్రం ఆకట్టుకోలేకపోయిందన్న మాత్రం వాస్తవం. సినిమా ఆఖరులో దెయ్యానికి కూడా దేవుడి సహాయం అవ‌స‌రం కావ‌డం.. దేవుడు స‌పోర్టు చేయ‌డంతో శ‌త్రువుల‌ను తుద‌ముట్టించ‌డంతో సినిమాను ముగించారు. ఎప్ప‌టిలాగానే త‌దుప‌రి పార్ట్ కాంచ‌న 4 (ముని 5) ఉంటుంద‌ని దర్శకుడు ఓ లీక్ ఇచ్చేశాడు. 

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

కొరివితో తల గోక్కోవడానికి సిద్ధమైన రాంగోపాల్ వర్మ