చిత్రం.. "క్రాక్"
బ్యానర్స్: సరస్వతి ఫిలిమ్స్ డివిజన్
నటీనటులు: రవితేజ, శ్రుతిహాసన్, సముద్రఖని, వరలక్ష్మి శరత్‌కుమార్, రవిశంకర్ తదితరులు.
సంగీతం: తమన్.ఎస్.ఎస్
నిర్మాత: బి.మధు
దర్శకత్వం: గోపీచంద్ మలినేని
హీరో రవితేజ - గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి వచ్చిన మూవీ "క్రాక్". గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో 'డాన్ శీను', 'బలుపు' వంటి చిత్రాలు వచ్చాయి. ఇపుడు ఈ కాంబినేషన్ రిపీట్ కావడంతో ప్రతి ఒక్కరిలోనూ అమితాసక్తి నెలకొంది. వీరి కలయికలో సినిమా రూపొందడం ఒకటైతే. మరో విషయం... కోవిడ్.. థియేట్స్ అన్‌లాక్ నేపథ్యంలో విడుదలైన తొలి స్టార్ హీరో సినిమా 'క్రాక్'.
తొలి రెండు చిత్రాలకు భిన్నంగా రవితేజను పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా దర్శకుడు తెరపై ప్రెజంట్ చేశారు. మరి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా? దాదాపు ఆరేడు నెలల తర్వాత వచ్చిన ఈ స్టార్ మూవీ ఈ సంక్రాంతిక మంచి స్టార్టప్ అని అనుకోవచ్చా? టీజర్, ట్రైలర్ సినిమా బావుంటుందనే అంచనాలను క్రియేట్ చేశాయి. మరి అంచనాలను సినిమా అందుకుందా? అటు రవితేజ, ఇటు గోపీచంద్ మలినేనికి సరైన హిట్ లేదు. ఈ నేపథ్యంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన క్రాక్ మూవీ హిట్ అయినట్లేనా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
చిత్ర కథ...
సీఐ పోతరాజు వీర శంకర్(రవితేజ) ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. పోలీస్ శాఖలో ప్రతి ఒక్కరూ ఆయన్ను క్రాక్ అని ముద్దుగా పిలుచుకుంటుంటారు. అందుకు కారణంగా సిన్సియర్‌గా డ్యూటీ చేయడం. తన పనికి అడ్డువచ్చిన వాడి తాట తీయడం. అలాంటి వీరశంకర్‌కి ఉన్న మరో సమస్య.. ఎవరైనా బ్యాగ్రౌండ్ గురించి మాట్లాడితే కోపం రావడం. ఎవడైనా బ్యాగ్రౌండ్ తెలుసా? చిందులేస్తే వాడి అంతు చూడందే శంకర్‌కి నిద్రపట్టదు.
అందుకే వరస ట్రాన్స్‌ఫర్లు వస్తుంటాయి. అలా శంకర్ కడపకు బదిలీ అవుతాడు. అదేసమయంలో అక్కడ ఉండే కొండారెడ్డి(రవిశంకర్) చిన్న తప్పు చేస్తాడు. ఆ కేసుని వీర శంకర్ డీల్ చేస్తాడని తెలుసుకున్న జిల్లా ఎస్.పి.. కొండారెడ్డికి ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమని చెబుతాడు. కానీ ఎస్.పి. మాటలను విని నేను చాలా మంది పోలీస్ ఆఫీసర్స్‌ను చూశానని కొండారెడ్డి అంటాడు.
శంకర్ గురించి తెలుసుకోవాలంటే రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి కటారి కృష్ణ(సముద్రఖని)ని కలవమని ఎస్పీ చెబుతాడు. సరేనని! కొండారెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలుకెళ్లి కటారికృష్ణను కలుస్తాడు. ఒంగోలు ఒకప్పుడు పేరు మోసిన రౌడీ అయిన కటారి కృష్ణ.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఎందుకు వచ్చాడు? అతనికి, శంకర్‌కి ఉన్న గొడవేంటి? చివరకు కటారికి కృష్ణ గురించి విన్న కొండారెడ్డి ఏం చేస్తాడు? అనే విషయాలు వెండితెరపై చూడాల్సిందే.
చిత్ర సమీక్ష...
రవితేజ వయసెంత? లేటెస్ట్‌గా కిరాక్ సినిమాలో ఆయన్ని చూసిన వారందరికీ వచ్చిన డౌట్ ఇది. స్క్రీన్ మీద ఫ్రెష్ లుక్‌తో పర్ఫెక్ట్ కాప్‌గా కనిపించారు. పోలీస్ పాత్రలకు సరిగ్గా సూటవుతారనే పేరుంది. ఇప్పుడు ఆ విషయం ఈ మూవీతో మరోసారి ప్రూవ్ అయింది. కొన్ని కాంబినేషన్స్‌కి ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది.
ఇకపోతే, రవితేజ, శ్రుతిహాసన్ కాంబోలో మేజిక్ స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అయింది. శ్రుతి హాసన్ ఇల్లాలి పాత్రలో ఉన్నప్పుడు చీరకట్టులో, తైక్వాండో ప్రాక్టీస్ చేస్తున్న షాట్స్‌లో పక్కా ప్రొఫెషనల్‌గా, పోలీస్ డ్రస్సులో శివంగిలాగానే అనిపించారు. వారిద్దరి కొడుకు కేరక్టర్‌లో నటించిన గోపీచంద్ మలినేని కొడుకుకి బాలనటుడిగా మంచి ఫ్యూచర్ ఉంది. టైమింగ్‌తో పాటు పిల్లాడి ఫేస్‌లో క్యూట్‌నెస్, క్లారిటీ కనిపిస్తోంది.
50 రూపాయలు, ఒక మామిడికాయ, మేకు అనే కాన్సెప్ట్‌ని ట్రైలర్‌లోనే చిత్ర యూనిట్ రివీల్ చేసింది. ఆ మూడు వస్తువుల చుట్టూ అల్లుకున్న కథ బావుంది. ప్రతి సీన్‌లోనూ హీరోని డైరక్టర్ ఎలివేట్ చేసిన తీరు కూడా అభిమానుల చేత విజిల్స్ వేయిస్తుంది. తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ట్యూన్స్ బావున్నాయి. పాటలను పిక్చరైజ్ చేసిన తీరు, పాటలకు కంపోజ్ చేసిన స్టెప్స్ మెప్పిస్తాయి.
భూమ్ బద్దలు పాటలో అప్సర రాణి లుక్స్ ఫ్రెష్‌గా అదుర్స్. రామ్ లక్ష్మణ్ మాస్టర్లు కంపోజ్ చేసిన ఫైట్లు ఒళ్లు గగుర్పొడిపిస్తాయి. అసలు స్టంట్స్ మీద పెద్దగా ఆసక్తి లేనివాళ్లు కూడా కళ్లప్పగించి ఆ స్టంట్స్‌ని చూసేలా కంపోజ్ చేశారు. వరలక్ష్మి కాసేపే కనిపించినా ఆమె మార్కు యాక్టింగ్‌కి స్కోప్ ఉన్న పాత్రలో చేశారు.
సౌత్‌కి పర్ఫెక్ట్ ఆర్టిస్ట్‌గా సముద్రఖని అప్పియరెన్స్ ఉంది. సంక్రాంతికి కావాల్సిన పక్కా కమర్షియల్ విలువలతో కూడిన చిత్రమే ఈ క్రాక్. సేతుపతికి రీమేక్ అని మొదట్లో వార్తలు వినిపించినా, దానికీ దీనికీ ఎక్కడో ఒక చోట తప్పితే పెద్దగా పొంతనలు లేవు. వరలక్ష్మిని సముద్రఖని చంపించే సీన్‌లో అక్కడెక్కడో సముద్రతీరాన సేద తీరుతున్న రౌడీలు క్షణాల్లో ఆమె ముందు వాలిపోవడం కాస్త లాజిక్‌కి అందదు.
రిలీజ్ టైమ్‌లో ఫైనాన్షియల్ ఇష్యూస్ కారణంగా కొన్ని షోలు వాయిదా పడ్డప్పటికీ, జనాలను థియేటర్లకు రప్పించే పక్కా మాస్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సంక్రాంతికి పొంగల్ కాకుండా, పక్కా మాస్ బిర్యానీని రవితేజ - గోపిచంద్ మలినేని వడ్డించారని చెప్పొచ్చు.