Anupama Parameswaran, Darshan Rajendran, Sangeetha
పరదా పేరుతో ముసుగులతో ఉన్న ఆడవాళ్ళ పోస్టర్స్ పై చిత్రం ఎలా వుండబోతోంది అనేది చూచాయిగా చెప్పారు దర్శక నిర్మాతలు. అనుపమా పరమేశ్వరన్ డీ గ్లామర్ రోల్ ప్లే చేయడంతో సహజానికి దగ్గరగా వున్నట్లు తెలియజేశారు. దర్శన రాజేంద్రన్, సంగీత కీలక పాత్రధారులు మరో ఆసక్తికరంగా అనిపించింది. సినిమా బండి, శుభం వంటి భిన్నమైన చిత్రాలతో ఆకట్టుకున్న ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఈ సినిమా నేడే థియేటర్లలో విడుదలైంది. విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పి.వి. నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పించిందా.. లేదా.. పరిశీలిద్దాం.
కథ:
సిటీకి దూరంగా వుండే పడతి అనే గ్రామం. జ్వాలమ్మ వారి గ్రామ దేవత. ఆమె గర్భిణిగా ఉన్న సమయంలో నలుగురు ఆమెను హింసించడంతో తిరగబడి వారిని చంపి, ఆత్మహుతికి పాల్పడుతుంది. అప్పటినుంచి ఆమె రూపాన్ని ఓ పెద్ద విగ్రహంలో పరదా వేసి వుంచి దీపారాధన చేస్తుంటారు. ఆమె ఊరిని కాపాడుతుందనే నమ్మకం. ఆడవాళ్లు ముఖానికి పరదా వేసుకుని బయటకు వెళ్ళకూడదు. ఒకవేళ తీస్తే జ్వాలమ్మ ముందు ఆత్మహుతి కావలసిందే. పైగా పుట్టిన పిల్లలూ చనిపోతుంటారు.
ఇలాంటి ఆచారం వున్న గ్రామంలో సుబ్బలక్ష్మీ ఉరప్ సుబ్బు (అనుపమా పరమేశ్వరన్), రాజేశ్ (రాగ్ మయూర్) అనే ప్రేమికులు ఉంటారు. ఇద్దరికీ పెద్దలు పెళ్లి నిశ్చయిస్తారు. నిశ్చితార్థం రోజు సిటీ నుంచి ఓ వ్యక్తి వల్ల ఫెమినా ఇంగ్లిష్ మ్యాగజైన్ లో సుబ్బు కవర్ పేజీ బయటపడడంతో పెద్ద రాద్దాంతం జరిగి నిశ్చితార్థం ఆగిపోవడమేకాకుండా సుబ్బు ఆత్మాహుతి చేయాల్సి వస్తుంది. ఆ సమయంలో సుబ్బు ఏమి చేసింది? అసలు ఈ మేగజైన్ లో ఫొటో వేసింది ఎవరు? ఆయన్ను కలిసి వారం రోజుల్లో వివరాలు తెలుసురావాలనే రూల్ పెట్టడంతో సుబ్బు, బంధువైన సంగీత బయలుదేరి ఉత్తరాది బయలుదేరతారు. ఆ క్రమంలో జరిగిన కథనమే మిగిలిన సినిమా.
సమీక్ష:
ఈ పరదా ధరించడం అనేది ఉత్తరాదిలో కొన్ని కులాలవారు ఆచరిస్తుంటారు. దక్షిణాదిలో కొన్ని ట్రైబల్ ఏరియాలోనూ లోగడ వుండేదనేది నానుడి. అక్కడ పోలీసు వ్యవస్థ కూడా వుండదు. సర్పంచ్ ఏది చెబితే అదే చట్టం. అలాంటి పరిస్థితులు వున్న గ్రామ కథ. ఆచారం వింతగా అనిపించినా ఫొటో తీసిన వ్యక్తి కోసం వెళ్ళే గమనమే సినిమాకు ఆకర్షణ. ఆ క్రమంలో జరిగే పలు సంఘటనలు, వివిధ వ్యక్తుల మనస్తత్వాలు, ప్రవర్తలు, అక్కడి ఆచారాలు అన్నీ సగటు మహిళ జర్నీలో ఎన్నో విషయాలు నేర్చుకునేందుకు ఉపయోగపడుతుంది.
కశ్మీర్ పరిసరాల్లో వెళ్ళాక అక్కడ ప్రయాణం రోజులతరబడి ఎలా ఆగిపోవాల్సివస్తుందో అనేది చక్కగా చూపించాడు. పర్వతంపై కలిసే రాజేంద్రప్రసాద్ చెప్పిన పక్షి కథ సినిమా కథకు మూలం అని చెప్పాలి. ఈ సన్నివేశంలో అమ్మాయి జీవితం పక్షిలాంటిది. ఎగరడానికి రెక్కలు వచ్చినా ఎగిరితే పెద్ద పెద్ద గ్రద్ధలు లాంటివి దాడిచేసి తినేస్తుంటాయి. ఈడు వచ్చిన అమ్మాయి జీవితం కూడా అలాంటిదే అని చాలా చాకచక్యంగా సినిమాలో దర్శక, నిర్మాతలు చూపించారు. ఈ పాయింట్ తనకు బాగా నచ్చిందని అనుపమ కూడా తెలియజేసింది.
ఉత్తరాదిలో ధర్మశాల ప్రాంతానికి వెళ్ళే మార్గంలో ప్రయాణం, అక్కడ బస చేయాల్సి రావడం, అక్కడ జరిగిన భయంకర సంఘటన సుబ్బు జీవితాన్ని ఆలోచించేలా చేస్తాయి. ఇప్పటి యువత ఆలోచలకు ప్రతినిధిగా దర్శన రాజేంద్రన్, అప్పటి ఆలోచనలు, పద్ధతులకు ప్రతినిధిగా సంగీత పాత్రలు మెప్పిస్తాయి. వారి మధ్య సాగే సంభాషణలు, చర్చ యూత్ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే.
అనుపమా పరమేశ్వరన్ గ్రామీణ యువతిగా పూర్తి న్యాయం చేసింది. హిమాలయాల్లో జరిగిన ఘటన తర్వాత పరదా ఆచారాన్ని మార్చడం బాగుంది. రత్నగా సంగీత క్యారెక్టర్ అలరించింది. ఆమె భర్తగా హర్షవర్థన్ పిల్లలతో కాసేపు నవ్వించారు. రాగ్ మయూర్, బలగం సుధాకర్ రెడ్డి.. ఇతర పాత్రధారులంతా పరిధి మేరకు నటించారు. కథ సాగడానికి కారణమైన ఫోటోగ్రాఫర్ పాత్రలో గౌతమ్ మీనన్ కనిపిస్తారు.
ముఖ్యంగా వనమాలి సాహిత్యం, గోపీసుందర్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. సినిమాలో మాటలు బాగున్నాయి. మృదుల్ సుజిత్ సేన్ సినిమాటోగ్రఫీ బాగుంది. టెక్నీకల్‌గా సినిమా బావుంది. తన గత చిత్రాలు వేరే జానర్‌లో తీశాడు ప్రవీణ్. ఇది మాత్రం కాస్త ప్రత్యేకంగానే ప్లాన్ చేసినా సెకండాఫ్‌లో గాడి తప్పకుండా గ్రిప్పింగ్‌గా ఉండుంటే రిజల్ట్ ఇంకాస్త బావుండేది. ఇప్పటి యువత చూడతగ్గ సినిమా.ఎంత మేర సక్సెస్ అవుతుందనేది ప్రేక్షకుల ఆదరణ బట్టే తెలుస్తుంది. ఎక్కడా వల్గారిటీ లేకుండా పాతకాలం ఆచారాలు కళ్ళకు కట్టినట్లు చూపించారు. చిన్న చిన్న లోపాలున్నా కథనంలో మరిపిస్తాయి.