మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆచార్య . కరోనావల్ల వాయిదా పడుతూ సంక్రాంతికి విడుదల కావాల్సి వున్నా ఆర్.ఆర్.ఆర్., కె.జి.ఎఫ్.2 సినిమాల వల్ల పోస్ట్‌పోన్ అయింది. ఎట్టకేలకు ఈ శుక్రవారమే ఏప్రిల్ 29న విడుదలైంది. ట్రైలర్‌లోనూ పబ్లిసిటీలలో ఆచార్య గురించి, ధర్మస్థలి సెట్ గురించి రకరకాలుగా హైప్ చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, రామ్‌చరణ్ కలయిక మరింత హైప్ క్రియేట్ చేసింది. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
కథః
అది ధర్మస్థలి అనే పర్వత ప్రాంతం. అక్కడ వనమూలికలు సమృద్ధిగా దొరుకుతూ అక్కడ నివసించే వారికి ఆరోగ్యంతోపాటు ధర్మంలోనే నడవాలని కొన్నేళ్ళుగా పెద్దలు చెబుతుంటతారు. అందుకే అక్కడ నెలకొన్న అమ్మవారిని ధర్మస్థలిపేరును చిరస్థాయిగా నిలపాలని పూజలు చేస్తారు. అక్కడ గురుకులంలో విద్యాభ్యాసం చేసి ధర్మానికి కట్టుబడిన సిద్ధ (రామ్‌చరణ్) ఓరోజు ఊరి ప్రజలకు కనిపించకుండా పోతాడు. ఆ సమయంలో ఆచార్య (చిరంజీవి) ఆ ఊరిలో ప్రవేశించి సోనూసూద్ ఆధ్వర్యంలో రాక్షసరాజ్యం అయిన ప్రాంతాన్ని ప్రక్షాళణ చేయడానికి సిద్ధమవుతాడు. ఈ దశలో ఆయన ఎదుర్కొన్న సంఘటనలు, అసలు నక్సలైట్ నాయకుడిగా వనాన్ని వదిలి ధర్మస్థలికి ఎందుకు వచ్చాడో అన్నది మిగిలిన కథ.
విశ్లేషణః
కథాపరంగా చూస్తే చాలా సినిమాలు టచ్ అవుతాయి. అయినా చక్కటి వాతావరణంతో కూడిన ధర్మస్థలి ప్రాంతం, చుట్టూ వనాలు, నదీ ప్రాంతం, అమరికలు లేని ప్రజలు, వారిని పీడించే రాక్షస నాయకుడు పాత్రలు కనిపిస్తాయి. నటుడిగా మెగాస్టార్ చిరంజీవి స్టామినా ఏ మాత్రం తగ్గలేదు. డాన్స్ పరంగా, ఫైట్స్ పరంగా స్లయిలిష్‌గా చూపించాడు దర్శకుడు. క్లయిమాక్స్‌లో రాక్షస సంహారం నగ్జలైట్ చేయాల్సి వస్తే ఎలా వుంటుందో అనే సన్నివేశాలు వున్నాయి. అయితే అవన్నీ ఇంతకుముందు వచ్చిన సినిమాలు కళ్ళ ముందు కనిపించడంతో కిక్ అనిపించదు.
ఇక ధర్మస్థలి ప్రాంతం అక్కడి ప్రజల కట్టుబాట్లు, వస్త్రధారణ, స్లో నెరేషన్ అంతా మలయాళ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ తరహాలో మోహన్‌లాల్ సినిమాలు గుర్తుకువస్తాయి. ఇక సంగీతపరంగా మణిశర్మ బాణీలు బాగున్నాయి. బీట్‌లో ఎనర్జీ వుంది. అందుకు తగినవిధంగానే `లాహే.. పాట, మందాకినీ, బంజారా పాటలు వున్నాయి. బంజారా పాట సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. ఈ పాటలో చిరంజీవి ఎనర్జీలెవల్ రామ్‌చరణ్‌తో సమానంగా కనిపిస్తుంది.
ఇక మిగిలిన పాత్రలన్నీ వారి వారి పరిధి మేరకే నటించాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌లో పనితనం కాజల్‌లో తీసేసిన సీన్స్ తెలిసిపోతున్నాయి. దర్శకుడిగా కొరటాల ఇప్పటివరుకు అపజయం ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. మిర్చి, జనతాగేరెజ్ సినిమాలలో కుటుంబ సంబంధాల ద్వారా ఫీల్‌ను కలుగజేశాడు. కానీ ఆచార్యలో ఊరు ప్రజలకోసం చేసిన ఫీల్ కనిపిస్తుంది. సెకండాఫ్‌లో సిద్ధ పాత్ర కనిపించకుండా పోయిన సన్నివేశం హృదయాన్ని టచ్ చేస్తుంది.
అయితే ఇన్ని వున్నా.. మెగాస్టార్ చిరంజీవిలో వయస్సురీత్యా వచ్చిన నటన కనిపిస్తుంది. అందుకే మొదటిభాగం స్లోగా అనిపిస్తుంది. మెగాస్టార్‌కు ఇటువంటి కథ ఇప్పటి ట్రెండ్‌కు తగినట్లుగా అనిపించదు. ఇక ముగింపులో వచ్చే సన్నివేశాలు ఆమధ్య బ్లాక్‌బస్టర్ అయిన సినిమాను తీసిపోని విధంగా వుంటుంది. ధర్మాన్ని కాపాడే కథతో చిరంజీవి చేస్తే ఇలా వుంటుందనేది దర్శకుడు చెప్పిన ప్రయత్నం. హిందూ ధర్మం కాపాడాల్సిన బాధ్యత అందరిపైనే వుందని చెబుతూ, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ అన్నలు వస్తారనే హింట్‌ను ఇచ్చాడు. నగ్జలైట్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా పాత కథలా అనిపిస్తుంది. యంగ్ ఏజ్‌లో చిరంజీవి కనిపించే సందర్భం గ్రాఫిక్‌లో బాగానే చూపించారు. మెగాఫాన్స్‌కు ఫిదా అయ్యే సన్నివేశాలు కొద్దిగానే వున్నాయి. మరి ఈ సినిమాను ప్రేక్షకులు ఏ రేంజ్ ఆదరిస్తారో చూడాల్సిందే.