Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 12 April 2025
webdunia

తరాలు మారినా ప్రేమ మారదు... ప్రేమికులే మారతారు.. 'బంగారి బాలరాజు' కథ (రివ్యూ)

Advertiesment
Bangari Balaraju Movie Review
, గురువారం, 25 అక్టోబరు 2018 (16:03 IST)
నటీనటులు : రాఘవ్‌, కరొణ్య కత్రీన్‌, మీనాకుమారి, దూకుడు శ్రవణ్‌, ఎన్‌.వి. చౌదరి, సారిక రామచంద్రరావు, కిరాక్‌ ఆర్‌.పి తదితరులు.
సినిమాటోగ్రఫర్‌ : జి.ఎల్‌. బాబు, 
సంగీతం : చిన్నికష్ణ, చిట్టిబాబు రెడ్డిపోగు, 
నిర్మాతలు : కె.ఎండి. రఫి, రెడ్డం రాఘవేంద్రరెడ్డి, 
కథనం, దర్శకత్వం : కోటేంద్ర దుద్యాల.
 
ఎనిమిదేళ్ళనాడు 'అనితా ఓ అనిత...' అనే ప్రైవేట్‌ గీతంతో పాపులర్‌ అయిన దర్శకుడు కోటేంద్ర. ఇప్పుడు దర్శకుడిగా మారి 'బంగారి బాలరాజు' అనే సినిమాకు దర్శకత్వం వహించారు. రాఘవ్‌ కథానాయకుడిగా నటించగా, బాలీవుడ్‌లో బాలనటిగా అమితాబ్‌లోపాటు పలువురితో నటించిన కరొణ్య కత్రీన్‌ హీరోయిన్‌గా నటించింది. నంది క్రియేషన్స్‌ పతాకం పై కె.యమ్‌.డి.రఫి, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి నిర్మించారు. గురువారమే విడుదలైన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ : 
బాలరాజు (రాఘవ్‌) తల్లి మీనా కుమారి ఓ ఊరిలో స్కూల్‌ టీచర్‌. కాలేజీ తదనంతరం సివిల్స్‌కి అక్కడే ఉండి ప్రిపేర్‌ అవుతుంటాడు బాలరాజు. హోలీనాడు సరదాగా స్నేహితులతో ఆడుకుంటుండగా బంగారి అనే అమ్మాయి బాలరాజును చూసి ముద్దుతో ప్రేమను వ్యక్తం చేస్తుంది. మొహానికి రంగు పూసుకోవడంతో ఆమె ఎవరో తెలీయక ఆమె కోసం కళ్ళు వెతుకుతుంటాయి. ఎట్టకేలకు ఆమె ఊరి పెత్తందారు జగ్గారెడ్డి ఏకైక కూతురని తెలుసుకునేసరికి ఆమెకు మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగిపోతుంది. ఆ తర్వాత తననే బాలరాజు ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న బంగారి ఏం చేసింది? వీరి ప్రేమ తెలుసుకున్న జగ్గారెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడు? అనేది మిగిలిన కథ.
 
విశ్లేషణ: 
కథపరంగా సింపుల్‌ కథ. ఈ చిత్రం తీశాక రాయలసీమలో పరువు హత్య పేరుతో ఓ జంట పాపులర్‌ అయింది. సరిగ్గా అటువంటి కథను దర్శకుడు కోటేంద్ర ముందుగానే తీసేశాడు. ఇది అతని స్నేహితుల్లో ఒకరికి జరిగిన కథగా చెప్పుకున్నాడు. పరువు హత్యలనేవి తరచుగా దేశంలో పలు చోట్ల జరుగుతూనే ఉన్నాయి. అందులో కర్నూలులో జరిగిన కథ కావడంతో కాస్త ఆసక్తినెలకొంది. తరాలు మారినా ప్రేమ మారదు. ప్రేమికులే మారతారనేది.. దర్శకుడు చెప్పదలచిన పాయింట్‌. దానికి ఇచ్చిన ముగింపు బాగుంది. నటీనటుల్ని కొత్తవారిని తీసుకోవడంతోపాటు వారికి శిక్షణాతరగతులు నిర్వహించి వారిచేత తగినంత నటన రాబట్టగలిగాడు. అలాగే సంగీతం, సాహిత్యం, నృత్యం వంటి విషయాల్లోనూ తనదైన ముద్రను దర్శకుడు కనబర్చాడు.
 
కథప్రకారం నూనూగు మీసాలవాడు కావాలని రాఘవ్‌ను ఎన్నుకున్నాడు. నటనకు కొత్త కాబట్టి ఉన్నంతలో అతనిలోని నటనను బయటకు తెప్పించాడు. డాన్స్‌, డైలాగ్‌ మాడ్యులేషన్‌తో సహా రాఘవ్‌ ఆకట్టుకున్నే ప్రయత్నం చేశాడు. దూకుడు శ్రవణ్‌ కేవలం కొన్ని సీన్స్‌లోనే కనిపించనప్పటికీ చాలా ముఖ్యమైన పాత్రను పోషించాడు. హీరోయిన్‌గా చేసిన కరొణ్య కత్రీన్‌ తన లుక్స్‌‌పరంగా, తన నటనపరంగా బాగా రాణించింది. కమెడియన్స్‌ కిరాక్‌ ఆర్‌.పి, జబర్దస్త్‌ బాబిలు తమ కామెడీ టైమింగ్‌తో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు. హీరోకి తల్లిగా నటించిన మీనా కుమారి ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె మెప్పించింది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించారు.
 
మంచి కాన్సెప్ట్‌ తీసుకున్న దర్శకుడు వెండితెరపై మరింత ఆసక్తికరంగా తీస్తే బాగుండేది. ఈ చిత్రం రెండో భాగం సాగతీత సన్నివేశాలతో పాటు రెండు పాటలు కథాగమనానికి బ్రేక్‌లా వున్నాయి. అలాగే ప్రేమతో పాటు హీరో తన లక్ష్యాన్ని కూడా ఎలా సాధించాడనే విషయాన్ని క్లారిటీగా చెబితే బాగుండేది. కొత్తవారితో దర్శకుడు చేసిన ప్రయత్నం ఫర్వాలేదు. పేరున్న వారు నటిస్తే ఈ చిత్రం మరింత పేరు తెచ్చేది. జి.ఎల్‌. బాబు కెమెరా పనితనం మాత్రం ఇంప్రెస్‌ అయ్యేలా ఉంది. ఆయన తీసిన విజువల్స్‌, కొన్ని షాట్స్‌ బాగున్నాయి. చిన్నికష్ణ, చిట్టిబాబు రెడ్డిపోగు అందించిన సంగీతం ఫర్వాలేదనిపిస్తోంది. నిర్మాతలు కె.ఎండి. రఫి, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి చిత్రం పై బాగానే ఖర్చు పెట్టారు గానీ, స్క్రిప్ట్‌ విషయంలో ఇంకాస్త శ్రద్ద వహించాల్సింది. ఇటీవల వస్తున్న రక్తపాతాల కథకన్నా ఫర్వాలేదనిపించేలా వున్న చిత్రమిది. ఏ మేరకు ప్రేక్షకులు ఆదరిస్తారో చూడాల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అవును.. ఆ దర్శకుడు తాకరాని చోట తాకుతాడు.. అమలా పాల్