జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం "అరవింద సమేత వీరరాఘవ". ఈ చిత్రానికి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ చిత్రం షూటింగ్ పూర్తయి ఈనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే, ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఎదురైన అనుభవాలను దర్శకుడు త్రివిక్రమ్ వెల్లడించారు. 'అరవింద సమేత వీరరాఘవ' కోసం ఎన్టీఆర్‌తో పనిచేయడానికి చాలా ఇబ్బంది పడినట్టు చెప్పారు.
'ఉదయం ఏడు గంటలకు కాల్షీట్ అంటే.. సెట్‌లో ఆరున్నర గంటలకే ఉండేవారు. దాంతో మేం అరగంట ముందే సెట్‌కి రావాల్సి వచ్చేది. ప్రతిరోజూ మాకు అదొక టార్చర్‌లా ఉండేది. ఉదయం 5 గంటల నుంచి అర్థరాత్రి వరకూ అంత ఎనర్జీగా ఎలా ఉంటాడన్నది ఇప్పటికీ అర్థంకాదు. తారక్ ఎనర్జీని ఆపే యాంటీబయాటిక్ లేదనిపిస్తుంది. అదొక వైరస్. ఒక రోజులో చెయ్యాలనుకున్న సీన్ మధ్యాహ్నానికే పూర్తయ్యేది. 100 రోజులు షూటింగ్ అనుకుంటే 70 రోజుల్లోనే పూర్తయింది. హీరోలు క్రమశిక్షణగా ఉంటే అన్నీ సక్రమంగా జరుగుతాయి' అని త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు.
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'అరవింద సమేత వీరరాఘవ' చిత్ర ప్రత్యేక షోలకు ఏపీ సర్కారు అనుమతి ఇచ్చింది. ఈ నెల 11 నుంచి 18 వరకూ ఉదయం 5 గంటల నుంచి 11 గంటల మధ్యలో ప్రత్యేక షో (అదనపు ఆట)లు వేసుకునేందుకు థియేటర్, మల్టీప్లెక్సులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.