Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

త్రివిక్ర‌మ్‌ బలమైన వినోదం కొరవడిన చిత్రమే 'అర‌వింద స‌మేత‌'

త్రివిక్ర‌మ్‌ బలమైన వినోదం కొరవడిన చిత్రమే 'అర‌వింద స‌మేత‌'
, గురువారం, 11 అక్టోబరు 2018 (12:58 IST)
బ్యాన‌ర్‌: హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌
మూవీ : అరవింద సమేత వీర రాఘవ 
న‌టీన‌టులు: ఎన్టీఆర్‌, పూజాహెగ్డే, జ‌గ‌ప‌తిబాబు, సునీల్‌, నాగ‌బాబు, ఈషారెబ్బ‌, సుప్రియ పాత‌క్‌, రావు ర‌మేష్ త‌దిత‌రులు
సంగీతం: త‌మ‌న్‌
నిర్మాత‌: ఎస్‌.రాధాకృష్ణ‌(చిన‌బాబు)
ద‌ర్శ‌క‌త్వం: త్రివిక్ర‌మ్
విడుద‌ల తేదీ: 11-10-2018
 
పుష్కరకాలం తర్వాత ఎన్టీఆర్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం అరవింద సమేత వీర రాఘవ. వీరిద్దరి కాంబినేష‌న్‌లో వ‌చ్చే సినిమా చూడాల‌న్న స‌గ‌టు అభిమాని క‌ల 12 యేళ్లకు నెరవేరింది. మ‌రి ఈ క్రేజీ కాంబినేష‌న్ వెండితెర‌పై ఎలా ఉంది? ఫ్యాక్ష‌న్ సినిమాల హ‌వా త‌గ్గిన నేప‌థ్యంలో ఆ జాన‌ర్‌లో వ‌చ్చిన ఈ చిత్రం ఏ మేర‌కు అల‌రించింది? త్రివిక్ర‌మ్ మాట‌ల ప‌దును ఎలా ఉంది? వీర రాఘ‌వుడిగా ఎన్టీఆర్ మ‌రోసారి న‌ట విశ్వ‌రూపం చూపించారా? అనేదాన్ని విశ్లేషిద్ధాం.
 
కథ : 
తన తండ్రి (నాగబాబు)ను వీర రాఘవ (ఎన్టీఆర్‌) ఫ్యాక్ష‌న్ గొడ‌వ‌ల్లో కోల్పోతాడు. నాయ‌న‌మ్మ‌(సుప్రియ పాత‌క్‌) మాట‌లకు ప్ర‌భావిత‌మై హింస‌కు, ర‌క్తపాతానికి దూరంగా ఉండాల‌ని సొంతూరు విడిచి హైదరాబాద్ నగరానికి వెళ్లిపోతాడు. అక్క‌డ అర‌వింద (పూజాహెగ్డే) ప‌రిచ‌యం అవుతుంది. అర‌వింద కూడా త‌న నాయ‌న‌మ్మ చెప్పిన‌ట్లు 'హింస వ‌ద్దు.. ర‌క్త‌పాతం వ‌ద్దు' అని చెబుతుంటుంది. ఈ పరిస్థితుల్లో అర‌వింద‌పై దాడి జరుగుతుంది. ఆ ప్ర‌మాదం నుంచి అర‌వింద‌ను ర‌క్షిస్తాడు వీర రాఘ‌వ‌. అప్ప‌టి నుంచి అర‌వింద‌కు సంర‌క్ష‌కుడిగా మార‌తాడు. అనుకోని ప‌రిస్థితుల్లో అర‌వింద ఇంటికి వెళ్లిన వీర రాఘ‌వకు అక్క‌డ ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌య్యాయి? ఆమె నేప‌థ్యం ఏంటి? నాయ‌న‌మ్మ చెప్పిన‌ మాట‌ను నిలబెట్టుకుంటూ హింస‌ను, ఫ్యాక్ష‌నిజాన్ని వీర రాఘ‌వ ఎలా అడ్డుకున్నాడు? అన్నదే ఈ చిత్ర కథ. 
 
విశ్లేషణ : 
'తనదైన రోజున ఎవ‌డైనా కొట్ట‌గ‌ల‌డు. అస‌లు గొడ‌వ రాకుండా ఆపుతాడు చూడు.. వాడు గొప్పోడు' అన్న పాయింట్‌తో త్రివిక్ర‌మ్ శైలిలో రాసుకున్న కథే ఈ చిత్రం. గ‌తంలో ఫ్యాక్ష‌న్ నేప‌థ్యంలో చాలా సినిమాలు వ‌చ్చాయి. వాట‌న్నింటికీ భిన్నంగా త్రివిక్ర‌మ్ ఎలా తీస్తాడా? అని అభిమానులు ఎదురుచూశారు. అందుకు త‌గిన‌ట్లుగానే త్రివిక్ర‌మ్ కొత్త అంశాన్ని ఎంచుకుని వెండితెరపై ఆవిష్కరించారు. 'అద‌ర్‌సైడ్ ఆఫ్ ఫ్యాక్ష‌నిజం' అన్న‌ట్లు వేరే కోణం చూపించారు. క‌త్తి ప‌ట్టుకుని బ‌య‌లుదేరిన భ‌ర్త గురించి అత‌ని భార్య, తండ్రి గురించి పిల్ల‌లు ఎంత త‌ల్ల‌డిల్లిపోతారో వాళ్ల కోణంలో చూపించారు. 
 
ఈ చిత్రం 20 నిమిషాల క‌థ చాలా ప‌క‌డ్బంధీగా సాగుతుంది. ఎమోష‌న‌ల్‌గా బాగా డ్రైవ్ చేశాడు. ఈ సినిమాలో ఎమోష‌న్ కంటెంట్ ఉంటుంద‌ని ఒక ర‌కంగా ప్రేక్ష‌కుడిని ముందే సిద్ధం చేశాడు. అయితే, కథ హైద‌రాబాద్ చేరిన త‌ర్వాత పట్టు తప్పుతుంది. హీరో, హీరోయిన్‌, సునీల్ వీరి మ‌ధ్య స‌న్నివేశాల‌తో అక్క‌డ‌క్క‌డా త్రివిక్ర‌మ్ త‌న మార్కుని చూపిస్తూ క‌థ‌ను సాఫీగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు.
webdunia
 
ఇక ఈ సినిమా రెండో భాగంలో త్రివిక్ర‌మ్‌లోని అస‌లు కోణం బ‌య‌ట ప‌డుతుంది. ఈ క‌థ ద్వారా త‌ను ఏం చెప్ప‌ద‌లుచుకున్నాడో బ‌లంగా, కొన్ని పాత్ర‌ల ద్వారా చెప్పించ‌గ‌లిగాడు. ద్వితీయార్థంలో బాలిరెడ్డి(జ‌గ‌ప‌తిబాబు) పాత్ర కీల‌కం అవుతుంది. ఆ పాత్ర‌ను తీర్చిదిద్దిన విధానం, ఆ పాత్ర‌తో ముడిపడిన స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతాయి. ప్రీ క్లైమాక్స్ కాస్త‌ సాగ‌దీసిన‌ట్లు అనిపించినా, క్లైమాక్స్‌లో మ‌ళ్లీ క‌థ‌ను ఫామ్‌లోకి దర్శకుడు తీసుకొచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ చిత్రానికి క్లైమాక్సే ప్రాణం. 
 
ఇకపోతే, మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌ ప్ర‌ధాన బ‌లం వినోదం. ఆయ‌న గ‌త చిత్రం ఏది తీసుకున్నా వినోదానికి పుష్క‌ల‌మైన స్థానం ఉంటుంది. అయితే, ఈ సినిమాలో ఏదైనా కొర‌వడిందంటే అది వినోద‌మనే చెప్పాలి. త్రివిక్ర‌మ్ శైలి, ప్రాస‌లు, పంచ్‌ల‌కు ఎక్క‌డా చోటులేదు. హీరోయిజం ఎలివేష‌న్, మాస్ డైలాగ్‌లు వీటిని దృష్టిలోకి పెట్టుకుని థియేట‌ర్‌కు వెళ్తే కాస్త ఇబ్బంది ప‌డ‌తారు. 
 
ఎన్టీఆర్ బ‌లాల‌ను చూపిస్తూనే డైలాగుల్లో త‌న‌దైన మార్కు సృష్టించే ప్ర‌య‌త్నం చేశాడు. కొన్ని స‌న్నివేశాల‌కు క్లాప్స్ ప‌డ‌తాయి. కొన్ని సుదీర్ఘంగా సాగుతాయి. మొత్తంగా 'అజ్ఞాత‌వాసి' ఫ్లాప్ త‌ర్వాత ప‌క‌డ్బంధీగా రాసుకున్న స్క్రిప్ట్ ఇది.
 
పాత్రల తీరుతెన్నులు: 
ఈ చిత్ర కథ‌కు, ద‌ర్శ‌కుడు రాసుకున్న వీర‌రాఘ‌వ ప్రాత‌కు ఎన్టీఆర్ 100కి నూరుపాళ్లు న్యాయం చేశాడు. ఇన్ని ఎమోష‌న‌ల్ సీన్స్ ఎన్టీఆర్ ఎప్పుడూ చేయ‌లేదు. తొలి 20 నిమిషాలు పూర్తిగా ఎన్టీఆరే క‌నిపిస్తాడు. ఈ మ‌ధ్య కాలంలో ఆయ‌న‌ చేసిన పాత్ర‌ల‌కు ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. పూజా హెగ్డే పాత్ర కూడా క‌థ‌లో కీల‌క‌మే. ఒక ర‌కంగా క‌థానాయ‌కుడి పాత్ర‌లో మార్పు రావ‌డానికి బ‌లంగా దోహ‌దం చేసింది. వెండితెర‌పై క‌నిపించే ప్ర‌తి చిన్న పాత్ర‌నూ చాలా బ‌లంగా తీర్చిదిద్దాడు ద‌ర్శ‌కుడు. అందుకే ఏ పాత్ర‌నూ ప్రేక్ష‌కుడు అంత త‌ర్వ‌గా మ‌ర్చిపోలేడు.
 
ఇకపోతే, ఈ చిత్రంలో ప్రధాన విలన్‌ బాలిరెడ్డిగా కనిపించే జగపతిబాబు పాత్రను అత్యంత క్రూరంగా చూపించాడు. ఆయ‌న కూడా ఎక్క‌డా బోర్‌ కొట్ట‌కుండా న‌టించాడు. ఈ సినిమాతో ఆయ‌న‌కు మ‌రో మంచి పాత్ర దొరికింది. నీలాంబ‌రిగా సునీల్ ఆక‌ట్టుకుంటాడు. ప్ర‌తి పాత్రా క‌థ‌ను ముందుకు న‌డిపించేందుకు దోహ‌ద‌ప‌డేదే. ఎస్ఎస్.థమ‌న్ అందించిన సంగీత బాణీలు విన సొంపుగా ఉన్నాయి. నేప‌థ్య సంగీతానికి చాలా ప్రాధాన్యం ఉంది.
webdunia
 
టెక్నికల్ పరంగా ఈ చిత్రం ఉన్న‌త స్థాయిలో ఉంది. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ సినిమాకు అద‌న‌పు బ‌లం. ఎన్టీఆర్‌ను చూపించిన తీరు, యాక్ష‌న్ స‌న్నివేశాలు తెర‌కెక్కించిన విధానం ఆక‌ట్టుకుంటాయి. సినిమా నిడివి కాస్త ఎక్కువ‌గా అనిపిస్తుంది. త్రివిక్ర‌మ్ త‌న శైలికి భిన్న‌మైన క‌థ‌ను ఎంచుకుని, దానికి త‌న‌దైన భావోద్వేగాల‌తో కూడిన మాట‌ల‌ను అందించ‌డం ఈ చిత్రానికి మ‌రో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌.
 
ఈ చిత్ర అన్ని విధాలుగా ఆకట్టుకుంది. అయితే, త్రివిక్రమ్ మార్క్ వినోదం లేకపోవడం ప్రధాన బలహీనతగా చెప్పుకోవచ్చు. అలాగే, ఎన్టీఆర్ నటన, త్రివిక్రమ్ సంభాషణలు, గుండెను హత్తుకునే సన్నివేశాలు ఈ చిత్రానికి హైలెట్‌గా ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పిరుదు నొక్కిన దర్శకుడు.. చెంప పగులగొట్టిన సినీ నటి... (Video)