Pradeep Machiraju, Amruth Ayyair
నటీనటులు: ప్రదీప్ మాచిరాజు-అమృత అయ్యర్-పోసాని కృష్ణమురళి-శరణ్య ప్రదీప్-హేమ-శుభలేఖ సుధాకర్-జబర్దస్త్ మహేష్-వైవా హర్ష-భద్రం తదితరులు.
ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర, సంగీతం: అనూప్ రూబెన్స్, పాటలుః చంద్రబోస్, అనంతశ్రీరామ్, నిర్మాత: ఎస్వీ బాబు, రచన-దర్శకత్వం: ఫణి ప్రదీప్ (మున్నా).
యాంకర్ ప్రదీప్ మాచిరాజు వెండితెరపై `30రోజుల్లో ప్రేమించడం ఎలా!` అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందుకు చాలా కాలంగా తెగ ప్రచారం జరిగింది. నీలి నీలి ఆకాశం` పాట వారికి ధైర్యాన్ని ఇచ్చింది. ఆ తర్వాత కథ కొత్తదికాదనీ, ఎక్కడో చోట కనెక్ట్ అవుతాయనీ, మగధీర అని కొందరు అనుకున్నా తప్పులేదనీ, ఒకే కథ రాఘవేంద్రరావు ఒకలా చెబితే, సుకుమార్ మరోలా చెబుతాడంటూ ఈ సినిమా దర్శకుడు మున్నా రిలీజ్‌కుముందు వ్యక్తం చేశాడు. సినిమా నేడే విడుదలైంది. మరి అదెలా వుందో చూద్దాం.
కథ:
శుభలేఖ సుధాకర్ కొండలు కోనల్లలో తపస్సు చేసుకునే స్వామీజీ. అతినికి ఓ శిష్యుడుంటాడు. అతనికి ప్రేమ అంటే ఏమిటి? దానికోసం చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని సందేహంతో గురువుగారిని అడుగుతాడు. లోకంలో ప్రేమ అనేది కలుషితమై పోయింది.
అసలైన ప్రేమికులు కొన్నాళ్ళ క్రితం ఇక్కడే వున్నారంటూ, స్వాతంత్రానికి పూర్వం ఓ అమ్మాయిగారు, అబ్బాయిగారు అని పిలుచుకునే ప్రేమికుల కథ చెబుతాడు గురువు. అప్పట్లో ప్రేమ పొందలేక ఈ జన్మలో మళ్ళీ పుట్టారు. వారిని చూడాలంటే కాలమే వారిని ఇక్కడకి తీసుకువస్తందంటూ గురువు శిష్యుడికి సెలవిస్తాడు. కట్ చేస్తే, సిటీలో ఓ కాలేజీలో అర్జున్ (ప్రదీప్ మాచిరాజు), అక్షర (అమృత అయ్యర్) చదువుతుంటారు. వీరి ఇళ్ళు కూడా పక్కపక్కనే. కానీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. అలాంటి వీరిని కాలం ఎలా ఒకటి చేసింది? అనేది చూడాలంటే తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ:
ఈ కథను చూస్తే, తెలుగులో ఏడేళ్ళనాడు కొత్తవారితో ఇంగ్లీషు అక్షరాలతో వచ్చిన కథ గుర్తుకు వస్తుంది. అందులో ప్రేమికులు ఒకరంటే ఒకరికి పడదు. కానీ ఓ సంఘటనతో వారు వీరుగా వీరువారుగా మారిపోతారు. చివరికి ఎలా వారి దేహాలు వారికి ఎలా వచ్చాయనేది పాయింట్. అందులో ఇరువురూ బాగా నటించారు. అప్పట్లో ఈ కాన్సెప్ట్ కొత్తది, చేసింది కొత్తవారు కాబట్టి పెద్దగా ఆడలేదు. అలాగే హాలీవుడ్‌లోనూ ఇట్స్ ఎ బాయ్ గర్ల్ థింగ్ అనేది కూడా ఇంచుమించు ఇలాంటిదే. ఇప్పుడు`30రోజుల్లో ప్రేమించడం ఎలా!` అనేది కూడా అలాంటిదే.
ఇందులో అతడు ఆమెగా ఆమె అతడుగా నటించలేకపోయారనే చెప్పాలి. దానికితోడు సినిమా ఆరంభంలోనే ఫ్లాష్‌బేక్ ఎపిసోడ్‌లో అమ్మాయిగారు అబ్బాయిగారు ప్రేమించుకున్నన్పుడే `నీలినీలి ఆకాశం..` అనే పాట రావడంతో కిక్ పోయింది. ఎందుకంటే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా గురించి ప్రేక్షకులకు తెలియడానికి దీని గురించి చర్చ జరగడానికి కారణం, నీలి నీలి ఆకాశం పాటనే. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట ఎంత పాపులరైందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు.
ఈ పాటంత బాగా ఉంటుందీ సినిమా అంటూ చిత్ర బృందం ప్రచారం చేసుకుంది. సినిమా ఆరంభంలోనే ఆ పాట రావడంతో కిక్ పోయింది. ఆ ఎపిసోడ్ ప్లాష్‌బేక్ కాబట్టి బ్రిటీష్ వారితో బాక్సింగ్ చేసే సన్నివేశాలు అమ్మాయిగారితో ప్రేమ అనేవి కల్మషం లేకుండా వుండే పాత్రల తీరు ఆకట్టుకుంది. మొదటిభాగం సరదాగా సాగుతుంది. 300 మిలియన్ వ్యూస్ సంపాదించిన ఈ పాటను విజువల్‌గానూ బాగానే తీశారు.
ఇక కాలేజీ డేస్‌లో జరుగుతున్న అర్జున్, అక్షరలు టామ్‌జెర్రీలా వుంటారు. అర్జున్‌కు బాక్సింగ్ అంటే ఇష్టం. చదువునుకూడా లెక్కచేయడు. అక్షర కాలేజీ టాపర్. ఆమెకు తల్లిలేదు. తండ్రి వున్నా పట్టించుకోడు. అక్క చెప్పాపెట్టకుండా పెళ్లిచేసుకుందని తండ్రి పోసాని ఆమెను ఇంటికి రానీడు. ఇద్దరి ఇంటిలో ఇలాంటి సమస్యలుంటే అర్జున్‌కు నలుగురు స్నేహితులు. వారితోనే సరదాగా గడుపుతుంటాడు. ఇదంతా అన్ని సినిమాల్లో మామూలుగా వున్నా ఇందులో కాస్త కొత్తదనంగా ప్రయత్నించాడు దర్శకుడు.
ద్వితీయార్ధం చక్కగా నడపలేకపోయాడు దర్శకుడు. కేవలం అమ్మా, నాన్నల సెంటిమెంట్‌ను పండించి వారిని మార్చేసే రెండు సన్నివేశాలతో సరిపెట్టాడు. అమ్మతనం గురించి వచ్చే పాట బాగుంది. మధ్యలో కథ నడిచే తీరుతో ఆ విషయం ముందే ప్రేక్షకులకు అర్థమైపోతుంది. అయితే మొత్తంగా ఈ సినిమాను ప్రేక్షకుడు ఓన్ చేసుకోవడానికి సమయం పడుతుంది. ఈలోగా సినిమా పూర్తవుతుంది. ఎందుకంటే 30రోజుల్లో ప్రేమించడం ఎలా! అని చెప్పి, దానిని మరో 30రోజులు పొడిగిస్తాడు. అలా ఈ సినిమా 60రోజుల్లోప్రేమించడం ఎలా! అనేది పెడితేబాగుండేది.
నటీనటులు:
యాంకర్ నుంచి నటుడిగా మారిన ప్రదీప్ కథపరంగా బాగానే నటించాడని చెప్పాలి. ఒక్క అమ్మాయిగా ప్రవర్తించడం మినహా. సేమ్ అదే తరహాలో హీరోయిన్ కూడా. అర్జున్ తల్లిదండ్రులుగా శివన్నారాయణ, హేమ చక్కగా అమరారు. అక్షర తండ్రిగా పోసాని ఈజీగా చేసేశాడు. శుభలేఖ సుధాకర్ కథను మలుపు తిప్పే పాత్ర చేశాడు. ఆయన పాత్ర నటన కృత్రిమంగా అనిపిస్తాయి. వైవా హర్ష.. భ్రదమ్ స్తాయిమేరకు నటించారు.
సాంకేతిక వర్గం:
సంగీతపరంగా అనూప్ రూబెన్స్ చిత్రానికి హైలైట్. నేపథ్య సంగీతం కూడా ఓకే. దాశరథి శివేంద్ర ఛాయాగ్రహణం ఫ్లాష్ బ్యాక్ నడిచే తొలి పావు గంటలో ఆకట్టుకుంటుంది. ఎందుకు పెట్టాడో కానీ శిష్యుడి పాత్ర మహేష్ చేత `బాహుబలి రాజమౌళినే తీయాలి. ఆయన శిష్యుడు తీయకూడదు` అని హీరో హీరోయిన్లు తమ రూపాలు వచ్చేలా చేయాలని అతడ్ని అడిగినప్పుడు చెబుతాడు. ఈ డైలాగ్ సినిమాకు బాగా కనెక్ట్ అవుతుంది. ఓ చక్కని పాట, సంగీతం, నటీనటులు, నిర్మాత అన్ని హంగులున్నప్పుడు అమ్మాయి అబ్బాయిగా మారితే! అనే కాన్సెఫ్ట్‌ను కాకుండా ఇద్దరినీ వారి వారి శరీరాలతో అలానే వుంచి కాలాన్ని బట్టి పరిస్థితులు మారేలా కథను రాసుకుంటే మగధీర అంత డెప్త్ వుండేది.
కొసమెరుపు ఏమంటే, సినిమా ఆరంభంలో గురువు శిష్యుడికి చెప్పే డైలాగ్ చిత్రంగా అనిపిస్తుంది. కామం, ప్రేమ గురించి చెబుతూ, `దీపికా పడుకొనే`ను నువ్వు కోరుకుంటే అది కామం, ఆమె నిన్ను కోరుకుంటే ప్రేమ అని వెల్లడిస్తాడు. అయినా అర్థం కాలేదంటాడు శిష్యుడు. సినిమా కూడా అంతే.