పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండో మాజీ భార్య, సినీ నటి రేణూ దేశాయ్ మరోమారు వార్తల్లో నిలిచారు. తాను ఇష్టపడి దిగుమతి చేసుకున్న రెండు లగ్జరీ కార్లను విక్రయించారు. ఆర్థిక కష్టాల్లో చిక్కుకోవడం వల్ల ఈ కార్లను విక్రయించలేదని స్పష్టం చేశారు. పైగా, వీటి స్థానంలో ఈ-ఎలక్ట్రిక హ్యూండాయ్ కారును కొనుగోలు చేశారు. అయితే, ఆమె తన రెండు లగ్జర్ కార్లను విక్రయించడానికి కారణానలను కూడా ఆమె వివరించారు.
నిజానికి పవన్ కళ్యాణ్‌కు దూరమైన తర్వాత రేణూ దేశాయ్ ఒక వైపు కుటుంబం, మరోవైపు సినిమాలకు చెందిన పనులను చూసుకుంటూనే సామాజిక బాధ్యతలపై కూడా దృష్టి సారిస్తున్నారు. తాజాగా ఆమె చేసిన ఒక పని అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో తాను భాగస్వాములైంది. ఇందులోభాగంగా తన రెండు లగ్జరీ కార్లను అమ్మేసినట్టు రేణు తెలిపింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఆమె ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు.
పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని రేణు విన్నవించారు. అందరూ ఎలక్ట్రిక్ కార్లు, బైకులుకొనే పనిలో పడాలని చెప్పారు. వాయు కాలుష్యానికి కారణమయ్యే వాటికి ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని అన్నారు. ఇంధనంతో నడిచే ఆడీ ఏ6, పోర్షే బాక్సర్ కార్లను తాను అమ్మేశానని తెలిపారు.
ఈ-ఎలక్ట్రిక్ హ్యుండాయ్ కారును కొనుక్కున్నానని చెప్పారు. మారిషస్‌లో జరిగిన చమురు లీకేజీ గురించి చదివిన తర్వాత ఈ నిర్ణయాన్ని తీసుకున్నానని తెలిపారు. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలతో భూమిపై నివసించే జీవరాశులకు క్యాన్సర్ అందిస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.