ఎంత ఎత్తుకు ఎదిగినా టెన్త్ క్లాస్ రోజులను ఎవరూ మర్చిపోలేరు. కనుకనే టెన్త్ క్లాస్ చదివిన మిత్రుల జ్ఞాపకాల నేపథ్యంలో టెన్త్ క్లాస్ డైరీస్ చిత్రం రూపొందుతోంది. ఛాయాగ్రాహకుడయిన `గరుడవేగ' అంజి దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ఇది. అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్ పతాకాలపై అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. ఇందులో శ్రీనివాసరెడ్డి, 'వెన్నెల' రామారావు, అర్చన (వేద), హిమజ, శివబాలాజీ, మధుమిత, 'సత్యం' రాజేష్, భాను శ్రీ, నాజర్, శివాజీరాజా ఇతర ప్రధాన తారాగణం.
'టెన్త్ క్లాస్ డైరీస్' ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ దర్శకులు క్రిష్ జాగర్లమూడి ఈ రోజు విడుదల చేశారు. ముఖ్య తారాగణం అందరికీ ఇంపార్టెన్స్ ఇచ్చిన ఈ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. త్వరలో టీజర్, డిసెంబర్‌లో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
నిర్మాతలు అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం మాట్లాడుతూ, ఇటీవలే టైటిల్ వెల్లడించాం. చాలామంది ఫోన్లు చేసి 'టెన్త్ క్లాస్ డైరీస్' అనగానే ఒక్కసారి మా టెన్త్ క్లాస్ రోజులు గుర్తు చేసుకున్నామన్నారు. ప్రేక్షకులందరినీ నోస్టాల్జియాలోకి తీసుకువెళ్లే చిత్రమిది. ఈ సినిమా విడుదలైన తర్వాత అవికా గోర్ అంటే 'టెన్త్ క్లాస్ డైరీస్' గుర్తుకు వస్తుంది. అంతలా పాత్రలో లీనమై అవికా గోర్ నటించారు. కీలక పాత్రలో శ్రీరామ్ సైతం ప్రేక్షకులకు గుర్తుండే పాత్రలో కనిపిస్తారు. కథ ప్రకారం హైదరాబాద్, చిక్ మంగళూరు, రాజమండ్రి, అమెరికాలో షూటింగ్ చేశాం. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. టైటిల్, ఫస్ట్‌లుక్‌కు లభిస్తున్న స్పందన మాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. త్వరగా డబ్బింగ్, మిగతా పనులు పూర్తి చేసి డిసెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నాం" అని అన్నారు.
అంజి మాట్లాడుతూ, "కమర్షియల్ హంగులతో పాటు కొత్తదనం ఉన్న సినిమా 'టెన్త్ క్లాస్ డైరీస్'. ప్రతి ఒక్కరి జీవితంలో టెన్త్ క్లాస్ అనేది ఒక టర్నింగ్ పాయింట్. స్నేహం, ఆకర్షణ, ప్రేమ, జీవిత లక్ష్యాలు, ఎన్నెన్నో కలలు అన్నిటికీ పునాది టెన్త్ క్లాస్‌లో పడుతుంది. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా టెన్త్ క్లాస్ రోజులను ఎవరూ మర్చిపోలేరు. ప్రతి ఒక్కరికీ టెన్త్ క్లాస్ రోజులను గుర్తు చేసే విధంగా స్నేహం, ప్రేమ, ఆకర్షణ, ఆకాంక్షలను స్పృశిస్తూ తీసిన చిత్రమిది. ప్రేక్షకుల హృదయానికి హత్తుకునే విధంగా సినిమా ఉంటుంది. మా నిర్మాతలు, టెక్నికల్ టీమ్ సహకారంతో అనుకున్న విధంగా సినిమా వచ్చింది. అందరికీ నచ్చుతుంది" అని అన్నారు.