తాను ఓ లెస్బియన్, డ్రగ్గిస్ట్ అంటూ బాలీవుడ్ నటి రాఖీ సావంత్ చేసిన ఆరోపణలపై బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా స్పందించింది. తాను స్వలింగ సంపర్కురాలికానేకాదనీ, అదేసమయంలో మాదకద్రవ్యాలు సేవించనని స్పష్టం చేసింది.
'మీటూ' ఉద్యమంలో భాగంగా, సీనియర్ నటుడు నానా పటేకర్‌పై తనుశ్రీ దత్తా లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. ఇవి బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అదేసమయంలో తనుశ్రీ దత్తాపై మరో హీరోయిన్ రాఖీ సావంత్ తీవ్ర విమర్శలు చేసింది. ఈ విమర్శలకు తాజాగా తనుశ్రీ సమాధానం చెప్పింది.
'తనుశ్రీ స్వలింగ సంపర్కురాలు. 12 ఏళ్ల క్రితం ఆమె నాపై అత్యాచారానికి పాల్పడింది. ఆమె మాదక ద్రవ్యాలు సేవిస్తుంది. డ్రగ్స్ తీసుకోమని నన్ను కూడా బలవంతపెట్టింది' అంటూ తనుశ్రీపై రాఖీ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ ఆరోపణలకు తనుశ్రీ సమాధానం ఇచ్చింది. 'అసత్య ప్రచారాలతో ఎలాంటి ఉపయోగమూ ఉండదు. నేను మాదక ద్రవ్యాలు సేవించను. మద్యం కూడా తీసుకోను. అలాగే నేను స్వలింగ సంపర్కురాలిని కాదు. పితృస్వామ్య వ్యవస్థ భావజాలాన్ని, పురుషాహంకారాన్ని భరిస్తున్న ఓ మహిళను. సమాజంలో మార్పును తీసుకురాగల శక్తి ఉన్న ఉద్యమాన్ని ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలతో పలుచన చేయకూడదు' అని వ్యాఖ్యానించింది.