టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునపై తాను గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ సోషల్ మీడియాలో వివరణ విడుదల చేశారు. తన వ్యాఖ్యలు నాగార్జున గారిని లేదా ఆయన కుటుంబ సభ్యులను కించపరచడానికి ఉద్దేశించలేదని ఆమె పేర్కొన్నారు. నాగార్జున గారికి సంబంధించి నేను చేసిన ప్రకటనను ఉపసంహరించుకుంటున్నాను. నాగార్జున గారిని లేదా ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టడానికి అలాంటి వ్యాఖ్యలు చేయలేదని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. నా వ్యాఖ్యలు నాగార్జున కుటుంబ సభ్యులను బాధపెట్టి వుంటే.. అందుకు చింతిస్తున్నాను.. అంటూ కొండా సురేఖ సోషల్ మీడియా ద్వారా కామెంట్లు చేశారు.
కొంతకాలం క్రితం బీఆర్ఎస్ నేత కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో కొండా సురేఖ... అక్కినేని నాగార్జున కుటుంబంపై, ముఖ్యంగా నాగచైతన్య, సమంత విడాకుల అంశంపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. కొండా సురేఖ వ్యాఖ్యలపై నటుడు నాగార్జున తీవ్రంగా స్పందించారు. ఆమెపై పరువు నష్టం దావా కూడా వేశారు. మరోవైపు నాగచైతన్య, సమంత సైతం తమ విడాకులు పరస్పర అంగీకారంతో తీసుకున్న వ్యక్తిగత నిర్ణయమని, తమ పేర్లను అనవసరంగా రాజకీయ వివాదాల్లోకి లాగవద్దని విజ్ఞప్తి చేశారు.ఈ పరిణామాల నేపథ్యంలోనే మంత్రి కొండా సురేఖ వెనక్కి తగ్గి క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది.