'మహర్షి' చిత్రం హిట్ కావడం మహేష్‍కు బ్యాడ్ న్యూస్ అంటున్న నిర్మాత.. ఎందుకు?

గురువారం, 9 మే 2019 (17:20 IST)
ప్రిన్స్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం "మహర్షి". ఈ చిత్రం మే 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రాన్ని ముగ్గురు నిర్మాతలు కలిసి నిర్మించగా, వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే హీరోయిన్. ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతల్లో పీవీపీ అధినేత వరప్రసాద్ ఒకరు. ఈయన విజయవాడలోని తన సొంత మాల్‍లో 'మహర్షి' చిత్రాన్ని ప్రేక్షకులతో కలిసి వీక్షించారు. 
 
ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, 'మహర్షి' చిత్రం సూపర్‌హిట్ కావడం మహేష్‌కు బ్యాడ్ అని చెప్పారు. ఇదే విషయాన్ని మహేష్‌కు కూడా తాను చెప్పినట్టు తెలిపారు. నిజానికి ఈ చిత్రాన్ని తాను వారం రోజుల క్రితమే చూశానని, అప్పుడు మహేశ్ బాబుకు ఫోన్ చేసి మీకు బ్యాడ్ న్యూస్ అనగానే ఎంతో కంగారుపడిపోయారని గుర్తుచేశారు.
 
బ్యాడ్ న్యూస్ అంటున్నారేంటి? అంటూ మహేశ్ బాబు ఒకింత ఆందోళనగానే అడిగారని, అందుకు తాను బదులిస్తూ, ఈ సినిమాను మించిన హిట్ మీరు ఎప్పటికీ కొట్టలేరు, అదే మీకు బ్యాడ్ న్యూస్ అని చెప్పానని పీవీపీ వివరించారు. మీ కెరీర్‌లో తిరుగులేని బ్లాక్ బస్టర్, ఇది గుడ్‌న్యూస్ అనేసరికి ఆయన రిలీఫ్‌గా ఫీలయ్యారని పీవీపీ చెప్పారు.
 
కాగా, ఈ సినిమా స్టోరీలైన్‌ను మూడేళ్ల కిందటే దర్శకుడు వంశీ పైడిపల్లితో మహేశ్ బాబుకు చెప్పించానని, కథ నచ్చడంతో తనతోపాటు దిల్ రాజు, అశ్వనీదత్ కూడా ప్రొడ్యూసర్లుగా చేయి కలిపారని, మహేశ్ బాబు కెరీర్‌లో ఇంతకంటే ముచ్చటైన చిత్రం మరొకటి ఉండదని వరప్రసాద్ చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం సందేశాత్మకంగా "మహర్షి" (మూవీ రివ్యూ)