జనసేన ఓడిపోయినా ప్రజా సేవ చేస్తాం.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు

గురువారం, 2 మే 2019 (13:47 IST)
ఎన్నికల ఫలితాలకు ఇక 22 రోజుల మాత్రమే సమయముంది. ప్రతి ఒక్కరు ఫలితాలపై ఆసక్తిని చూపుతున్నారు. ఎపిలోనే కాదు తెలంగాణాలో కూడా ఎవరు గెలుస్తారన్న చర్చ తీవ్రస్థాయిలో జరుగుతోంది. ప్రధాన పార్టీలకు ధీటుగా జనసేన కూడా జనంలోకి వెళ్ళిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌తో పాటు జనసేన పార్టీ అభ్యర్థులు ఎంతమంది గెలుస్తారన్న ఆసక్తి కూడా అందరిలోను కనిపిస్తోంది.
 
పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు కూడా జనసేన పార్టీ తరపున ఎంపిగా పోటీ చేశారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకే పవన్ కళ్యాణ్ అన్నను ఎంపిగా పోటీ చేయించారు. అయితే ఫలితాలు రాకముందే నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ ఓడిపోయినా సరే మేము మాత్రం ప్రజలకు సేవ చేస్తామన్నారు నాగబాబు. ఏ పార్టీకి చెందిన వ్యక్తయినా సరే తమ పార్టీ గెలుస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తారు. కానీ నాగబాబు చేసిన వ్యాఖ్యలు జనసేన పార్టీ నాయకులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
 
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్న నాగబాబే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే బయటకు వెళ్ళినప్పుడు తామేమి చేయాలని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. నాగబాబు వ్యాఖ్యలు కాస్త జనసేన పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ మాత్రం స్పందించలేదు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం సీబీఎస్ఈ 10, 12 పరీక్షా ఫలితాలు విడుదల.. 31,14,821 మంది రాశారు