డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద దక్షిణాదిన మీ టూ ఉద్యమాన్ని లేవనెత్తిందనే చెప్పాలి. ప్రముఖ తమిళ సినీ గేయ రచయిత వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. అప్పట్లో ఆమె వ్యాఖ్యలు తీవ్రకలకలం రేపాయి.
తాజాగా ఆమె వృత్తిపరమైన, లేదా వ్యక్తిగత వివరాలకు సంబంధించి ఎవరైనా నేరుగా తననే సంప్రదించాలని స్పష్టం చేసింది. తన తల్లి పద్మహాసన్‌కు ఎక్కువగా ఫోన్ కాల్స్ వస్తున్నాయని చిన్మయి తెలిపింది. కానీ తన తల్లి తనకేమీ అధికార ప్రతినిధి కాదని, ఇకపై ఆమెకు ఫోన్లు చేసి ఇబ్బందిపెట్టవద్దని విజ్ఞప్తి చేసింది.
ఆమె ఏదైనా వ్యక్తపరిస్తే అది ఆమె స్వంత అభిప్రాయం మాత్రమేనని చిన్మయి స్పష్టం చేసింది. తల్లి అభిప్రాయాలకు తాను ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యురాలిని కాదని పేర్కొంది. ఇకపై వృత్తిపరమైన విషయాల కోసం తనను సంప్రదించాలనుకుంటే తన మేనేజర్ విష్ణుతో మాట్లాడాలని చిన్మయి వెల్లడించింది.