Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సినిమా అంటే నలుగురు హీరోలు - నలుగురు నిర్మాతలు కాదు : మోహన్ బాబు

Advertiesment
Mohan Babu
, ఆదివారం, 2 జనవరి 2022 (21:41 IST)
తెలుగు చిత్రపరిశ్రమ అంటే కేవలం నలుగురు హీరోలు, నలుగురు నిర్మాతలు, నలుగురు డిస్ట్రిబ్యూటర్లు కాదనీ చిన్నాపెద్దా నిర్మాతలతో పాటు.. 24 క్రాఫ్ట్స్‌కు చెందిన కళాకారులంతా కలిస్తేనే సినీ ఇండస్ట్రీ అని టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అందరం ఐక్యంగా ఉండి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమై సమస్యల పరిష్కారం కోసం కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ సుధీర్ఘ ప్రకటనను విడుదల చేశారు. ఆ లేఖలోని అంశాలను పరిశీలిస్తే, 
 
"మనకెందుకు మనకెందుకు అని మౌనంగా వుండాలా... 
నా మౌనం చేతకానితనం కాదు.. చేవలేనితనం కాదు.. 
కొంతమంది శ్రేయోభిలాషులు వద్దని వారించారు. నీ మాటలు నిక్కచ్చిగా వుంటాయ్.. కఠినంగా వుంటాయ్.... కానీ నిజాలే వుంటాయ్. ఇతరుల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇది నీకు అవసరమా అన్నారు. అంటే వాళ్ళు చెప్పినట్టు బతకాలా... నాకు నచ్చినట్టు బతకాలా.. అనే ప్రశ్న ఎదురైంది. దానికి సమాధానమే ఇది. 
 
సినిమా ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్స్, నలుగురు డిస్ట్రిబ్యూటర్స్ కాదు.. కొన్ని వేల మంది ఆశలు, కొన్ని వేల కుటుంబాలు... కొన్ని వేల జీవితాలు.... 47 సంవత్సరాల అనుభవంతో చెప్తున్న మాట.. అందరి జీవితాలతో ముడిపడిన ఈ సినిమా ఇండస్ట్రీ గురించి మనకు ఉన్న సమస్యల గురించి ముఖ్యమంత్రులకు వివరించాలనుకుంటే అందరూ కలిసి ఒకచోట సమావేశమై సమస్యలు ఏంటి, పరిష్కారాలు ఏంటి.. ఏది చేస్తే సినీ పరిశ్రమకి మనుగడ వుంటుంది అని చర్చించుకోవాలి. 
 
ఆ తర్వాత మాత్రమే సినిమాటోగ్రఫీ మంత్రుల్ని, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిసిగట్టుగా కలవాలి. అలాకాకుండా నలుగుర్నే రమ్మన్నారు. ప్రొడ్యూసర్స్ నుంచి నలుగురు, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఓ ముగ్గురు, హీరోల నుంచి ఇద్దరు, ఏంటిది..! మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సినిమా పరిశ్రమలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు. అందరూ సమానం.. ఏ ఒక్కరి గుత్తాధిపత్యం కాదు. చిన్న నిర్మాతల్ని కూడా కలుపుకుని ముఖ్యమంత్రుల దగ్గరకి వెళ్ళి సమస్యల్ని వివరిస్తే మనకీ రోజు ఇన్ని కష్టాలు వచ్చుండేవి కావు. సినీ పరిశ్రమలో ఒక పార్టీ వాళ్ళు ఉండొచ్చు, లేదా వేరు వేరు పార్టీల వాళ్ళు ఉండొచ్చు అది వాళ్ళ ఇష్టం, కాదనను.
 
కానీ ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రుల్ని ముందుగా మనం కలవాలి... వాళ్ళని మనం గౌరవించుకోవాలి... మన కష్టసుఖాలు చెప్పుకోవాలి..! అలా జరిగిందా? జరగలేదు. 
 
నేను 'మా' అధ్యక్షుడిగా ఉన్న టైంలో సినీ పరిశ్రమలో ఉన్న ప్రముఖలందర్ని కలుపుకొని ఒక్కటిగా వెళ్ళి అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్ రెడ్డిని కలిసి పైరసీ కోరల్లో సినిమా నలిగిపోతుంది, మా మీద దయచూపి బిక్ష పెట్టండి అనగానే, ఆ మాట చాలా మందికి నచ్చలేదు.. కానీ ఆయన్ని కదిలించింది. చాలావరకు పైరసీని కట్టడి చేసింది.
 
సినిమా ఇండస్ట్రీకి ఉపయోగపడే పనులు చాలావరకు చేసిపెట్టింది అప్పటి ప్రభుత్వం. 350 రూపాయలు, 300 రూపాయల టికెట్ల రేట్లతో చిన్న సినిమాలు నిలబడటం కష్టం. 50 రూపాయలు, 30 రూపాయలు టికెట్ల రేట్లతో పెద్ద సినిమాలు నిలబడ్డం కష్టం. చిన్న సినిమాలు ఆడాలి.. పెద్ద సినిమాలు ఆడాలి. దానికి సరైన ధరలుండాలి. 
 
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిసి 'అయ్యా.. మా సినీ రంగం పరిస్థితి ఇది.. చిన్న సినిమాల్ని పెద్ద సినిమాల్ని దృష్టిలో పెట్టుకుని మనకి న్యాయం చేయమని అడుగుదాం. సినిమా పరిశ్రమలో 24 క్రాఫ్ట్ వున్నాయి.. మా అందరికీ దేవుళ్ళు నిర్మాతలు... కానీ ఈ రోజున ఆ నిర్మాతలు ఏమయ్యారు? అసలు నిర్మాతల మండలి సమస్యను భుజాల మీద వేసుకోకుండా ఎవరికి వారే యమునాతీరే అన్నట్టు ఎందుకు మౌనం వహిస్తుందో అర్థం కావట్లేదు. మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది, ఒక్కటిగా ఉంటేనే సినిమా బ్రతుకుతుంది.. రండి అందరం కలిసి సినిమాని బతికిద్దాం" అని మోహన్ బాబు రాసిన లేఖలో పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెర్రీ - రానా బ్రొమాన్స్‌కు నెటిజన్లు ఫిదా