దిల్ రాజు సారథ్యంలో శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్, హన్షిత నిర్మించిన సినిమా బలగం. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని వేణు ఎల్దండి తెరకెక్కించారు. మార్చి 3న విడుదలైన చిత్రం సూపర్ డూపర్ సక్సెస్ టాక్‌తో ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందుతుంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం సినిమాను అభినందిస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలోని పాత్రలు, వాటి మధ్య భావోద్వేగాలకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
ఈ క్రమంలో బలగం సక్సెస్ గురించి దర్శకుడు వేణు ఎల్దండి మాట్లాడుతూ ... నేను 20 ఏళ్లుగా నటిస్తున్నాను. రెండు వందల సినిమాలు చేశాను. మంచి కమర్షియల్ సక్సెస్ రాలేదు. ఎప్పుడొస్తుందో తెలియదు. అప్పటి వరకు ఖాళీగా కూర్చోవటం ఎందుకని రాయటం మొదలు పెట్టాను. కొన్ని సినిమాలకు రాశాను. నేను రాసిన డైలాగ్స్, సీన్స్ అన్ని స్క్రీన్‌పై వర్కవుట్ అవుతున్నాయి. జబర్దస్త్‌లో కూడా స్కిట్స్ అంతా బాగా పేలుతున్నాయంటే మా ఐడియానే కదా అవి. అవన్నీ వర్కవుట్ అవుతున్నాయని వాటిని స్క్రీన్ మీద పెట్టాం. తర్వాత నన్ను నేను ప్రమోట్ చేసుకుందామని రెండు, మూడు కథలను తయారు చేసుకున్నాను. తర్వాత రెగ్యులర్‌గా అనిపించాయి. రొటీన్‌కి భిన్నంగా వెళ్లాలనిపించింది. మరాఠీ, మలయాళ సినిమాలు, తమిళ రా మూవీస్ నాపై ఎక్కువ ప్రభావాన్ని చూపాయి. అలా మనం ఎందుకు చేయకూడదనే ప్రాసెస్‌లోనే బలగం కథను తయారు చేసుకున్నాను.
- మా నాన్నగారు చనిపోయినప్పుడు జరిగిన కొన్ని ఘటనలు నాకు గుర్తుండిపోయాయి. మా అమ్మకు నేను 9వ వాడిని. మా నాన్న, పెద్దనాన్నలు అందరూ కలిసి 6 గురు, అలాగే నాకు ముగ్గురు మేనత్తలు. ప్రతి ఇంట్లో 6 నుంచి 8 మంది పిల్లలు. దీన్ని బట్టి మీరు లెక్క వేసుకోవచ్చు. ఏ ఫంక్షన్ పెట్టినా జాతరే. అంత మంది వస్తారు.
- తెలంగాణ కల్చర్‌లో చేదు నోరు అనేది ఉంది. మా నాన్నగారు చనిపోయినప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు. అక్కడ ఏడుపులు, తాగడాలు, తినడాలు అన్నీ చూస్తే నాకు కొత్తగా కనిపించింది. అవన్నీ నా మైండ్‌లో నాటుకు పోయింది. 2015లో నేను జబర్దస్త్ నుంచి బయటకు వచ్చినప్పుడు బలగం కథే నా మైండ్‌లోకి వచ్చింది. దాని మీద వర్కవుట్ చేస్తూ చేస్తూ రెండున్నరేళ్లు కష్టపడ్డాను.
- బలగం సినిమాలో చూపించిన కొమరయ్య క్యారెక్టర్ మా పెద్దనాన్న. అదే రుమాలు, అదే జుబ్బా. ఆయన చనిపోయినప్పుడు నేను షూటింగ్స్‌లో ఉండటం వల్ల వెళ్లలేకపోయాను. ఆయన చనిపోయిన 10 రోజులకు మా పెద్దమ్మ చనిపోయింది. పెద్ద నాన్నకు 96 ఏళ్లుంటే, పెద్దమ్మకు 94 ఏళ్లుంటాయి. అప్పుడు విదేశాల్లో షూటింగ్ ఉండింది. రాలేకపోయాను. వచ్చిన తర్వాత తెలంగాణలో చేదునోరు కల్చర్ ఉంటుంది కదా, దాని కోసం ఓ బాటిల్ పట్టుకుని వెళ్లాను, కలిశాను. మా అన్నయ్య బాధలో ఉన్నాడు, ఆయన్ని ఓదార్చే ప్రాసెస్సే చేదునోరు అనేది. నేను వెళ్లిన తర్వాత అన్నయ్య మాట్లాడుతూ పెద్దనాన్న, పెద్దమ్మ చనిపోవటంపై ఆయన పెద్దగా ఫీల్ కాలేదు.. సంతోషంగానే ఉందని అన్నాడు. అందుకు కారణం..వాళ్లకు పెళ్లై 86 ఏళ్లు అయ్యాయి. 86 ఏళ్ల స్నేహితుడు వెళ్లిపోయినప్పుడు, ఆయన్ని వెతుక్కుంటూ పెద్దమ్మ వెళ్లిపోయిందని అన్నయ్య చెప్పాడు. నిజంగానే అది చాలా గొప్ప పాయింట్ కదా అనిపించింది.
- పెద్దనాన్న, పెద్దమ్మ ఇద్దరూ పెద్దగా గ్యాప్ లేకుండా కాలం చేశారు కదా, దాంతో ఫ్యామిలీ అందరూ వచ్చారు. ఆ సమయంలో బుడగ జంగమలు వచ్చి పాట పాడారు. వాళ్లు పాటను ఓ ఫార్మేట్‌లో పాడుతుంటారు. చనిపోయిన వ్యక్తిని ఉద్దేశించి ఎక్కడికెళ్లావయ్యా.. నీ కొడుకు వెతుకుతున్నాడు.. బాధపడుతున్నాడు అంటూ పాడుతారు. తర్వాత పేర్లు చెబుతూ వెళితే యాడ్ చేసుకుంటూ పాడుతూ వెళతారు. అలా పాడుతున్నప్పుడు అందరూ కనెక్ట్ అవుతూ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇలా జరిగిన విషయాన్ని మా అన్నయ్య చెప్పగానే నాకు క్లైమాక్స్ దొరికేసిందనిపించింది. ఈ కాలంలో ఎవరూ స్పీచులు వినటం లేదు. మాకు తెలుసులే అన్నట్లు బిహేవ్ చేస్తారు. అలాంటప్పుడు పాటలాగా చేస్తే ఎదుటి వ్యక్తి బాధ్యతలను వాళ్ల తండ్రి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి.. అప్పుడు వాళ్లకు వాళ్లుగా తెలుసుకుంటారు. ఆ ఆలోచనతోనే బలగం సినిమాలో క్లైమాక్స్‌ను డిజైన్ చేశాను.
- నేను యాక్టర్‌ని కాబట్టి నా కోసం రాసుకున్న కథ. అయితే నాపై మూడు నాలుగు కోట్ల బడ్జెట్ ఎవరు పెట్టారు. కాబట్టి రా కంటెంట్‌గా 50-60 లక్షల్లో సినిమా తీసేద్దామనుకున్నాను. ఆ సమయంలో నా స్నేహితుడు, నిర్మాత అయిన ప్రదీప్ చిలుకూరి అనే వ్యక్తిని కలిసినప్పుడు కథ చెప్పాను. వీడు కూడా కథలు చెబుతాడా? అని అందరూ అనుకుంటారుగా.. ఆ కోణంలో సీరియస్‌గా చెప్పటం కంటే ఇలా సింపుల్ సిట్యువేషన్‌లో చెబితే బావుంటుందనిపించి సరదాగా కథ చెప్పాను. కథ విన్న తర్వాత ఆయన సీరియస్‌గా ఉన్నాడు. తర్వాత ఏమనుకుంటున్నావు దీని గురించి, దీని వేల్యూ ఏంటో నీకు తెలుసా? అని అన్నాడు. ఏంటో వీడు జోక్ చేస్తున్నాడని అనుకున్నాను. నువ్వు ఎలా పట్టుకున్నావో తెలియదు కానీ.. కథ మామూలు యవ్వారంగా లేదు.. వేరే రేంజ్‌లో ఉంది అన్నాడు. రెండు రోజులు టైమివ్వు అన్నాడు. తర్వాత ఈస్ట్ డిస్ట్రిబ్యూటర్ శివరాంగారు కలిశారు. ఆయన మంచి కథ కోసం ఎప్పటి నుంచో వెతుకుతున్నాడట. ఆయనకు కథ చెప్పాను. నచ్చింది. కథ నెరేట్ చేసినప్పుడు నెక్ట్స్ లెవల్‌లో ఉందని వాళ్లు చెప్పారు. మీరే డైరెక్ట్ చేయాలని నాకు చెప్పారు. నా కోసం నేను అన్ని పక్కన పెట్టి కథ రాసుకుంటే ఇదేం గోల అనిపించింది. మూడు నెలలు పాటు వాళ్లు ఫోన్ చేసి మీరే చేయండి సార్ అని అనటం మొదలు పెట్టారు. దీన్ని మరొకరు డైరెక్ట్ చేయటం ఈజీ కాదు. ఎందుకంటే నా లైఫ్‌లో నేను చూసిన ఇన్సిడెంట్స్ అవి. వేరే వాళ్లు దాన్ని ఆపాదించుకోలేరు. బాగా ఆలోచించాను. ఎప్పటికైనా నాకు ఒక ఫ్రొఫైల్ కావాలి. అది బిల్డ్ అయితే మరో కథను రాసుకోవచ్చు అనిపించింది.
- శివరాంగారు కథ గురించి మాట్లాడుతూ ఇది చాలా పెద్ద కథ. పెద్ద వ్యక్తి చేతిలో ఉంటే మరో లెవల్‌కు రీచ్ అవుతుందన్నారు. ఆయన దిల్ రాజుగారి దగ్గరకు తీసుకొచ్చారు. ఆయనకు కూడా కథ నచ్చడంతో ఈరోజు సినిమా ఇలా మీ ముందుకు వచ్చింది.
- లైఫ్‌లో కొన్ని సాధించాలని అనుకుంటుంటాం. అలాంటిదే చిరంజీవిగారి నుంచి వచ్చిన అప్రిషియేషన్స్. మరచిపోలేని ఎక్స్‌పీరియెన్స్. ఆయన్ని కలవటానికి వెళ్లినప్పుడు కూర్చో పెట్టుకుని సన్నివేశాల గురించి మాట్లాడుతున్నారు. ఆయనంత డీటెయిల్డ్‌గా మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించింది.
- నేను సిరిసిల్లలో పుట్టి పెరిగాను. మా నాన్నగారు చనిపోయినప్పుడు జరిగిన ఘటనలను బేస్ చేసుకుని రాసుకున్న కథ ఇది. కాబట్టి.. అదే గాలి, మనుషులు, వాతావరణంలోనే సినిమాను డైరెక్ట్ చేయాలని మెంటల్‌గా ఫిక్స్ అయిపోయాను.
- దిల్ రాజుగారిని కలిసే ముందే నాకొక ప్రొఫైల్ ఉండాలని ఫిక్స్ అయిపోవటంతో నాకోసం రాసుకున్న కథ ఇదని చెప్పలేకపోయాను. డైరెక్షన్ మోడ్‌లో ఉన్నప్పుడు మరోటి ఆలోచించలేం. అయితే నాలో ఉన్న యాక్టర్ వల్ల సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించాను. ఆ పాత్ర చేయటానికే చాలా కష్టప్డడాను. ఎందుకంటే నేను డైరెక్ట్ చేసుకుంటూ నటించటం అనేది కష్టం. మూమెంట్ మిస్ అవుతుందని నేను పెద్ద పాత్రలో నటించాలనుకోలేదు.
- కమర్షియల్‌గా నేను సినిమా ఏదో చేసేస్తుందని అనుకోలేదు. మంచి సినిమా చేయాలనుకున్నాను. మాది మాకొస్తుందనే నమ్మకమైతే ఉండింది. సినిమా ఇంత బాగా రావటానికి కారణం కూడా దిల్ రాజుగారే. ఆయన ఎక్స్‌పీరియెన్స్ అంతా నాపై ఉండింది. ఉదాహరణకు కథలో నేను పొట్టిపిల్ల సాంగ్‌ను రాసుకోలేదు. అప్పుడాయన మరి అంత నాటుగా వద్దు ఓ సాంగ్ చూడు అని అన్నారు. నేను అయితే వద్దు సార్ అనే అన్నాను. అయితే ఆయన సాంగ్ పెట్టమని రిక్వెస్ట్ చేశారు. ఆయన చెప్పటంతో ఆ పాటను క్రియేట్ చేసి చిత్రీకరించాం. మనం డాక్యుమెంటరీ చేయటం లేదు. సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయాలనే ఉద్దేశంతోనే రాజుగారు సినిమాను లైటర్ వేలో ఉండేలా చూసుకున్నారు.
- దిల్‌రాజుగారి ఎక్స్‌పీరియెన్స్ నాకెలా ఉపయోగపడిందనే దానికి మరో ఎగ్జాంపుల్ చెప్పాలి. సినిమాలో మూడో రోజు, ఐదో రోజు ఫ్యామిలీలో గొడవలు ఉండేలా చూపించాం. మధ్య నాలుగో రోజున సిస్టర్ సెంటిమెంట్ ఎలివేట్ చేసే సీన్‌ను రాసుకున్నాను. మూడో రోజు, ఐదో రోజు గొడవలు ఉండే చూపించి నాలుగో రోజున ఇంత మంచి సెంటిమెంట్ సీన్ చూపిస్తే.. ఎమోషన్ మిస్ అవుతుంది కదా , ఆడియెన్ ఎమోషన్‌ని రీ కలెక్ట్ చేసుకోవాలి కదా అన్నారు. ఆ సీన్ ప్లేస్ మెంట్ మార్చు అన్నారు. దాంతో ఆ సీన్‌ను పంచాయతీ సన్నివేశం తర్వాత పెట్టాం. అది ఎంతో వేల్యూబుల్ పాయింట్ అయ్యింది. అలాగే మరో చోట హీరో పెళ్లి చెడిపోయిన తర్వాత హీరోయిన్ ఎంట్రీ ఉంటుంది. ఒక అమ్మాయి పోతే మరో అ్మమాయి వస్తుందనేలా ఉంది. అది కరెక్ట్ కాదు.. హీరోయిన్ ఉండగానే పెళ్లి చెడిపోయేలా సీన్ క్రియేట్ చేయమని అన్నారు. ఆయన ఇన్‌పుట్స్ బాగా హెల్ప్ అయ్యాయి.
- ఓ శవాన్ని పెద్ద స్క్రీన్‌పై ఎక్కువ సేపు చూపిస్తే ఆడియెన్స్ పాజిటివ్‌గా తీసుకుంటాడా? డెడ్ బాడీని ఎంత సేపు చూపించాలి.. ఏ వేలో చూపించాలి.. ఎక్కువగా చనిపోయిన వ్యక్తిని చూపిస్తే నెగెటివ్‌గా తీసుకుంటాడా? అని తెగ ఆలోచించి రీసెర్చ్ చేశాను. దాని కోసం నేను ఆ కాన్సెప్ట్ ఉన్న 50-60 సినిమాలను చూశాను. ఎందిరా ఈ డెడ్ బాడీ అని ప్రేక్షకుడు వెగటుగా అనుకున్నాడా? సినిమా పోతది. అలాగే హీరో కోణంలో తాతయ్య చావుని ఫన్నీ వేలో చూపించుకుంటూ వచ్చాం. అలా ఆడియెన్ అనుకోవాలంటే అక్కడ సీన్ పెట్టాలా? సౌండ్ ద్వారా చూపెట్టాలా? మళ్లీ అక్కడ పొరపాటున ఎమోషన్ అనుకుంటే పోయింది మళ్లీ. ఈ విషయంలోనూ నేను చాలా రీసెర్చ్ చేశాను.
- ఓటీటీ వచ్చిన తర్వాత ఆడియెన్స్ మూడ్ మారింది. కమర్షియల్ సినిమాలతో పాటు ఆర్ట్ తరహా సినిమాలను, వెబ్ సిరీస్‌లను హిట్ చేస్తున్నారు. ప్రేక్షకుల ఆలోచన మారింది.
- నన్ను డైరెక్టర్‌గానూ చూస్తారు.. అలాగే యాక్టర్‌గానూ చూస్తారు. ప్రతి వ్యక్తి బయటకు ఒకలా కనిపిస్తారు. కానీ లోపల మరోలా ఆలోచిస్తుంటారు. అలాగే నటుడిగా నేను కమెడియన్‌గా ఆపాదించబడ్డాను. కానీ నాకు సీరియస్ సినిమాలంటే చాలా ఇష్టం. నాకు మా ఫ్యామిలీ అంటే ఎంతో ఇష్టం. ఏడెనిమిదేళ్ల ముందు మా అమ్మగారిపై ఓ డాక్యుమెంటరీ కూడా చేశాను. దాన్ని కమల్‌హాసన్‌గారి చేతుల మీదుగా రిలీజ్ కూడా చేశాం. అదే నేను ఫస్ట్ డైరెక్షన్ చేసింది. ఆమె ఎక్కడ పుట్టింది.. ఎక్కడ పెరిగింది. పెళ్లి, అత్తగారిల్లు విషయాలను అందులో చూపించాను. మా అవ్వ కథ అనే సాంగ్ చేశాను. మా అమ్మకు ట్రిబ్యూట్‌గా నా కోసం చేసుకున్న సాంగ్ అది.
- ఇకపై నేను చేయబోతున్న సినిమాల్లో ఎంటర్‌టైన్మెంట్ ఉంటుంది. అయితే ఏ ఎమోషన్స్ ఉంటాయని ఇప్పుడే చెప్పలేం. యూనివర్సల్‌గా కథను చెప్పాల్సి ఉంది. దిల్ రాజుగారికి ఆల్ రెడీ ఓలైన్ చెప్పాను. ఇది కాస్త పెద్ద స్పాన్‌లోనే ఉండొచ్చు.
- ప్రేక్షకులు ఎప్పుడూ ఏ యాసను సెపరేట్‌గా చూడలేదు. ఒకప్పుడు ఆంధ్ర యాసలో కంటిన్యూగా సినిమాలు వచ్చాయి. తర్వాత రాయలసీమ యాసలో సినిమాలు వచ్చాయి. ఇప్పుడు తెలంగాణ స్లాంగ్‌లో సినిమాలు వస్తున్నాయంతే. నేను ఎప్పుడూ అలా వేరుగా చూడలేదు. అన్నీ స్లాంగ్స్ మనవే. డిమాండ్ అండ్ సప్లయ్ అనే కోణంలోనే చూడాలి. ఏది వర్కవుట్ అవుతుందనేది చూసుకుని ముందుకెళ్లాలి.
- నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా నన్ను అరెయ్ అని పిలవటం లేదు. అదొక సమస్యగా మారింది. సరదాగా జోకులు వేసుకుని తిరిగే బ్యాచ్ సడెన్‌గా గౌరవం ఇస్తుంటే చాలా కొత్తగా, భయంగా ఉంది. దాన్ని డైజెస్ట్ చేసుకోవటానికి కాస్త టైమ్ పడుతుంది. నవ్వటం, నవ్వించటం చాలా ఇష్టం.