Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జరిమానాపై స్టే... కానీ దిగుమతి సుంకం చెల్లించాల్సిందే.. విజయ్‌కు కోర్టు

జరిమానాపై స్టే... కానీ దిగుమతి సుంకం చెల్లించాల్సిందే.. విజయ్‌కు కోర్టు
, బుధవారం, 28 జులై 2021 (09:30 IST)
విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న లగ్జరీ కారు రోల్స్‌ రాయిస్‌‌ దిగుమతి సుంకం చెల్లింపు కేసులో తమిళ హీరో విజయ్‌కు మద్రాస్ హైకోర్టు ఊరటనిచ్చింది. కింది కోర్టు విధించిన రూ.లక్ష అపరాధం ఉత్తర్వులపై హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. అయితే, దిగుమతి సుంకం చెల్లింపు విషయంలో మాత్రం కుదరదని తేల్చి చెప్పింది. పైగా, మిగిలిన 80 శాతం ఎంట్రీ పన్నును వారంలోపు చెల్లించాలని ఆదేశించింది. 
 
ఈ కేసు విషయంలో కోర్టు విచారణ జరిపి... ‘రీల్‌ హీరోలు కాదు.. రియల్‌ హీరోలు కండి’ అంటూ న్యాయమూర్తి నటుడు విజయ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను, జరిమానాను ఉపసంహరించుకోవాలని విజయ్‌ మద్రాసు హైకోర్టులో అప్పీల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 
 
ఈ వ్యాజ్యం మంగళవారం జస్టిస్‌ దురైస్వామి, జస్టిస్‌ హేమలత ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. దిగుమతి చేసుకున్న కారుకు ఏడు నుంచి పది రోజుల్లో ఎంట్రీ పన్ను చెల్లించేందుకు సిద్ధమని విజయ్‌ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. 
 
అయితే, జరిమానా, న్యాయమూర్తి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని వాదనలు వినిపించారు. లగ్జరీకారుకు విజయ్‌ ఎంట్రీ పన్ను చెల్లిస్తే సరిపోతుందని, జరిమానా, వ్యాఖ్యల గురించి మాట్లాడేందుకేమీ లేదని ప్రభుత్వం తరపున న్యాయవాది వివరించారు. 
 
ఈ నేపథ్యంలో ప్రత్యేక న్యాయమూర్తి విధించిన జరిమానాపై మధ్యంతర స్టే విధించారు. ప్రత్యేక న్యాయమూర్తి పేర్కొన్న విమర్శలపై నాలుగు వారాల తర్వాత విచారణ నిర్వహిస్తామని సూచిస్తూ కేసును ఆగస్టు 31కి వాయిదా వేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెజీనా దశ-దిశ తిరగనుందా, ఆ ఒక్క సినిమాతో..?