మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. నటి, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ కుల సర్టిఫికెట్ విషయంలో ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. కాగా నకిలీ కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించి మోసగించారనే ఆరోపణతో ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన ముంబై హైకోర్టు ఆమె ఎస్సీ కాదని తీర్పు ఇచ్చింది. అంతేకాదు ఆమెకు రూ. 2 లక్షల జరిమానా కూడా విధించింది. ముంబై కోర్టు తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది ఎంపీ నవనీత్ కౌర్.
జస్టిస్ వినీత్ సరన్, దినేష్ మహేశ్వరిల వేకేషన్ బెంచ్ నవనీత్ కౌర్ పిటిషన్‌పై విచారణ జరిపి మంగళవారం స్టే విధించింది. ఇక కులధ్రువీకరణ పత్రం వ్యవహారంపై ఫిర్యాదు చేసిన వ్యక్తితో పాటు మరికొందరికి నోటీసులు జారీచేసింది సుప్రీం కోర్టు. కాగా నవనీత్ కౌర్ అమరావతి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.