రైటర్ పద్మభూషణ్ నాకు గ్రేట్ జర్నీ. ఇంతకుముందు ఒక సినిమాకి సహాయ దర్శకురాలిగా పని చేయడం వలన సినిమా గురించి అవగాహన వుంది. అయితే ఒక యాక్టర్ గా మనల్ని మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. మన బలాలు ఏంటి ? బలహీనతలు ఏంటి ? ఎక్కడ మనం బాగా చేయగలుగుతున్నాం, ఎక్కడ ఇంకా మెరుగుపరుచుకోవాలి ? ఇలా చాలా విషయాలు రైటర్ పద్మభూషణ్ ప్రయాణంలో నేర్చుకున్నాను అని కథానాయిక టీనా శిల్పరాజ్ తెలిపారు.
నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుహాస్ హీరో. . ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రాన్ని జి. మనోహర్ సమర్పిస్తున్నారు. ఫిబ్రవరి 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో హీరోయిన్ టీనా శిల్పరాజ్ చిత్ర విశేషాలని పంచుకున్నారు.
- నేను తెలుగమ్మాయినే. మాది హైదరాబాద్. రైటర్ పద్మభూషణ్ కి పని చేసిన కాస్టూమ్ డిజైనర్ ద్వారా ఆడిషన్ కాల్ వచ్చింది. అంతకుముందు ది బేకర్ అండ్ ది బ్యూటీకి మేము కలసి పని చేశాం. రైటర్ పద్మభూషణ్ కి ఆడిషన్స్ ఇచ్చాను. తర్వాత సుహాస్ గారితో లుక్ టెస్ట్ జరిగింది. ఈ సినిమా వస్తుందని బలంగా నమ్మాను. నేను నమ్మినట్లే సినిమా రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.
- ఇందులో నా పాత్ర పేరు సారిక. సారిక విజయవాడ అమ్మాయి. పద్మభూషణ్ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. కథలో చాలా కీలకమైన పాత్రది. దర్శకుడు ప్రశాంత్ సారిక పాత్రని చాలా అద్భుతంగా రాసుకున్నారు. నా పాత్రకు మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా వుంది. ఈ క్రెడిట్ అంతా దర్శకుడు ప్రశాంత్ కి దక్కుతుంది.
- విజయవాడ, గుంటూరులో జరిగిన ప్రిమియర్స్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. విజయవాడ ప్రిమియర్ కి వచ్చిన స్పందన చూసి ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. థియేటర్ నిండిపోయింది. మేము స్టేజ్ పై నిలబడి చూశాం. ప్రేక్షకులంతా సినిమాకి చాలా గొప్పగా కనెక్ట్ అయ్యారు. గుంటూరు, భీమవరంలో కూడా ప్రేక్షకులు నవ్వినవ్వి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకోవడం చూసినపుడు మేము పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కినట్లనిపించింది.