కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీ బాగా దుర్వినియోగమవుతోంది. ఈ టెక్నాలజీతో అచ్చం మనిషిని పోలినట్టుగానే ఫోటోలను సృష్టిస్తున్నారు. మరికొందరు మార్ఫింగ్ చేస్తున్నారు. ఈ మార్ఫింగ్ ఫోటోలు అసభ్యంగా చిత్రీకరిస్తున్నారు. వీటిని చూస్తే షాక్ అవ్వాల్సిందే. తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వీటిని చూసిన ఆమె షాక్‌కు గురయ్యారు. తన కొత్త సినిమా రివాల్వర్ రీటా ప్రచారంలో భాగంగా సాంకేతికత దుర్వినియోగంపై మాట్లాడారు.
'ప్రస్తుతం ఏఐ అతిపెద్ద సమస్యగా మారింది. ఓ రకంగా వరమే అయినా మరో కోణంలో శాపంగా చూడాల్సి వస్తోంది. సాంకేతికతపై కొందరు నియంత్రణ కోల్పోతున్నారు. సామాజిక మాధ్యమంలో నా ఫొటోను చూసి ఆశ్చర్యపోయా. ఇలాంటి దుస్తులు నేనెప్పుడైనా ధరించానా? అనుకున్నా.
మరోవైపు, కొన్ని రోజుల క్రితం పాల్గొన్న పూజలో నేను వేసుకున్న అవుట్‌ఫిట్‌ను మార్చేసి ఇబ్బందికరంగా మార్ఫింగ్ చేశారు. అది చూసి చాలా బాధపడ్డా. ఇలాంటి వాటి వల్ల వారు ఏం పొందుతారు?' అని అసహనం వ్యక్తం చేశారు. ఈ సమస్య చిత్ర పరిశ్రమ వారికే పరిమితం కాదన్నారు.
అలాగే, తనను లక్ష్యంగా చేసుకుని ఆన్లైన్లో వేధించిన ఓ వ్యక్తిపై కొన్ని రోజుల క్రితం నటి అనుపమ పరమేశ్వరన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రష్మిక, అలియా భట్, కత్రినా కైఫ్ ఇలా పలువురు డీప్‌ఫేక్ బారిన పడిన విషయం తెల్సిందే.