Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వారిలా అవినీతిపరురాలిని కాదు.. నిజమైన దేశభక్తురాలిని : కంగనా రనౌత్

వారిలా అవినీతిపరురాలిని కాదు.. నిజమైన దేశభక్తురాలిని : కంగనా రనౌత్
, సోమవారం, 22 మార్చి 2021 (06:33 IST)
మహారాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిస్థితులపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోమారు స్పందించింది. ఆ రాష్ట్ర హోం మంత్రి, ఎన్సీపీ నేత అనిల్‌ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలు ఇపుడు సంచలనంగా మారాయి. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సర్కారుకు ప్రాణసంకటంగా మారాయి. 
 
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ మరోసారి మహారాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గతంలో ఈ ప్రభుత్వం అవినీతిని ప్రశ్నించినందుకు తనపై దాడులకు పాల్పడ్డారని, బెదిరించారని, తనపై ఎన్నో విమర్శలు చేశారని చెప్పారు. ముఖ్యంగా, ముంబై మహానగరం పట్ల తన విధేయతను ప్రశ్నించినప్పుడు నేను మౌనంగా రోధించానని ఆవేదన వ్యక్తంచేసింది.
 
అంతేకాకుండా, అధికారాన్ని అడ్డుపెట్టుకుని మహారాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా తన ఇంటిని కూల్చివేసిన సమయంలో పలు పార్టీల నాయకులు పండుగ చేసుకున్నారన్నారు. ఈ కూల్చివేతలను కోర్టుల ద్వారా అడ్డుకుని, నా ఆస్తిని కాపాడుకోగలిగినట్టు చెప్పారు. ఇప్పుడు ఎవరు దేశభక్తులో.. ఎవరు అవినీతిపరులో బయటపడిందని, రానున్న రోజుల్లో వీరి కథలు మరింతగా బహిర్గతమవుతాయన్నారు. 
 
'నేను నిజమైన దేశభక్తురాలినని, వారిలా అవినీతిపరురాలిని మాత్రం కాదు' అని కంగనా చెప్పుకొచ్చారు. బాలీవుడ్ యువ హీరో సుషాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం సంభవించినప్పటి నుంచి మహారాష్ట్ర ప్రభుత్వం - కంగనా రనౌత్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం కొనసాగుతున్న విషయం తెల్సిందే. 
 
అనుమతి లేకుండా ఇళ్లు నిర్మించారన్న ఆరోపణలపై బృహణ్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) అధికారులు కంగనా ఇంటిని కూల్చివేశారు. దీంతో వైరం మరింత ముదిరింది. ప్రస్తుతం ముంబై పోలీస్‌ కమిషనర్‌ పదవి నుంచి తొలగించిన తర్వాత మహారాష్ట్ర హోంమంత్రిపై పరమ్‌బీర్‌ సింగ్‌ తీవ్ర ఆరోపణలు చేయడం కలకలం రేపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెప్సీ అంటీగా మారిన అప్సరా రాణి - 'సీటీమార్' సాంగ్ రిలీజ్