ఆంధ్ర ప్రదేశ్‌లో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఇటీవలే గణేష్ నిమజ్జనం సందర్భంగా సినీ నటుడు జూనియర్ ఎన్.టి.ఆర్. ఫొటోలతో కూడిన జెండాలను ప్రదర్శించారు. నిమజ్జనం రోజున ఊరేగింపుగా వాహనాల్లో వినాయకుడిని ఊరేగిస్తూ, యువత ఎన్.టి.ఆర్. ఫొటోలతో కూడిన జెండాలను పట్టుకుని జై ఎన్.టి.ఆర్., జైజై ఎన్.టి.ఆర్., కాబోయే నెక్ట్స్ సి.ఎం. ఎన్.టి.ఆర్. అంటూ నినాదాలు చేస్తూ ఒక్కసారిగా వాతావరణాన్ని వేడెక్కించారు.
ఈ సంఘటన కృష్ణాజిల్లాలోని బంటుమిల్లి లోని అర్థమూరు గ్రామంలో చోటు చేసుకుంది. అక్కడ యువత పట్టుకున్న జెండాలలో ఎక్కడా చంద్రబాబు ఫొటోకానీ లోకేష్ ఫొటోకానీ లేకుండా కేవలం ఎన్.టి.ఆర్. ఫొటోతో కూడిన పలు జెండాలతో గట్టిగా జిందాబాద్‌లు కొట్టారు. ఇది అక్కడివారిని ఆశ్చర్యంతోపాటు ఎ.పి.లో ఏదో జరగబోతోందని సంకేతాలు కనిపించాయి. ప్రస్తుతం అక్కడ వై.ఎస్. జగన్ ప్రభుత్వం నడుస్తోంది. తెలుగుదేశం కార్యకర్తలు, వైసిపి కార్యకర్తల మధ్య పలు గొడవలు కూడా వున్నాయి.
ఇదిలా వుండగా, గతంలోనే ఓ దశలో ఎన్.టి.ఆర్.ను ఎలక్షన్ల సమయంలో చంద్రబాబు ప్రచారానికి ఉపయోగించుకున్నారు. కానీ అది పెద్దగా లాభించలేదు. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ఇప్పుడు సరైన నాయకుడు రావాల్సిన అవసరం వుందనే సంకేతాలు ఇచ్చినట్లుంది. కానీ, ఎన్.టి.ఆర్. సినిమాలు తర్వాత రాజకీయాలవైపు చూస్తానని ఓ సందర్భంగా వెల్లడించారు కూడా. మరి ఈ వినాయక చవితికి ఇలా కాబోయే సి.ఎం. ఎన్.టి.ఆర్. అనడంలో ఆంతర్యం ఏమిటో త్వరలో తెలియనుంది.