ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన సోదరుడు శిరీష్‌ను కాపాడుకునేందుకు తనపై నిందలు వేశారని జనసేన పార్టీ నుంచి బహిష్కరణకు గురైన కాకినాడకు చెందిన అత్తి సత్యనారాణ సంచలన ఆరోపణలు చేశారు.
జూన్ ఒకటో తేదీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల బంద్ పాటించాలంటూ అత్తి సత్యనారాయణ తొలుత ప్రతిపాదన చేశారని దిల్ రాజు ఇటీవల వ్యాఖ్యానించారు. దీంతో జనసేన పార్టీ నుంచి అత్తిని సస్పెండ్ చేశారు. దీనిపై అతితి సత్యనారాయణ మాట్లాడుతూ, దిల్ రాజు అతని తమ్ముడుని కాపాడుకోవడానికి తనపై నిందలు వేశారన్నారు.
గత నెలలో జరిగిన సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల సమావేశంలో సినిమా థియేటర్ల బంద్ అంశం తాను ప్రతిపాదన చేయలేదన్నారు. థియేటర్ల బంద్ అని ప్రకటించిందే దిల్ రాజు తమ్ముడు శిరీష్ రెడ్డి అని, అతన్ని కాపాడుకునేందుకు దిల్ రాజు తనపై నిందలు వేశారన్నారు. దిల్ రాజు కమల్ హాసన్‌ను మించిపోయేలా నటించారన్నారు.
తమ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎపుడైతే సీరియస్ అయ్యారో జనసేన పార్టీ పేరును ఉద్దేశ్యపూర్వకంగానే ఆయన తెరపైకి తెచ్చారని అత్తి సత్యనారాయణ ఆరోపించారు. కాగా, థియేటర్ల బంద్ అంశం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెల్సిందే.