పెద్ద కరెన్సీ నోట్లయిన రూ. 2000, రూ. 1000లను ప్రధానమంత్రి రద్దు చేస్తామని చెబితే... అవినీతి అనకొండల ఆట కట్టించాలంటే రూ. 500 నోట్లను కూడా రద్దు చేయాలని తెలిపానంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కడపలో జరుగుతున్న మహానాడులో వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ... అవినీతి అంతం కావాలంటే పెద్దనోట్లను పూర్తిగా రద్దు చేయాలన్నారు. ఇప్పటికే రూ. 2000, రూ. 1000 రద్దు చేసారనీ, అలాగే రూ. 500 కూడా రద్దు చేస్తే అవినీతి తిమింగలాలు దొరికిపోతాయంటూ చెప్పుకొచ్చారు. డిజిటల్ కరెన్సీతో అంతా పారదర్శకంగా వుంటుందనీ, ఎక్కడ కూడా అవినీతికి తావు వుండదని చెప్పారు.
కడప జిల్లాలో ఒక్క స్థానం గెలిచి చూడండి అని సవాళ్లు విసిరిన వారికి కడప జిల్లా ప్రజలు బుద్ధి చెప్పారనీ, ఉమ్మడి కడప జిల్లాలోని మొత్తం 10 స్థానాలకు గాను 7 స్థానాలను గెలిపించి ఇచ్చారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇంకాస్త కష్టపడితే 10 స్థానాలకు పది దక్కించుకోవచ్చని నాయకులకు సూచించారు. ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్న తెలుగుదేశం పార్టీ ప్రజల మన్ననలను పొందుతోందని అన్నారు.