తనను బలపశువును చేసేందుకు వైకాపా కోటరి కుట్రపన్నిందని వైకాపా మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. తనపై వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఆయన స్పందించారు. తాను తెలుగుదేశం పార్టీకి గానీ, చంద్రబాబుకు గానీ అమ్ముడుపోలేదని, తనపై కావాలనే కొందరు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు.
వైసీపీలోని ఓ కోటరీయే తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తోందని, తనను రెచ్చగొట్టి, పార్టీకి, జగన్‌కు నష్టం కలిగించేలా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. తను మౌనంగా ఉండటం వైసీపీలోని ఒక వర్గానికి నచ్చడం లేదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. "నాపై సోషల్ మీడియాలో అబద్దపు పోస్టులు పెట్టారు. నన్ను కెలకటం మరియు ఇరిటేట్ చేయటం వల్ల నేను తప్పనిసరి పరిస్థితుల్లో రియాక్ట్ అవుతున్నాను" అని తెలిపారు. తన స్పందన వల్ల జగన్కు నష్టం కలగాలని కొందరు కోరుకుంటున్నారని, వారే తనను రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు.
"రాజకీయ అనుభవం లేని ఈ కోటరీ అనాలోచిత చర్యల వల్ల పార్టీలో నంబర్ 2 ప్రాధాన్యత కావాలనుకుంటున్న వారికి ప్రయోజనం ఉండవచ్చేమో కానీ జగన్ గారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు" అని అభిప్రాయపడ్డారు. గత నాలుగేళ్లుగా తనను అవమానిస్తున్నారని, తనకు సంబంధం లేని స్కాముల్లో మరోసారి తనను బలిపశువును చేయాలని ఆ కోటరీ నిర్ణయించుకుందని విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
"లేని అభాండాల్ని నా నెత్తి మీద మరోసారి వేసుకోలేక బయటకు వచ్చాను" అని అన్నారు. 2011లో తనపై 21 కేసులు వేసుకున్నానని, ఇప్పుడు కూడా జగన్ అడిగి ఉంటే, కోటరీ ద్వారా రుద్దే ప్రయత్నం చేయకుండా ఉంటే, సంబంధం లేకపోయినా బాధ్యత తీసుకునేవాడినేమో అని ఆయన వ్యాఖ్యానించారు. ఆ కోటరీయే తనకు వెన్నుపోటు పొడిచిందని, మూడు తరాలుగా వైయస్ కుటుంబానికి సేవ చేసిన తనను, ఆ కోటరీ మాటలు నమ్మి జగన్ పక్కన పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
"ఎవరో కోటరీ చేసిన నేరాలను తన నెత్తిన వేసుకుంటే సాయిరెడ్డి మంచోడు, అలా చేయకుంటే చెడ్డవాడు అవుతాడా? అలా చేయకుంటే వెన్నుపోటుదారుడు అవుతాడా? అలా చేయకుంటే టీడీపీకి అమ్ముడు పోయిన మనిషి అవుతాడా?" అని విజయసాయి ప్రశ్నించారు.